రాజకీయాల ముఖచిత్రాన్ని మార్చేసిన గ్రంథం

by Ravi |   (  Updated:2026-04-20 01:15:40  IST  )

రాజకీయాల ముఖచిత్రాన్ని మార్చేసిన గ్రంథం
X

రాజకీయం అంటేనే ఒక చదరంగం. ఈ ఆటలో రాజు ఎవరు బంటు ఎవరు? అన్నది ముఖ్యం కాదు. చివరకు గెలిచింది ఎవరు అన్నదే ముఖ్యం. 16వ శతాబ్దపు ఇటలీలో పుట్టిన ఈ పుస్తకం 'ది ప్రిన్స్' (The Prince) ప్రపంచ రాజకీయాల ముఖచిత్రాన్ని మార్చేసింది. దీని రచయిత నికోలో మాకియవెల్లి. ఆయన ఒక రచయిత మాత్రమే కాదు. ఫ్లోరెన్స్ నగరంలో దౌత్యవేత్తగా పనిచేసిన అనుభవశాలి.

ఆ రోజుల్లో ఇటలీ చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి ఉండేది. పరస్పర దాడులు, కుట్రలు, అధికారం కోసం ఆరాటం. ఇవన్నీ ఆయన కళ్లముందే జరిగాయి. ఆ అనుభవాల నుండే ఈ సంచలన గ్రంథం పుట్టింది. ఒక పాలకుడు ఎలా ఉండాలో నీతులు చెప్పడం మానేసి అసలు పాలకుడు ఎలా ఉంటాడో పచ్చిగా రాశాడు మాకియవెల్లి. ఈ పుస్తకం లోరెంజో డి మెడిసికి అంకితం ఇవ్వబడింది. అంటే ఒక రాజుకు పవర్‌ను ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పే మాన్యువల్ అన్నమాట.

ఈ పుస్తకం ఒక గైడ్ లాంటిది

ఒక రాజు తన రాజ్యాన్ని ఎలా సంపాదించాలి. దాన్ని శత్రువుల నుండి ఎలా కాపాడుకోవాలి. ఇందులో ప్రధానంగా 'రియల్ పాలిటిక్' (Realpolitik) గురించి చర్చ ఉంటుంది. పాలకుడు సింహంలా ఉండాలి. అంటే బలమైన సైన్యం ఉండాలి. అలాగే నక్కలా ఉండాలి. అంటే కుటిలమైన ఎత్తుగడలు తెలిసి ఉండాలి. ప్రజల చేత ప్రేమించబడటం కంటే భయపెట్టబడటం ఉత్తమం అని మాకియవెల్లి వాదిస్తాడు.. ఎందుకంటే మనుషులు స్వార్థపరులు. అవసరం తీరిపోగానే ప్రేమని వదిలేస్తారు. భయం అనేది ఎప్పుడూ పాలకుడి చేతిలోనే ఉంటుంది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ఏ ప్రయత్నమైనా సరైనదే అని ఆయన బలంగా నమ్మాడు. లక్ష్యం బాగుంటే మార్గం ఏదైనా పర్వాలేదు అన్నది ఆయన సిద్ధాంతం.

పాత పుస్తకం చదువుతున్న ఫీల్ ఉండదు!

మాకియవెల్లి శైలి చాలా సూటిగా ఉంటుంది. అనవసరమైన పదజాలం. అలంకారాలు ఇందులో కనిపించవు.. ఒక డాక్టర్ ఆపరేషన్ చేసేటప్పుడు ఎంత నిర్దాక్షిణ్యంగా ఉంటాడో మాకియవెల్లి కూడా రాజకీయాలను అలాగే విశ్లేషించాడు.. ఇక్కడ నీతి అనేది ఒక ముసుగు మాత్రమే. అధికారం దక్కించుకోవడానికి ఆ ముసుగును ఎలా వాడాలి అన్నది ఆయన వివరిస్తాడు. ఆయన భాషలో ఒక రకమైన శాస్త్రీయత ఉంటుంది. మనుషుల స్వభావాన్ని. వారి బలహీనతలను ఆయన అంచనా వేసిన తీరు అద్భుతం. ఈ పుస్తకం చదువుతుంటే ఏదో పాత కాలపు కథ చదువుతున్నట్లు ఉండదు. నేటి కార్పొరేట్ ఆఫీసుల్లో. పొలిటికల్ పార్టీల్లో జరిగే డ్రామా చదువుతున్నట్లు ఉంటుంది. క్లుప్తమైన వాక్యాలు. పదునైన తర్కం ఈ పుస్తకాన్ని ఒక పవర్ ఫుల్ రీడ్ గా మార్చాయి.

ప్రపంచ రంగుల వెనక నిజాన్ని చూపించి..

