పల్లవిస్తున్న తెలం‘గానం’.. వెండితెరపై మట్టి పరిమళాలు

by  |
Lyric writers
X

దిశ, ఫీచర్స్: తెలంగాణ నేలతో ‘పాట’కున్న బంధం విడదీయరానిది. ఈ నేలను అలుముకున్న ఓ సంబురం, ఓ ఉత్సవం పాట. నిజాం రక్కసిపై ధిక్కార స్వరం వినిపించినా, సాయుధ రైతాంగ పోరాటానికి ఊతమిచ్చినా, గడీల పాలనకు చరమగీతం పాడినా ఆ బలం పాటదే. ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమాన్ని కాగడాలా ముందుండి నడిపింది పాటే. అంతెందుకు పంట చేలల్లో తెలంగాణ ఆడుపడుచులు పాడుకునే ఉయ్యాల పాటల్లోనూ చైతన్య భావాలే కనిపిస్తుంటాయి. అది ఈ నేల గొప్పతనం. అయితే ఈ మట్టి పరిమళాలు పల్లెలకు, ఉద్యమాలకే పరిమితం కాలేదు, వెండితెరపైనా గుభాళించాయి. తెలంగాణ కవుల పాట అంటే విప్లవ గీతాలే అన్న భావనను తుడిచిపెట్టాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’గా కురిపించిన దాశరథి సైతం.. ‘ఖుషీ ఖుషీగా నవ్వుతూ’ అంటూ చలాకీ పాటలను అందించారు. పోరాటాల గడ్డ మీద పుట్టిన ‘సినారె’.. ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని’ అంటూ ప్రేమగీతంతో మొదలెట్టి వేలకు పైగా సినీ పాటలు రాయగలిగారు. ప్రస్తుతం వీరి వారసత్వాన్ని కొనసాగిస్తూ వెండితెరపై తెలంగాణ సాహిత్యాన్ని నిలబెడుతున్న లిరిక్ రైటర్స్‌పై స్పెషల్ స్టోరీ..

నేను సైతం.. సుద్దాల అశోక్ తేజ

సుప్రసిద్ధ ప్రజాకవి, నిజాం వ్యతిరేక పాలనపై గళమెత్తిన సుద్దాల హనుమంతు కుమారుడే సుద్దాల అశోక్ తేజ. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సుద్దాల గ్రామంలో జన్మించిన ఈయన.. ఉద్యోగరీత్యా కొంతకాలం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మెట్‌పల్లిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆ తర్వాత తన అక్క కొడుకైన సినీ నటుడు ఉత్తేజ్‌ సాయంతో సినీ రంగంలో ప్రవేశంచి మొట్టమొదట ‘నమస్తే అన్న’ సినిమాలో ‘గరం గరం పోరి నా గజ్జెల సవ్వారి’ పాట రాశారు. కానీ దాసరి నారాయణరావు తెరకెక్కించిన ‘ఒసేయ్ రాములమ్మా’ సినిమా ద్వారానే ఆయన ప్రతిభకు గుర్తింపు దక్కింది. ఆ సినిమాలో అశోక్ తేజ రాసిన 7 పాటలు తూటాల్లా పేలి, సినిమా విజయానికి కూడా దోహదపడ్డాయి. ఈ క్రమంలోనే 2003లో ‘ఠాగూర్’ సినిమా కోసం రాసిన ‘నేను సైతం’ పాటకు జాతీయ అవార్డు అందుకున్న అశోక్ తేజ.. తన పాతికేళ్ల సినీ ప్రయాణంలో 1200 సినిమాల్లో 2200కు పైగా పాటలు రాసి టాలీవుడ్‌లో ప్రముఖ పాటల రచయితగా కొనసాగుతున్నారు. తెలంగాణ జానపదంపై మంచి పట్టున్న ఈయన.. విప్లవం, జానపదం, శృంగారం, సెంటిమెంట్ అనే తేడా లేకుండా అన్ని రకాల పాటలు రాయడంలో సిద్ధహస్తుడు. ఆరుపదుల వయసులోనూ ‘మెల్లమెల్లగా వచ్చిండే.. క్రీమ్ బిస్కెట్ వేసిండే’ లాంటి యూత్‌ఫుల్ పాటలు రాస్తున్న అశోక్ తేజ.. ‘సారంగ దరియా’ వంటి పాటల్లో తెలంగాణ నేపథ్యాన్ని జోడిస్తూ ఈ నేలకు, పాటకు ప్రాణం పోస్తున్నాడు.

