- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కులం పునాదులపై దేశాన్ని నిర్మించలేరు..
కులం పునాదులపై మీరు ఏమీ నిర్మించలేరు. మీరు ఒక దేశాన్ని నిర్మించలేరు. అంబేద్కర్ చెప్పిన ఈ విషయం ఇప్పటిది కాదు .దళితుల పట్ల, హిందూ మతం తరతరాలుగా కొనసాగించిన దౌర్జన్యానికి అమానుషత్వానికి చరమగీతం పాడాలని ఉద్యమం చేసారు. అప్పటి అసెంబ్లీలో ఎన్నో సార్లు గట్టిగా తమ నిరసన తెలియచేసారు..

కులం పునాదులపై మీరు ఏమీ నిర్మించలేరు. మీరు ఒక దేశాన్ని నిర్మించలేరు. అంబేద్కర్ చెప్పిన ఈ విషయం ఇప్పటిది కాదు .దళితుల పట్ల, హిందూ మతం తరతరాలుగా కొనసాగించిన దౌర్జన్యానికి అమానుషత్వానికి చరమగీతం పాడాలని ఉద్యమం చేసారు. అప్పటి అసెంబ్లీలో ఎన్నో సార్లు గట్టిగా తమ నిరసన తెలియచేసారు. ఆ ప్రసంగాలు అన్నీ కూడా ఒక పుస్తకంలా తీసుకు రావాలని సంకల్పించి అంబేద్కర్ అసెంబ్లీలో ప్రసంగించాలి అనుకున్న వాటిని తెలుగులో అనువాదం చేసారు మోహన్ తలారి..దాని పేరు కులం, పుట్టుక నిర్మూలన . అప్పటి అసెంబ్లీలో ఈ ప్రసంగ పాఠాలు చాలామందిని తనని శత్రువుగా చేస్తాయని తెలిసినా కూడా వెనుకంజ వెయ్యక వినిపించాలి అనుకున్నారు.
బానిసలను చేసిన హిందుత్వం..
రెండు భాగాలుగా ఉన్న ఈ పుస్తకంలో భారత దేశంలో కుల ఏర్పాటు అభివృద్ధి నిర్మూలన వీటి గురించి చాలా వరకు అందరికీ అర్థమయ్యే రీతిలో అనువదించారు. దళితుల జీవితంలో హిందుత్వం ఎంతగా చొచ్చుకుపోయింది అంటే ఆ కాలంలో బ్రాహ్మణుడు చెప్పిందే వేదం. మనుస్మృతిని గుడ్డిగా అనుసరించి, హేతుబద్ధంగా ఆలోచించక ఇంకా వారి అణచివేత వల్లనే తమ బతుకులు బానిసలా ఉండాల్సి వచ్చింది అని ఆవేదన చెందారు
కులం తొలగాలంటే ఏకైక మార్గం..
కులం పట్ల అంబేద్కర్ అభిప్రాయాలను 'కుల విధ్వంసం' పుస్తకంలో విస్పష్టంగా చెప్పారు. దీనిలో భారతీయ సమాజంలో కులం సృష్టిస్తున్న విధ్వంసాన్ని సమగ్రంగా విశ్లేషించారు. కులాన్ని విచ్ఛిన్నం చేయడానికి నిజమైన పరిష్కారం కులాంతర వివాహాలు. కులాన్ని తొలగించడానికి మరేదీ పరిష్కారం కాదు. అని బలంగా నమ్మారు కనుకనే కులాన్ని తొలగించాలి అంటే కులాంతర వివాహాలు తప్పనిసరి అని భావించారు.
శూద్రులను శాశ్వతంగా అణిచేశారు..
