కుర్చీకై కుట్రల మంత్రం.. మనిషిని మింగే మాకియవెల్లి తంత్రం!

by Ravi |

The Prince by Niccolo Machiavelli Book Review

కుర్చీకై కుట్రల మంత్రం.. మనిషిని మింగే మాకియవెల్లి తంత్రం!
X

నీతి కంటే అధికారం ముఖ్యం అని మాకియవెల్లి ఎందుకు అన్నాడు? నేటి భారత రాజకీయాలకు అది ఎలా సరిపోతుంది? 1513లో నికోలో మాకియవెల్లి రాసిన 'Il Principe' (The Prince) ఒక పొలిటికల్ మాస్టర్‌క్లాస్. ఇది మంచి పాలకుడు ఎలా ఉండాలి? అనే నీతులు చెప్పే పుస్తకం కాదు. అసలు పవర్ అంటే ఏమిటి? ఆ పవర్‌ను ఎలా దక్కించుకోవాలి? వచ్చిన అధికారాన్ని ఎలా కాపాడుకోవాలి? అనే ప్రాక్టికల్ ప్రశ్నలకు ఒక రా అండ్ రూత్‌లెస్ బ్లూప్రింట్.

పాలకుడు సింహంలా ధైర్యంగా ఉండాలి. అదే సమయంలో నక్కలా జిత్తులమారిగా ఉండాలి. ప్రజలు నిన్ను ప్రేమిస్తున్నారా లేదా అన్నది సెకండరీ. వారు నిన్ను చూసి భయపడుతున్నారా అన్నదే ముఖ్యం. ఎందుకంటే ప్రేమ అనేది కృతజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. అది ఎప్పుడైనా విరిగిపోవచ్చు. కానీ భయం అనేది శిక్ష మీద ఆధారపడి ఉంటుంది. అది పాలకుడి చేతుల్లో ఉంటుంది. ఈ ఫిలాసఫీని మనం 500 ఏళ్ళ తర్వాత కూడా ఇండియన్ పాలిటిక్స్‌లో ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం.

గెలవడమే ఏకైక ధర్మం

భారత రాజకీయాలు ఇప్పుడు ఒక హై-స్టేక్స్ చెస్ గేమ్‌లా మారాయి. ఇక్కడ మొరాలిటీకి స్థానం తక్కువ. రియలిజానికి వాల్యూ ఎక్కువ. మాకియవెల్లి చెప్పిన "Ends justify the means" (లక్ష్యం బాగుంటే మార్గం ఏదైనా పర్వాలేదు) అనే సూత్రం మన రాజకీయ నాయకులకు వేద మంత్రంలా మారింది. గెలవడమే ఏకైక ధర్మం. ఆ గెలుపు కోసం చేసే పొత్తులు. ఆ గెలుపు కోసం ఇచ్చే హామీలు. ఇవన్నీ కేవలం ఒక స్ట్రాటజీలో భాగాలు. 2024 నుంచి 2026 వరకు మనం చూస్తున్న పరిణామాలు గమనిస్తే. డెమోక్రసీ అనే ముసుగులో అసలు సిసలు మాకియవెల్లియన్ స్టేట్‌క్రాఫ్ట్ నడుస్తోంది.

నక్కజిత్తుల పాలిటిక్స్

మహారాష్ట్ర పాలిటిక్స్‌ను ఒకసారి స్టడీ చేద్దాం. ఇది ఒక ప్యూర్ మాకియవెల్లియన్ ఎగ్జాంపుల్. ఒక పార్టీని రెండుగా చీల్చడం. ఆ పార్టీ గుర్తును సొంతం చేసుకోవడం. ఇన్నేళ్ళ సిద్ధాంతాలను పక్కన పెట్టి ప్రత్యర్థులతో చేతులు కలపడం. ఇవన్నీ చూస్తుంటే మాకియవెల్లి రాసిన "నక్క జిత్తుల" సిద్ధాంతం గుర్తుకు రాక తప్పదు. ఒక పాలకుడు తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి తన ప్రత్యర్థుల పునాదులను దెబ్బతీయాలి. వారి శక్తిని ముక్కలు చేయాలి. శివసేనలో చీలిక. ఆ తర్వాత NCP లో వచ్చిన డ్రామా. ఇవి కేవలం కుర్చీ కోసమే కాదు. ప్రత్యర్థిని మళ్ళీ కోలుకోలేకుండా చేయాలనే ఒక డీప్ పొలిటికల్ సర్వైవల్ ఇన్‌స్టింక్ట్.

ఇక 'ఆపరేషన్ లోటస్' ...

రాజకీయాల్లో 'ఆపరేషన్ లోటస్' అనేది ఒక సంచలన వ్యూహం. ఒక రాష్ట్రంలో మెజారిటీ లేకపోయినా, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుని అధికారాన్ని దక్కించుకోవడానికి బీజేపీ చేసే ప్రయత్నాలను విపక్షాలు ఈ పేరుతో పిలుస్తుంటాయి. దీనికి బీజం 2008లో కర్ణాటకలో పడింది. సాధారణంగా ఇతర పార్టీల నాయకులకు భారీగా డబ్బు ఆశ చూపడం, మంత్రి పదవులు ఇస్తామని వాగ్దానం చేయడం లేదా బెదిరింపులకు గురిచేయడం ద్వారా వారిని రాజీనామా చేయించి, ఆ తర్వాత ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుగా గెలిపించుకోవడం ఈ వ్యూహంలోని ప్రధాన అంశం.