మౌనంగానే ఎదిగిన చంద్రబోస్..

తెలుగు సినీ సాహిత్యంలో తనదైన ముద్రవేసిన చంద్రబోస్ స్వస్థలం వరంగల్ జిల్లా, చిట్యాల మండలం, చల్లగరిగ గ్రామం. హైదరాబాద్ జెఎన్‌టీయూలో ఎలక్ట్రానిక్స్‌‌లో ఇంజనీరింగ్ పూర్తిచేసిన చంద్రబోస్ తొలుత నేపథ్య గాయకుడిగా చాన్స్‌ల కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ తర్వాత ఓ స్నేహితుడి సలహాతో గీతరచయితగా కొత్త ప్రయాణం ఆరంభించాడు. ఈ మేరకు1995లో ముప్పలనేని శివ దర్శకత్వంలో తెరకెక్కిన తాజ్ మహల్ సినిమాలో మొదటిసారిగా పాట రాసే అవకాశం లభించింది. యం.యం శ్రీలేఖ సంగీత సారథ్యంలో ఆయన రాసిన ‘మంచుకొండల్లోన చంద్రమా.. చందనాలు చల్లిపో’ సాంగ్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు. వేటూరి, సీతారామ శాస్త్రి లాంటి లబ్ద ప్రతిష్టులు ఉన్న సమయంలోనే పాటలతో తనదైన ముద్ర వేయగలిగాడు. రవితేజ హీరోగా నటించిన ‘నా ఆటోగ్రాఫ్’ సినిమా కోసం చంద్రబోస్ రాసిన ‘మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది’ పాట ద్వారా స్ఫూర్తి పొందనివారు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ మేరకు ఆది(2002) సినిమాలోని ‘నీ నవ్వుల తెల్లదనాన్ని’ పాటతో పాటు నేనున్నాను(2004) మూవీలోని ‘చీకటితో వెలుగే చెప్పెను’ సాంగ్‌కు నంది అవార్డులు అందుకున్న చంద్రబోస్.. మనం(2014) మూవీలోని ‘కనిపెంచిన మా అమ్మకు’ అనే సాంగ్‌కు ఫిలిం ఫేర్ అవార్డు దక్కించుకున్నారు. ఇక ‘రంగస్థలం’ సినిమాలో ఆణిముత్యాల్లాంటి పాటలందించిన బోస్.. రాబోయే కాలంలో తన కలంతో మరెన్నో సాహితీ కుసుమాలను అందించి తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలనేది సాహిత్యాభిమానుల కోరిక.

