- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

ప్రముఖ రచయితలు ఏనుగు నరసింహారెడ్డి, సత్యాజీ, శాంతి కృష్ణ సంపాదకులుగా 12 ప్రపంచ ప్రఖ్యాత గ్రంథాలను పరిచయం చేస్తూ.. పాఠకుల ముందుకు వచ్చిన గొప్ప పుస్తకం విశ్వ సాహిత్యం. 2024 జనవరి - 2025 ఫిబ్రవరి మధ్య 'తెలుగు సాహితీవనం సమూహం' జూమ్ వేదికలో ప్రతినెలా జరిపిన ధారావాహికలో వక్తలు చేసిన ప్రసంగాల అక్షర రూపం ఈ పుస్తకం.
హోమర్, షేక్ స్పియర్ర్, చార్లెస్ డికెన్స్, మాక్సిమ్ గోర్కి వంటి పలు తరాలను ప్రభావితం చేసిన విఖ్యాత రచయితల పుస్తకాల సారాన్ని, విభిన్న చారిత్రక సందర్భాలకు, పరిణామాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రచనలను ఒకే పుస్తకంలో ప్రస్తావించడం మరో ముందడుగుగా అభివర్ణించారు రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి. సాహిత్యానికి భాష ఒక మాధ్యమం మాత్రమే కానీ, భాష మాత్రమే సాహిత్యం కాదు. భాషలకతీతంగా, ప్రాంతాలకతీతంగా, మతాలకతీతంగా, దేశాల సరిహద్దులకతీతంగా సాహిత్యం ఆలోచిస్తుందంటున్నారు డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి.
ప్రపంచ సాహిత్య పరిమళం తెలుగులో..
ఒకే లాంటి అనుభవాలు మనుషుల్ని ఒక్కటి చేస్తాయి. అవి సమస్యలు కావచ్చు. సంతోషాలు కావచ్చు. ఒకేలాంటి కుదురులోంచి మొలకెత్తిన అనుభూతులు ఉమ్మడితనాన్ని పంచుతాయి. దగ్గరితనాన్ని పెంచుతాయి. సాహిత్యం కూడా అంతే! అంటున్నారు సత్యాజీ. ప్రపంచ సాహిత్య ప్రస్థాన ప్రభావ పరిమళాన్ని తెలుగు భాషలోకి మార్చి అరచేయిలోకి తీసుకున్న గొప్ప అనుభూతిని అందించిన తెలుగు సాహితీ వనం వ్యవస్థాపక అధ్యక్షులు శాంతి కృష్ణ మేడం కృషిని అందరూ మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే.
వెలకట్టలేని పుస్తకాల మాల..
కస్తూరి మురళీకృష్ణ, చెలమచర్ల భాస్కర్ రెడ్డి, డా.ఏనుగు నర్సింహారెడ్డి, డా. చెమన్ సింగ్, స్వాతి శ్రీపాద, వాడ్రేవు చిన్న వీరభద్రుడు, డా. బెల్లంకొండ సంపత్ కుమార్, డా. చంద్రలత, డా. అంపశయ్య నవీన్, సత్యాజీ, బొడ్డపాటి చంద్రశేఖర్, కొల్లూరు సోమశంకర్ వంటి రచయితలు 12 ప్రపంచ ప్రఖ్యాతి పొందిన పుస్తకాలను సమీక్షిస్తూ వెలకట్టలేని విలువైన పుస్తకాన్ని మనకు అందించారు. ఆత్మకథకు అద్దిన ఆదర్శంగా డేవిడ్ కాపర్ ఫీల్డ్, పేదరిక వేదనల ప్రతిబింబంగా లెహ్ మిసరబుల్స్, ఏడు తరాల దీనగాధగా రూట్స్, అంతర్లీన ప్రేమల వాస్తవీకరణగా జమీల్యా, మానవ ప్రేరణకు ప్రతిబింబంగా ది ఓల్డ్ మాన్ అండ్ ది సీ, బంధనాల విముక్తితోనే ప్రేమ పరిమళంగా గాడ్స్ పాపర్, ఒక అద్భుత కళాఖండంగా మర్చంట్ ఆఫ్ వెనిస్, నిరంకుశత్వం పై వ్యంగ్యాస్త్రంగా ది టిన్ డ్రమ్, మానవ సంబంధాల విశ్లేషణగా ఆఫ్ హ్యూమన్ బాండేజ్, ప్రపంచాన్ని కదిలించిన అమ్మగా ది మదర్, మాయా వాస్తవికతతో మరో ప్రపంచంగా వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్, మహా ఇతిహాసంగా ఒడిస్సీ అంటూ ఇందులోని వ్యాసాలు విభిన్న జీవన సాహితీ ప్రక్రియ స్వరాలకు అందమైన సంగీత చిత్రంగా పుస్తకతెరకెక్కాయి.