ఇప్పటికే కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఈ పద్ధతి ద్వారా ప్రభుత్వాలు మారడం చూశాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను అస్థిరపరచడమే దీని లక్ష్యమని కాంగ్రెస్, ఆప్ వంటి పార్టీలు తీవ్రంగా విమర్శిస్తుంటాయి. (రాజకీయ ప్రలోభాలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం వల్ల ప్రజలు ఇచ్చిన తీర్పు వమ్ము కావడమే కాకుండా, భారీగా డబ్బు మరియు పదవుల ఆశ చూపి నాయకులను ఫిరాయింపజేయడం ద్వారా రాజకీయాల్లో నైతికత నశించి, రాజ్యాంగంలోని ఫిరాయింపుల నిరోధక చట్టం బలహీనపడి వ్యవస్థలు అస్థిరతకు లోనవుతూ కర్ణాటక, మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాల పతనానికి దారితీసి ప్రజాస్వామ్య పునాదులను దెబ్బతీస్తోంది)

లేదా ఫిరాయింపుల గురించి మాట్లాడుకుంటే. మాకియవెల్లి తన పుస్తకంలో "Virtù" (సామర్థ్యం) గురించి చెబుతాడు. పాలకుడు తన శక్తిని వాడి అదృష్టాన్ని (Fortuna) తన వైపు తిప్పుకోవాలి. మెజారిటీ లేకపోయినా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించడం. ప్రభుత్వాలను కూల్చడం. ఇదంతా ఒక ఆర్ట్ లాగా మారిపోయింది. ఇక్కడ తప్పు ఒప్పుల కంటే ఎవరు గెలిచారు? ఎవరు అధికారంలో ఉన్నారు? అన్నదే జనం చూస్తారు. రాజకీయాల్లో ఓడిపోయిన వాడి నీతి కంటే గెలిచిన వాడి వ్యూహానికే క్రెడిట్ దక్కుతుంది. ఇది ఒక చేదు నిజం.

మాకియవెల్లి చెప్పిన మరో ఇంపార్టెంట్ పాయింట్ "భయం". ప్రజలు పాలకుడిని చూసి భయపడాలి కానీ ద్వేషించకూడదు. నేటి ఇండియన్ పాలిటిక్స్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థల పాత్ర కూడా సరిగ్గా ఇదే లాజిక్ మీద నడుస్తోంది. ED. CBI. IT దాడులు. ఇవి కేవలం చట్టపరమైన చర్యలు మాత్రమే కావు. ఇవి ఒక పొలిటికల్ మెసేజ్. ప్రత్యర్థి పార్టీలను భయపెట్టడం. వారిని లొంగదీసుకోవడం. లేదంటే నిశ్శబ్దం చేయడం. ఇది పాలకుడి పవర్ సెంటర్‌ను స్ట్రాంగ్ చేస్తుంది. ప్రజల్లో ఒక రకమైన "స్ట్రాంగ్ లీడర్" ఇమేజ్‌ను క్రియేట్ చేస్తుంది. ఒక బలహీనమైన పాలకుడు కంటే ఒక కఠినమైన పాలకుడే రాజ్యానికి మేలు చేస్తాడని మాకియవెల్లి వాదన.

బీహార్ పాలిటిక్స్‌లో నితీష్ కుమార్ చేసే 'పల్టీలు' అందరికీ తెలుసు. చాలా మంది దీన్ని విమర్శిస్తారు. కానీ మాకియవెల్లి లెన్స్‌లో చూస్తే. అది ఒక మాస్టర్ క్లాస్ 'ఇన్ పొలిటికల్ సర్వైవల్'. పాలకుడు ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉంటే అది అతని పతనానికి దారి తీయవచ్చు. కాలానికి అనుగుణంగా. అవసరానికి అనుగుణంగా రంగు మార్చడం. పొత్తులు మార్చడం అనేది తెలివైన పాలకుడి లక్షణం. నీ అధికారం ఎక్కడ సేఫ్‌గా ఉంటుందో అటు వైపు ఉండటం అనేది అపరాధమేమీ కాదు. అది ఒక స్ట్రాటజీ.

