వాటికి అలవాటుపడ్డ యువత.. జీవితం నాశనమైనా పట్టించుకోకుండా

by  |
వాటికి అలవాటుపడ్డ యువత.. జీవితం నాశనమైనా పట్టించుకోకుండా
X

దిశ, అశ్వారావుపేట: ఐపీఎల్ బెట్టింగ్ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. ఐపీఎల్ బెట్టింగ్ మాయలో పడి యువకులు ఆర్థికంగా కుంగిపోతున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా బెట్టింగులు కాస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఆన్లైన్ యాప్స్ ద్వారా డబ్బులు అప్పులు తీసుకుంటూ యువకులు బెట్టింగ్ కాస్తున్నారు. కొన్ని చోట్ల మధ్యవర్తిలుగా ఉండి కమీషన్లు తీసుకుంటూ బెట్టింగ్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. యువకులు ఎక్కువగా ఆన్లైన్ ద్వారా బెట్టింగులు కాస్తున్నారు. ఐపీఎల్ బెట్టింగ్ లు పలుచోట్ల గొడవలకు కారణం అవుతున్నాయి.

చిన్నాపెద్ద అనే తేడా లేకుండా క్రికెట్ బెట్టింగ్ లు వేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ బెట్టింగ్ వలన రోజూ లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. యువత ఎక్కువగా ఐపీఎల్ మ్యాచులకే కాకుండా, వేరే దేశాల్లో జరిగే చిన్న చిన్న క్రికెట్ మ్యాచ్ లు కూడా బెట్టింగ్ కాస్తున్నారు అంటే బెట్టింగ్ వ్యసనానికి ఎంతగా అలవాటుపడ్డారో అర్థం చేసుకోవచ్చు. కొంతమంది బెట్టింగ్ నే వ్యాపారంగా మలుచుకోవాలని ఏ రోజు ఏ టీం గెలుస్తుందో అని చెప్పుకుంటూ.. మ్యాచ్ గెలిస్తే తమకు కమీషన్ ఇవ్వాలని జనాలను మోసం చేస్తున్నారు. ఈజీ మనీకి అలవాటు పడ్డ జనం ఆన్లైన్లో ప్రతి బాల్ కు, ప్రతి ఓవర్ కూడా బెట్టింగులు కాస్తున్నారు. తెలిసీ తెలియని వయసులో కొంతమంది యువకులు ఈజీ మనీకి అలవాటు పడి తన జీవిత ఆశయాలను నెరవేర్చలేక పోతున్నారు.

బెట్టింగ్ కు పాల్పడే వారిపై నిఘా..

క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడేవారిపై నిఘా ఏర్పాటు చేశాం. బెట్టింగులు పాల్పడుతున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. పట్టుబడితే గేమింగ్ యాక్ట్ ద్వారా కేసులు నమోదు చేస్తాం. యువత బెట్టింగ్ లకు అలవాటు పడకుండా జీవిత ఆశయాలు పై దృష్టి సారించాలి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.

– అశ్వారావుపేట సీఐ ఉపేంద్రరావు


Download Dishadaily Android APP

Download Dishadaily IOS APP



Next Story

Most Viewed