సాగునీటి ప్రాజెక్టు పనుల నాణ్యతలో ఎటువంటి రాజీ పడొద్దు: సీఎం రేవంత్ రెడ్డి

by Jakkula.Mamatha |

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గ పరిధిలోని పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ ప్యాకేజీ–2, ప్యాకేజీ–3 కాలువల నిర్మాణ పనుల పురోగతిని సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

సాగునీటి ప్రాజెక్టు పనుల నాణ్యతలో ఎటువంటి రాజీ పడొద్దు: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, కొల్లాపూర్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గ పరిధిలోని పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ ప్యాకేజీ–2, ప్యాకేజీ–3 కాలువల నిర్మాణ పనుల పురోగతిని సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ముఖ్యమంత్రితో కలిసి కాలువల నిర్మాణ పనులను సందర్శించి, జరుగుతున్న పనుల ప్రగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, పాలమూరు ప్రాంతానికి సాగు మరియు తాగునీటి అవసరాలను తీర్చే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంతకు ముందు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల సమీక్షకు విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటిస్తున్నారు.

గురువారం రాత్రి సోమశిల వద్ద ఉన్న అతిథి గృహంలో బస చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి ఉదయం కొల్లాపూర్ లోని మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి విచ్చేయగా స్థానిక ప్రజాప్రతినిధులు పుష్పగుచ్చాలు, మొక్కలు అందజేసి, శాలువాలతో సన్మానించి ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి ఇంట్లో అల్పాహారం తిన్న అనంతరం అక్కడికి విచ్చేసిన పలువురు ప్రజా ప్రతినిధులు, నేతలకు కరచాలనం చేస్తూ మాట్లాడారు. కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేసిన ముఖ్యమంత్రి అక్కడి నుంచి సమీపంలోని ఎల్లూరు పంపు హౌస్ వద్దకు బయలుదేరారు. ఈ పర్యటనలో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ రిజర్వాయర్ డెలివరీ సిస్టర్న్‌ను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, చీఫ్ ఇంజనీర్ విజయ భాస్కర్, ఇంజనీరింగ్ అధికారులు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Next Story