రాములో రాములా.. కాసర్ల శ్యామ్

తెలంగాణ ప్రాంతం నుంచి ఇండస్ట్రీకి దొరికిన మరో ఆణిముత్యమే కాసర్ల శ్యామ్. వరంగల్ అర్బన్ జిల్లా, హన్మకొండకు చెందిన ఈ యువ గీత రచయిత ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ లిరిక్ రైటర్‌గా కొనసాగుతున్నాడు. మొదట ఒక జానపద బృందంలో చేరి, పల్లె పల్లె తిరుగుతూ పాటలు పాడిన శ్యామ్.. ఆ అనుభవంతో రాయడమూ నేర్చుకున్నాడు. అలా డిగ్రీ పూర్తవగానే హైదరాబాద్‌కు వచ్చి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తొలుత ప్రైవేట్ జానపద ఆల్బమ్స్ కంపెనీలతో పనిచేస్తూ జానపదాలపై తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఏ ఎంఫిల్ కోర్సులో చేరాడు. ఈ క్రమంలో ‘చంటిగాడు(2003) సినిమాలో పాట రాసే అవకాశం లభించింది. ఇదే క్రమంలో డైరెక్టర్ మారుతి ‘ఈరోజుల్లో, బస్టాప్’ సినిమాల్లో రాసిన ‘ట్రింగ్ ట్రింగ్, కనులకే కనులొచ్చిన’ పాటలు యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇక ‘రౌడీ’ సినిమాలో రాసిన ‘నీ మీద ఒట్టు’ సాంగ్ ఆర్జీవీకి బాగా నచ్చడంతో అందులోని పాటలన్నీ రాసే అవకాశమిచ్చాడు. ఆ తర్వాత మణిశర్మ మ్యూజిక్ డైరెక్షన్‌లో ‘లై’ సినిమాలోని ‘బొమ్మోలె.. ఉన్నదిరా పోరి’తో పాటు ఇస్మార్ట్ శంకర్‌లో ‘దిమాక్ ఖరాబ్, బోనాలు..’ సాంగ్స్‌తో వరుస అవకాశాలు అందుకున్నాడు. ఫైనల్‌గా ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో రాసిన ‘రాములో రాములా..’ శ్యామ్‌ను అందనంత ఎత్తుకు తీసుకెళ్లాయి. ఈ పాట విన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి సైతం శ్యామ్.. నీ పాట నిజంగా నన్ను ఆగం చేస్తోందని చెప్పడం శ్యామ్ ప్రతిభకు నిదర్శనం. ప్రస్తుతం కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ’ మూవీలో అద్భుతమైన పాటలు రాశాడు శ్యామ్.

మానుకోటపై కూసిన కందికొండ..

మహబూబాబాద్ జిల్లా, నర్సంపేట మండలం, నాగుర్లపల్లికి చెందిన కందికొండ యాదగిరి తెలుగు సినిమాల్లో వేయికి పైగా పాటలు రాశాడు. మానుకోటలో సంగీత దర్శకుడు చక్రితో ఏర్పడ్డ పరిచయం తనను సినీరంగం వైపు మళ్లించింది. కెరీర్ తొలినాళ్లలో వీరిద్దరూ కలిసి అనేక ప్రైవేట్ ఆల్బమ్స్ రూపొందించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఎ (తెలుగు లిటరేచర్), ఎం.ఎ. పొలిటికల్ సైన్స్ చేసిన కందికొండ.. తెలుగు సినిమాల్లో సన్నివేశ గీతాలు అనే అంశం మీదా పీహెచ్‌డీ కూడా చేశారు. ఇక పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో చక్రి మ్యూజిక్ డైరెక్టర్‌గా వచ్చిన ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ ద్వారా తొలి పాట రాసే అవకాశం లభించింది. అలా ‘మళ్లీ కూయవే గువ్వా.. మోగిన అందెల మువ్వా’ అంటూ మొదలైన ప్రస్థానం నేటికీ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, నేనింతే, దేశముదురు, మస్కా, మున్నా, స్టాలిన్, బుజ్జిగాడు, పోకిరి, టెంపర్ వంటి చిత్రాల్లో రాసిన పాటలతో మెప్పించాడు. ముఖ్యంగా దేశముదురులోని ‘నిన్నే నిన్నే’ సాంగ్ యూత్‌ను ఉర్రూతలూగించింది. ఇక 2015లో రాసిన బతుకమ్మ సాంగ్..‘చిన్ని నా బతుకమ్మ..చిన్నారక్క బతుకమ్మ’ సాంగ్‌తో పాటు 2016లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాసిన ‘తెలంగాణ జాతి- మా నరనరాన ఉన్నది నీతి’ సాంగ్స్ కూడా జనాదరణ పొందాయి.

Next Story

Most Viewed