సామాన్లు ఒడ్సినయ్..

by  |
సామాన్లు ఒడ్సినయ్..
X

దిశ, నల్లగొండ: రాష్ట్రంలో సరుకులు నిండుకుంటున్నాయి. షాపులు, సూపర్‌ మార్కెట్లు ఖాళీ అవుతున్నాయి. నెలన్నరగా ప్రొడక్షన్‌, మ్యాన్‌ఫాక్చరింగ్‌ పూర్తిగా తగ్గిపోయింది. దీంతో కొన్ని చోట్ల నో స్టాక్‌ బోర్డులు కూడా దర్శనమిస్తున్నాయి. లేబర్‌ లేకపోవడంతో కొద్ది మేర ఉన్న సరుకుల రవాణా కూడా కష్టమవుతోంది. ప్రస్తుతం ఉన్న అరకొర వస్తువులనే అధిక ధరలకు అమ్ముతున్నారు. చేసేదేమీ లేక ప్రజలు కొనుగోలు చేయక తప్పడంలేదు.

సరుకులు అయిపోతున్నయ్‌..

మార్చి 23 నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. దీని ప్రభావం నిత్యావసర సరుకులపై పడింది. అనేక షాపుల్లో చింతపండు ఉంటే మసాలా దినుసులు ఉండటం లేదు. నూనె ఉంటే గోధుమ పిండి ఉండటం లేదు. బిస్కెట్లు ఉంటే సోప్స్‌ ఉండటం లేదు. దీంతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. గ్రామాల్లో ఉంటున్న చిన్న దుకాణాల నుంచి నుంచి ప్రధాన పట్టణాల్లో ఉన్న స్టోర్స్‌, సూపర్‌ మార్కెట్లలో సరుకులు అయిపోతున్నాయి. సాధారణంగా షాపులు, మార్కెట్లలో 10 నుంచి 15 రోజులకు సరిపోయే సరుకు ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇక రెండోసారి లాక్‌డౌన్‌ ప్రకటనతో కొందరు మూడు నెలలకు సరిపడా సరుకులను కొనుగోలు చేశారనీ, సరుకుల కొరతకు ఇది కూడా ఓ కారణమని చెబుతున్నారు. కొన్ని చోట్ల అంతో ఇంతో ఉన్నా వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

ప్రొడక్షన్‌ తగ్గింది..

లాక్‌డౌన్‌తో అన్ని రకాల కార్యకలాపాలు ఆగిపోయాయి. ఇందులో అనేక రకాల కంపెనీలు, ఇండస్ట్రీస్‌ ఉన్నాయి. వాటిపై లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ బాగా పడింది. కర్ఫ్యూతో ప్రజలు కూడా ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. ముఖ్యంగా కంపెనీలు, ఇండస్ట్రీస్‌ బంద కావడంతో కార్మికులు ఇళ్లకే పరిమితయ్యారు. రాష్ట్రంలో 1,63,302 సూక్ష్మ, మధ్య, తరహా పరిశ్రమలు ఉండగా, ఇందులో 9,80,520 పనిచేస్తున్నారు. 2,493 భారీ పరిశ్రమల్లో మరో 9,65,050 మంది ఉపాధి పొందుతున్నారు. లాక్‌డౌన్‌తో ఇందులో 90శాతానికి పైగా పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో ఆయా కంపెనీల్లో ప్రొడక్షన్‌ ఆగిపోయింది. అయితే, కొన్ని అత్యవసర కంపెనీలకు మినహాయింపు ఇచ్చినప్పటికీ కార్మికులు లేకపోవడంతో ప్రొడక్షన్‌ ముందుకు సాగలేదు. ఇప్పటి దాకా లాక్‌డౌన్‌ కంటే ముందు ఉన్న సరుకులతోనే ఇన్ని రోజులు నెట్టుకొచ్చారు. లాక్ డౌన్ అమలుతో ట్రాన్స్‌పోర్ట్‌కు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలోని జిల్లాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి అనేక రకాల సరకులు వివిధ ప్రాంతాలకు రవాణా అవుతుంటాయి. లాక్ డౌన్‌తో సరఫరా ఆగింది. నిత్యావసరాల రవాణాకు మొదటి నుంచి అనుమతి ఉంది. కానీ, డ్రైవర్లు, హమాలీల కొరతతో ట్రాన్స్‌పోర్ట్‌ కష్టంగా మారింది. బయటకువస్తే పోలీసులు లాఠీలకు పనిచెప్పడంతో అనేక మంది డ్రైవర్లు, హమాలీలు ఎక్కడికక్కడ స్టక్‌ అయిపోయారు. దీంతో కొన్ని చోట్ల సరుకులు ఉన్నా రవాణాకు ఇబ్బందులు తప్పలేదు.

అధిక ధరలకు అమ్మకాలు..

సరుకుల కొరత పేరుతో అనేక మంది కిరాణా వ్యాపారులు అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రతి వస్తువుపై ఎమ్మార్పీ కంటే అదనంగా డబ్బులు తీసుకుంటున్నారు. రూ. 2 నుంచి రూ. 10 వరకు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. ఇక లూజ్‌ సరుకులపై డబుల్‌ రేట్‌ తీసుకుంటుండటం గమనార్హం. ఇదేంటని కస్టమర్స్‌ ప్రశ్నిస్తే ‘స్టాక్‌ లేదు. ఇష్టముంటే తీసుకో.. లేకుంటే లేదు’ అని కిరాణా వ్యాపారులు అంటున్నారు. దీంతో చేసేదేమీ లేక తప్పనిసరి పరిస్థితుల్లో కస్టమర్స్‌ కొనుగోలు చేస్తున్నారు. అయితే అధిక ధరల అమ్మితే చర్యల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టాస్క్‌ఫోర్స్‌ టీంను ఏర్పాటు చేసినా లాభం ఉండటంలేదని కస్టమర్స్‌ వాపోతున్నారు.

అన్ని రకాల వస్తువులు ఉండటం లేదు..

గతంలోలాగా ఆర్డర్‌ చేస్తే కావాల్సిన వస్తువులు సప్లై చేసేవాళ్లు రావడం లేదు. కస్టమర్స్‌ వస్తున్నప్పటికీ అన్ని రకాల వస్తువులు ఉండటం లేదు. ఉన్న వాటినే అమ్ముతున్నం. ఆదాయం కూడా దెబ్బతింది. రెండో సారి లాక్‌డౌన్‌ ప్రకటన తర్వాత కొంత మంది ఎక్కువనే సామాను తీసుకపోయిరు. – వెంకటేశ్వర్లు, దుకాణ యజమాని

Tags: goods, no stock, small, medium merchants, lock down effect, covid 19, customers


Next Story

Most Viewed