- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సృజన కళల అంతరంగాల 'కరచాలనం'
ఏదైనా చూస్తే ఏమున్నదనే భావన కలగడం సహజమో, అసహజమో చెప్పలేను కానీ, సృజన ఎంత కష్టమో మనసుపెట్టి చెయ్యి పట్టి రాస్తే తెలుస్తుంది.

ఏదైనా చూస్తే ఏమున్నదనే భావన కలగడం సహజమో, అసహజమో చెప్పలేను కానీ, సృజన ఎంత కష్టమో మనసుపెట్టి చెయ్యి పట్టి రాస్తే తెలుస్తుంది. ఆ తపన, ఆ ఆలోచన, ఆ కృషి ఎంత గొప్పదో చెప్పడానికి. మొహబ్బత్ కీ షరారత్ సే నికిలీ గయీ రస్ ధున్ హై యే పసీనా. ప్యార్ కా ఆంగన్ మే జిగర్ కరీసో జిగ్రీకా ఖోజ్ హై వర్నా ధర్తీపే నిభాకే నాచీంగే నహీ. ఆనంద్ కరచాలనం 27 మంది కలాలు, కళాకారులతో పాటు 2 భాషా సోపతులతో చేయడమే కాదు మన చేతులకూ ఆ వాసన పట్టించడమూ గొప్ప కళాత్మకత. కవిత్వం, సృజనాత్మక సినిమా, కవులూ, కళాకారుల జీవన కళా జీవితం కలిసిన త్రివేణి సంగమమే ఈ కరచాలనం. ఇందులో గొప్ప సాహిత్యం, కవిత్వం, సృజనాత్మక సినిమా కళలు ఆవిష్కరించిన కలాలను, కళాకారులను స్పృషించిన తీరు ఉత్తమమైనది, ఉన్నతమైనది కూడా. అందులో గుల్జార్ సాహెబ్ గురించి తను రాసుకున్న అంతరంగాన్ని ఆనంద్ మన ముందు పరిచారు.
'కరచాలనం' నిజంగానే కరచాలనం అనేలా కనిపిస్తున్నది. ఇందులోని కవులూ కళాకారులతో మాట్లాడొచ్చు. లేదా వారి సృజన చదువొచ్చు. అయినా ఈ కరచాలనం చదివాక కవులు కళాకారులు వారి అభిప్రాయంగా ఇందులో విషయం చాలా వివరణాత్మకంగా లోతుగా విశాలంగా ఉందని చెప్పడమే గొప్ప మాట. ఇక గుల్జార్‌తో మొదలైన కరస్పర్శ రవీంద్రనాథ్ ఠాగూర్, ఖలీల్ జీబ్రాన్, ఒరియా కవిత్వం, బోడో భాషా సాహిత్యాలతో ఆత్మీయ సాహిత్య అనుబంధాన్ని అందించింది కూడా. ఎందరో ప్రతిభావంతులు, ప్రభావశీలురు సాహిత్య కళా సీమల్లో విహరించి సేదదీరిన వారి కృషిని మన ముందుంచిన వారాల ఆనంద్ కృషి గొప్పది అర్థవంతం కూడా.
కవిత్వం ఓ తాత్విక ధార
ఇందులో అనువాద కవిత్వంతో, గద్యంలో, పద్యం ఫీల్ బాటసారి దాహార్తిని తీర్చిన అవకాశం సాహిత్య లోకాన్ని కుంభమేళాలో తన్మయ పరచడం వంటిదే. కవి గొప్ప సినీ దర్శకుడు లివింగ్ లెజెండ్ గుల్జార్, ప్రసిద్ధ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, అస్సామీ చలనచిత్ర వైతాళికుడు, కవి సంగీత దర్శకుడు జర్నలిస్ట్ గాయకుడు భూపేన్ హజారికా స్త్రీ స్వేచ్చా స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వంత గొంతుక గొప్ప పంజాబీ కవయిత్రి, రచయిత్రి అమృతా ప్రీతం. ఓ సినిమా ఉద్యమం కవి, నటి. రచయిత్రి దీప్తి నావల్, నటుడు, నాటకకర్త దర్శకుడు గిరీష్ కర్నాడ్ ప్రొఫైల్స్ చక్కగా చెక్కారు. ఇక ఖలీల్ జీబ్రాన్ విశ్వకవి. సత్య శోధన తపనగల మహా దార్శనికుడు. ఆయన ఒక కవిత్వం తొలిచిన జీవితంలో గొప్ప తాత్విక ధార.