ఈ పుస్తకంలోని అతిపెద్ద బలం దాని నిజాయితీ. ప్రపంచానికి కనిపించే రంగుల వెనుక ఉన్న పచ్చి నిజాన్ని ఇది బయటపెడుతుంది. రాజకీయాలను నీతిశాస్త్రం నుండి వేరు చేసి ఒక స్వతంత్ర సబ్జెక్టుగా మార్చింది ఈ గ్రంథమే. ఒక పాలకుడు అదృష్టం మీద కాకుండా తన సామర్థ్యం మీద ఆధారపడాలని చెప్పడం చాలా ఆచరణాత్మకంగా ఉంటుంది. అయితే దీని మీద కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. మాకియవెల్లి మనుషులపై చాలా తక్కువ అంచనా వేశాడని కొందరి భావన. ఆయన చిత్రించిన పాలకుడు క్రూరుడిగా కనిపిస్తాడు. సామాజిక బాధ్యత కంటే కుర్చీనే ముఖ్యం అనుకోవడం కొంతవరకు ప్రమాదకరమే. దయ. కరుణ అనేవి పాలకుడికి బలహీనతలుగా మారతాయని చెప్పడం నైతికంగా ఆమోదయోగ్యం కాకపోవచ్చు.

మనుషుల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే..

మనం అప్పుడప్పుడు చాణక్యుడి 'అర్థశాస్త్రం' గురించి మాట్లాడుకుంటాం. మాకియవెల్లి 'ది ప్రిన్స్' కూడా దానికి సమానమైన గౌరవాన్ని పొందింది. అయితే చాణక్యుడు ధర్మాన్ని పక్కన పెట్టలేదు. మాకియవెల్లి మాత్రం రాజకీయాల్లో ధర్మానికి చోటు లేదన్నాడు. ఈ తేడాను గమనించడం ముఖ్యం. అయినప్పటికీ. ఇప్పటికీ ప్రపంచ దేశాల విదేశాంగ విధానాలు. అంతర్గత రాజకీయాలు ఈ పుస్తకం చుట్టూనే తిరుగుతున్నాయి. అది అమెరికా ఎన్నికలైనా, మన ఊరి పంచాయతీ ఎన్నికలైనా. ఎత్తుకు పైఎత్తు వేయడంలో మాకియవెల్లి సూత్రాలే పనిచేస్తున్నాయి. చివరగా చెప్పాలంటే. 'ది ప్రిన్స్' ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం. ఇది రాజకీయ నాయకులకే కాదు, మనుషుల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతుంది.

ఈ పుస్తకానికి కాలం చెల్లదు!

మనం ఆదర్శాల గురించి మాట్లాడుకుంటాం. లోపల మనందరిలోనూ ఒక మాకియవెల్లి దాగి ఉంటాడు. నేటి పోటీ ప్రపంచంలో అధికారం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఇది ఒక కరదీపిక. 500 ఏళ్ల క్రితం రాసినా. నేటికీ ఇది అక్షర సత్యంగా అనిపించడం ఈ పుస్తకపు గొప్పతనం. దీన్ని చదవడం అంటే రాజకీయాల్లో ఉన్న రాక్షసత్వాన్ని అర్థం చేసుకోవడం. అలాగే మన రక్షణ కోసం మనం ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేసుకోవాలో తెలుసుకోవడం. మీరు ఒకసారి ఈ పుస్తకాన్ని చేతిలోకి తీసుకుంటే. సమాజాన్ని చూసే మీ కోణం ఖచ్చితంగా మారుతుంది. ఇది ఒక భయంకరమైన సత్యం. అంతేకాదు ఒక అపురూపమైన మేధో సంపత్తి. రాజకీయాల్లో ఏదీ అనుకోకుండా జరగదు. ప్రతి దాని వెనుక ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్కను నేర్పే పుస్తకమే ఈ 'ది ప్రిన్స్'. అందుకే దీనికి కాలం చెల్లదు. మనుషుల్లో అధికార కాంక్ష ఉన్నంత కాలం మాకియవెల్లి బతికే ఉంటాడు. ఆయన అక్షరాలు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాయి. అప్రమత్తంగా ఉండమని చెప్తూనే ఉంటాయి. చదరంగంలో గెలవడమే కాదు. అసలు ఆ ఆటను ఎలా ఆడాలో నేర్చుకోవాలంటే ఈ పుస్తకాన్ని మించిన ఆప్షన్ లేదు.

పుస్తకం: 'ది ప్రిన్స్' (II Principe)

రచయిత: నికోలో మాకియవెల్లి

ప్రచురణ: పెంగ్విన్ క్లాసిక్స్ (ప్రపంచ ప్రసిద్ధ ప్రచురణలు)

పేజీలు: 150

-డా. నంబూరి చంద్రశేఖర్

93939 90399

Next Story