ఇండియాలో మేధావి వర్గం అంటే కేవలం బ్రాహ్మణ కులానికి మరో పేరు. అయితే, అందరి బాగోగులు పట్టించుకోవాల్సిన మేధావి వర్గం కేవలం బ్రహ్మణ కులానికి పరిమితం కావడం దురదృష్టం . ప్రపంచ వ్యవస్థలో చాతుర్వర్ణ వ్యవస్థ కలిగిన సంఘం ఇంకా ఎక్కడ లేదు. కేవలం ఇండియాలో మాత్రమే ఉంది. ప్రజలని జీవచ్ఛవాలుగా, ఎందుకూ పనికి రాని దద్దమ్మలుగా చేసిన వ్యవస్థ ఇది. దీనికి చరిత్రే సాక్ష్యం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాల మధ్య సామరస్యం లేకపోయినా మూడు కులాలు కలిసి ఎలాగో బతకడం నేర్చుకొని, శూద్రుని అణగదొక్కడం కోసం ఈ మూడు కులాలు ఒక్కటి అవుతాయి. శూద్రుడు చదివితే, తమ హక్కులకు భంగం. శూద్రుడు దనం సంపాదించకూడదు, అలా చేస్తే తమ చెప్పు చేతల్లో ఉండరు, అలాగే ఆయుధాలు పట్టకూడదు ఆలా పడితే అధికారం చేజారిపోతుంది .. అందుకే శూద్రులను ఎప్పటికీ పైకి రానివ్వకుండా అణిచివేసారు అంటారు అంబేడ్కర్.
జాతీయోద్యమం కన్నా కుల నిర్మూలన క్లిష్టం..
ఈ పుస్తకం చివర్లో అంబేద్కర్ తాను హిందూ జాతిలో ఉండబోను అని ..అయితే దళిత జాతి పోరాటానికి బయటనుంచి అయినా మద్దతు ఇస్తాను అని చెప్తారు. స్వరాజ్యం కోసం జాతీయ ఉద్యమం కన్నా కులం నిర్మూలించడం కోసం కంకణం కట్టుకున్న జాతీయ ఉద్యమం ఎక్కువ క్లిష్టం, కష్టతరం ..కుల నిర్మూలన కోసం పోరాడుతున్నప్పుడు జాతి మొత్తం వ్యతిరేకంగా నిలుస్తుంది అని, అయినా కూడా స్వరాజ్య సాధన కంటే కుల నిర్మూలనే ముఖ్యం అయింది అని, దాని కోసం దళిత జాతి మొత్తం ఏకం కావాలి అని ప్రేరేపిస్తారు.
పాఠకులకు చేరువ చేసిన అనువాదం..
ఈ అనువాద పుస్తకం మొత్తం సారాన్ని ఇక్కడ చెప్పడం కుదరకవచ్చు కానీ, దాని భావం అయితే కుల నిర్మూలన కోసం దళితులు చెయ్యాల్సిన కార్యాచరణ. దీన్ని మాత్రం చక్కగా వివరించారు. అప్పటి సభలో ఈ ప్రసంగాలు ఎక్కడ ఉద్యమంకి దారి తీస్తాయో అని ప్రసంగించకుండా అడ్డుపడ్డారు అప్పటి పాలకులు. అయినా కూడా ఇవి చాలా ప్రేరణ ఇస్తాయి. కులం పుట్టుక నిర్మూలనలో అంబేద్కర్ రాసిన ప్రసంగాలని తెలుగులోకి అనువాదం చెయ్యడం అంత సులువు ఏమి కాదు ....పందొమ్మిదో శతాబ్దం ఇంగ్లీష్‌ని, వాటి సమాన అర్ధాలని తెలుగు పాఠకులకి అర్థం అయ్యేలా చెప్పడం అంత సులువు ఏమి కాదు ..అనువాద సమస్యల్ని అధిగమించి మోహన్ తలారి అంబేద్కర్ ఐడియాలిజిని పాఠకులకి మరింత చేరువ చేసాడు. దానికి తలారికి అభినందనలు..
పుస్తకం: కులం పుట్టుక, నిర్మూలన
అంబేద్కర్ ప్రసంగాల పాఠం
రచయిత: అంబేడ్కర్
అనువాదకుడు: మోహన్ తలారి
వెల: రూ. 150
ప్రచురణ: ఎన్నెలపిట్ట
ప్రతులకు: 7989546568
సమీక్షకులు
-పుష్యమీ సాగర్
79970 72896