చందాలు వేసుకుని చదివించిన హ్యుగో
చార్లెస్ డికెన్స్ హృదయ ఉదయపు లోతుల్లోని స్పందనలు అక్షర రూపం ధరించి అతని భావాలను, ఆవేశాలను, ఆవేదనను ప్రతిబింబించేలా... గడియారం 12 గంటలు కొడుతూండగానే, ఏడుస్తూ తాను జన్మించానని డేవిడ్ కాపర్ ఫీల్డ్ తన గురించి తానే చెప్తూండటంతో కథ ఆరంభమవుతుంది. ఈ కథలో వైవాహిక వ్యవస్థ పట్ల రచయిత లోతైన అవగాహన స్పష్టంగా కనిపిస్తుంది. జీన్ వాల్ జీన్ అనే ఓ గొప్ప క్యారెక్టర్ ను సృష్టించిన విక్టర్ హ్యూగో నవలను డబ్బులు లేక కొనలేని వాళ్లు పదిమంది కలిసి చందాలు వేసుకుని ఆ పుస్తకాన్ని కొని చదివే వాళ్ళట అని తెలిసినప్పుడు లెహ్ మిసరబుల్స్ ఎంత అత్యుత్తమ పుస్తకమో మనకు తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీదల కష్టాలన్నీ ఒకే దగ్గర పోగేసిన విధంగా రచయిత తీర్చిదిద్దారు.
రష్యన్ నవలలు ఎవర్ గ్రేట్
చింగీజ్ ఐత్ మాతోవ్, మాక్సిం గోర్కి, లియో టాల్ స్టాయ్ వంటి రష్యన్ రచయితలు భారతీయ పాఠకులను, సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. జమీల్యా నవల పాఠకుల మనసుల్లో చెరగని ముద్ర వేస్తుంది. ఒక వృద్ధ, అనుభవజ్ఞుడైన మత్స్యకారుడికి, అతని జీవితంలోని గొప్ప చేప వేటకూ మధ్య జరిగిన పోరాటానికి సంబంధించిన కథగా ఎర్నెస్ట్ హెమింగ్వే - ది ఓల్డ్ మాన్ అండ్ ది సీ రచన ఆసక్తికరంగా సమీక్షించారు స్వాతి శ్రీపాద. తనలో సంఘర్షిస్తున్న రెండు విరుద్ధ ధోరణుల్ని సమన్వయ పరచుకోవడం కోసం నికోస్ రాసిన నవల గాడ్స్ పాపర్‌ను ఉద్దేశిస్తూ... సెయింట్ ఫ్రాన్సిస్, టాల్ స్టాయ్, గాంధీ వంటి వారు కూడా ఈ ప్రపంచంలో జీవించారనీ, మనలాగే వారు కూడా దేహానికీ, దైవానికీ మధ్య నలిగిపోయారనీ, కాని చివరికి వాళ్లు తమ చీకటిని జయించారనీ తెలుసుకోవడంలో గొప్ప ఓదార్పు, ధైర్యం, సంతోషం ఉన్నాయని ఎన్నిసార్లయినా చెప్పాలనిపిస్తుంది అనడం ఓ అద్భుతం. భాషను సుసంపన్నం చేయడంతో పాటు షేక్స్పియర్ చిరస్మరణీయ పాత్రలను సృష్టించి ఎన్నో ఉల్లేఖనాలు, శాశ్వతంగా మిగిలిపోయేటట్టు నాటకాలు తీర్చిదిద్దారు. ప్రపంచ యుద్ధానికి దారి తీసిన పరిస్థితులను, ఆనాటి యుద్ధ బీభత్సాన్ని... విధ్వంస పరిణామాలను గురించి ఎటువంటి దాపరికాలు లేకుండా గంటర్ గ్రాస్ రచించిన నవలే ది టిన్ డ్రమ్. 'నువ్వు నిజం చెప్తున్నావా అబద్దమా' నేను కథ చెబుతున్నాను. అంటూ చంద్రలత ఈ నాటకాన్ని గొప్పగా పండించారు.
మానవ మహా ఇతిహాసం ఒడిస్సీ
ఇలా ఒక్కొక్కటి చదువుతూ ఆస్వాదిస్తూ..ఆనాటి పరిస్థితుల్లో ప్రత్యక్ష సాక్షిగా జీవిస్తూ... చివరికి క్రీస్తుపూర్వం ఎనిమిదో శతాబ్దానికి చెందిన హోమర్ ఒడిస్సీ అనే మహా ఇతిహాసంలోకి వెళ్ళిపోతాం. ముఖ్యంగా విశ్వ సాహిత్యాన్ని పుస్తకంగా సామాజిక జీవనంలోకి తీసుకురావడంలో శాంతి కృష్ణ మేడం అంకితభావంకు రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ పుస్తక ప్రయాణం ఇంకా సాహితీ అంతరిక్షంలో విస్తృతంగా పర్యటిస్తుందనీ, ఇలాంటి ఎన్నో పుస్తకాలతో భవిష్యత్తులో పదేపదే పలకరించాలనీ.. ప్రభావితం చేయాలనీ.. మనస్ఫూర్తిగా అభిలషిస్తున్నాను.
పుస్తకం: విశ్వ సాహిత్యం
సంపాదకులు: ఏనుగు నరసింహారెడ్డి
సత్యాజీ, శాంతి కృష్ణ
ప్రచురణ: (తెలుగు సాహితీ వనం)
పేజీలు:127. వెల: రూ.120
ప్రతులకు: శాంతి కృష్ణ
95022 ౩౬౬౭౦
సమీక్షకులు
ఫిజిక్స్ అరుణ్ కుమార్
93947 49536