సరకు కానిది కవిత్వం
మలయాళంలో గొప్ప ఆధునిక కవి కె.సచ్చిదానందన్. ప్రపంచీకరణ మార్కెట్‌లో ఇప్పటికీ వినిమయ వస్తువు కానిది కవిత్వమని నమ్మిన కవి. ఆయన గొప్ప అనువాదకుడు కూడా. హాల్దార్ నాగ్ ఒరియా కోస్లి భాషల కవి. ప్రకృతి కవిత జీవన వాస్తవికత ఈయన కవిత్వం సొత్తు. ఇంకా ఏడు రామాయణాల్లో ఎక్కడా కనిపించని, ఎవరూ పొగడని స్త్రీమూర్తిని కీర్తిస్తూ ఆమె నాలోని కవికి గొప్ప మహిళ అంటాడు. స్వచ్ఛమైన శక్తి అంటాడు. ఇది చాలు అతడు మంచి కవి మానవీయ కవి అని చెప్పేందుకు. పద్మాసచ్ దేవ్ డోగ్రీలో తొలి కవయిత్రి. ఆమె కథా రచయిత్రి. డోగ్రీ భాష గొప్ప వాగ్గేయ కారిణి. మంగలేష్ దాబ్రాల్ గొప్ప హిందీ కవి. తన కవిత్వం ద్వారా సమాజ చైతన్యం కోరిన సామాజిక కవి మంగలేష్ దాబ్రాల్. ఈ కవులూ సృజనకారుల్లోనూ గల గొప్ప అంశం సామాజిక ప్రగతిశీల స్టింజ్. కవులు కళాకారులందరిలోనూ ప్రభావశీలత సమానత స్త్రీ స్వేచ్ఛ సమానత్వం కోణం పార్శ్వాలు కనిపిస్తున్నవి.
కవిత్వం సత్యాగ్రహం చేయడమే
ఈ వ్యక్తులను, కవులను, కళాకారులను ఎన్నుకొని ఎంతో శ్రమకోర్చి అధ్యయనం చేశారు వారాల ఆనంద్. పుస్తకరూపంలో కరచాలనం చేసి మన ముందుంచారు మనల్నీ వారితో షేక్ హార్ట్ హేక్ హ్యాండ్ చేయమంటూ. అభినందన ధన్యవాదాలు ఆనంద్ కృషికీ, సృజనకు. ఇక కనిమొళి కరుణాకరన్. కనిమొళి అనగా తేనెలొలికే భాష. అంతే తీయ్యని భాషలో పదును కవిత్వం కనిపిస్తుంది. తండ్రి కరుణానిధి గొప్ప కవి. రాజకీయ నేత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. ఆ ప్రభావం కనిమొళి కవిత్వంలో రాజకీయ జీవితంలోను కన్పించకుండా ఉండదు. అశోక్ వాజ్‌పేయ్ ప్రేమను, మనిషిలో దాని ఆవశ్యకత జీవన ప్రధానాంశంగా ఉండాలంటారు. కవిత్వం రాయడం సత్యాగ్రహం చేయడమని ఇదో నాగరిక సామాజిక విశ్లేషణగా చెతనలో ఉందన్నారు. ఈ హిందీ కవిలో రామచరితమానస్ మాక్సింగోర్కీ అమ్మ ప్రభావం ఎంతో ఉందన్నారు.
లౌకిక స్వర కవులు..
విశాల్ భరద్వాజ్ తన సృజనాత్మక వైశాల్యాన్ని విస్తృత పరుచుకున్న సృజనకారుడు కవి టాగూర్, గుల్జార్, సత్యజిత్ రే ల్లాగా. ఈయన దర్శకుడుగా కవిగా గొప్ప సృజన చేశాడు. సుగత కుమారి మాసాల కవయిత్రి. పర్యావరణం మహిళా సాధికారతపై విశేష కృషి చేస్తూ ఉద్యమాలు నడిపించిన ఘన చరిత్ర ఈమెది. పోరాటాల జీవిత కుసుమ కవిత్వం సుగత కుమారి సొంతం. అలాగే అనంతమూర్తి కర్ణాటక కవి. కథా నవలాకారుడు కూడా. ఆయన రచనల్లో ఆధునికులతో సంప్రదాయం, సంప్రదాయవాదుల్తో ఆధునికత గురించి మాట్లాడే మంచి విద్యావేత్త. ఇక తొలి తుది కళాకారుడు కవే అని చెప్పిన గోపీచంద్ నారంగ్ గొప్ప సాహిత్య విమర్శకుడు. ఆయన ఉర్దూ, హిందీ, ఇంగ్లీషులలో రాశారు. సాహిత్య సిద్దాంతాలను ఔపోసన పట్టిన గొప్ప సాహితీవేత్త. చాలా ప్రతిభావంతుడైన కవి. గొప్ప లౌకిక స్వరం. సీరియస్ కవిగా ప్రఖ్యాతి. స్క్రీన్ ప్లే రైటర్ కూడా. కాలం గురించి ఎక్కువగా కవితలు రాసిన కవి జావేద్ అఖ్తర్.
సత్యం చెప్పడమే కవిత్వ బాధ్యత
జయంత్ మహాపాత్ర ఒరియా ఆంగ్ల భాషల్లో గొప్ప కవి, అంతర్జాతీయ కవి కూడా. భౌతిక శాస్త్ర అధ్యాపకుడైన జయంత్ మహాపాత్ర మహాకవి. ఆయన కవిత్వం నిండా నాస్టాల్జియా ఉంటుంది. కాలం ముఖ్య భూమిక పోషిస్తుంది. ఆయన లేని లోటు కవిత్వానికే కాదు మొత్తం కవితావనికీ కూడా. దేశభక్తి కవి భక్తి గీతాలు ఎక్కువగా ఉండే కవిత్వం కవి ప్రదీప్‌దే. అలాగే కున్వర్ నారాయణ కూడా ప్రతిభావంతమైన హిందీ కవి, విమర్శకుడు, అనువాదకుడు కూడా. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన మమంగ్ దాయి గొప్ప కవి. సామాజిక వాస్తవికతలో ఆమె రచనలు సాగాయి. ఇక్కడ ప్రకృతి రహస్యమైనది. పురాణాలతో పచ్చగా ఉంటుంది అంటూ సరళంగా కవిత్వం రాసే గొప్ప శక్తి. శంఖా ఘోష్ బెంగాలీ కవి. టాగూర్ వలె సమాజాన్ని ప్రభావితం చేశారు. సత్యం చెప్పడమే కవిత్వం ప్రధాన బాధ్యత లక్ష్యంగా చెప్పారు. సీతాకాంత్ మహాపాత్ర ప్రసిద్ధ ఒరియా కవి.
చివరగా వారాల ఆనంద్ తన ముందు మాటలో చెప్పినట్టు సృజనకారుడి పాత్ర ఒక జాతిని నిలబెట్టడంలోనూ ఆ జాతి ప్రేమగానూ, స్నేహంగానూ ఆర్తితోనూ రూపొందే క్రమంలో విశిష్టమైనది. ఆ క్రమంలోనే కరచాలనం వెచ్చగా ఉండి నాలుగు ఆకుపచ్చ కవితలనిచ్చి ఇరుగు పొరుగు యాదోంకీ బారాత్‌ను సొంత ఊరులో ఆవిష్కరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీతైన వారాల ఆనంద్ లోని కవిత్వ కళాతృష్ణకు, అనువాద స్పృహకు ఇదో మచ్చుతునకగా ఉందని నా భావన. మరోసారి వారాల ఆనంద్‌కు ధన్యవాదాలు. శుభాకాంక్షలు.
పుస్తకం: కరచాలనం (తొలి భాగం)
అనుసృజన : వారాల ఆనంద్
వెల: రూ.150
ప్రతులకు : వారాల ఇందిరా రాణి
మొబైల్: 9440501281
లభ్యం: నవోదయ బుక్ హౌస్
సమీక్షకులు
డా.టి.రాధా కృష్ణమాచార్యులు
98493 05871