నేత రక్షకుడు.. ప్రత్యర్థి దేశ ద్రోహి

ప్రస్తుతం మనం ఇమేజ్ మేనేజ్‌మెంట్ యుగంలో ఉన్నాం. "ప్రజలు నువ్వు ఎలా కనిపిస్తున్నావో చూస్తారు కానీ. నువ్వు లోపల ఏమిటో ఎవరికీ అనవసరం" అన్నాడు మాకియవెల్లి. నేటి ఐటి సెల్స్. పొలిటికల్ వ్యూహకర్తలు చేసే పని ఇదే. ఒక నేతను "రక్షకుడు" గా చూపించడం. ప్రత్యర్థిని "దేశద్రోహి" గా ప్రొజెక్ట్ చేయడం. సోషల్ మీడియాలో నెరేటివ్ సెట్ చేయడం. ఇవన్నీ ప్రజల ఆలోచనలను కంట్రోల్ చేసే పద్ధతులు. నువ్వు ఏ నిజం చెప్తున్నావన్నది పాయింట్ కాదు. ప్రజలను ఏది నమ్మించగలుగుతున్నావు అన్నదే ముఖ్యం. ఇక్కడ సత్యం కంటే పర్సెప్షన్ (అభిప్రాయం) కి ఎక్కువ పవర్ ఉంటుంది.

రాజకీయం దేవాలయం కాదు.. యుద్ధభూమి

భారత రాజకీయాల్లో కౌటిల్యుడు (చాణక్యుడు) ఎప్పుడో సామ్. దామ్. భేద్. దండ్ గురించి చెప్పాడు. మాకియవెల్లి చెప్పింది కూడా అదే. వీరు ఇద్దరూ రాజకీయాలను దేవాలయంలా చూడలేదు. దాన్ని ఒక యుద్ధభూమిలా చూశారు. 2026 నాటికి ఈ ధోరణి ఇంకా పెరిగింది. ఇప్పుడు రాజకీయాలు అంటే కేవలం ఐదేళ్లకు ఒకసారి ఓటు వేయడం కాదు. అది ఒక నిరంతర యుద్ధం. ప్రతి రోజు ఒక వ్యూహం. ప్రతి సెకను ఒక ఎత్తుగడ.

కూటమి రాజకీయాల గురించి కూడా మాకియవెల్లి కొన్ని టిప్స్ ఇచ్చాడు. బలమైన శత్రువును దెబ్బతీయడానికి బలహీనమైన పార్టీలన్నీ ఏకమవ్వాలి. ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న కూటమి రాజకీయాలు (I.N.D.I.A vs NDA) సరిగ్గా ఇదే సూత్రాన్ని పాటిస్తున్నాయి. కానీ ఇక్కడ లోపం ఏమిటంటే. మాకియవెల్లి హెచ్చరించినట్లు. ఒకవేళ ఆ కూటమికి సరైన నాయకత్వం లేకపోతే. ఆ కూటమి లోపలే కుమ్ములాటలు మొదలై పాలకుడికి ఇంకా ఎక్కువ పవర్ వచ్చేలా చేస్తాయి. సరిగ్గా ఇదే మనం చూస్తున్నాం.

నేటి కాలంలో "నెరేటివ్ బిల్డింగ్" అనేది ఒక సైన్స్. సోషల్ మీడియాను వాడుకోవడం. అల్గారిథమ్స్‌ను మేనేజ్ చేయడం. ఇవన్నీ డిజిటల్ మాకియవెల్లిజం. ఒక తప్పుడు వార్తను వందసార్లు చెప్పి నిజం చేయడం. ప్రజల ఎమోషన్స్‌తో ఆడుకోవడం. ఇదంతా ఒక గ్రేట్ గేమ్. ఈ గేమ్‌లో ఎవరైతే ఎక్కువ కాలం ప్రజల అటెన్షన్‌ను హోల్డ్ చేయగలుగుతారో వారే కింగ్స్. ఇక్కడ నైతికత అనేది కేవలం స్పీచ్‌లకు మాత్రమే పరిమితం. యాక్షన్ అంతా క్యాలిక్యులేటెడ్‌గా ఉంటుంది.

పవర్ హంగర్‌కి నిదర్శనమీ రాజకీయాలు

ముగింపుగా చెప్పుకోవాలంటే. మాకియవెల్లి చెప్పిన 'ది ప్రిన్స్' నేటికీ ఒక పచ్చి నిజం. మనం ఆదర్శాల గురించి మాట్లాడుకుంటాం. కానీ అధికారం ఎప్పుడూ వాస్తవాల మీదే నిలబడుతుంది. ఒక పాలకుడు కరుణ చూపించవచ్చు. కానీ అది అతని బలహీనత కాకూడదు. అతను దానం చేయవచ్చు. కానీ అది అతని ఖజానా ఖాళీ చేయకూడదు. భారత రాజకీయాల్లో మనం చూస్తున్న గందరగోళం. ఫిరాయింపులు. ఎత్తుగడలు. ఇవన్నీ ఆశ్చర్యపరిచే విషయాలు కావు. ఇవి మానవ స్వభావంలో ఉన్న 'పవర్ హంగర్' కి నిదర్శనాలు.

మాకియవెల్లిజం అనేది ఒక శాపం కాదు. అది రాజకీయాల అసలు ముఖచిత్రం. ప్రపంచం ఎలా ఉండాలి అని ఊహించుకోవడం కంటే. ప్రపంచం ఎలా ఉంది అని తెలుసుకోవడమే నిజమైన రాజనీతి. ఒక సామాన్యుడు ఈ గేమ్ ను అర్థం చేసుకుంటేనే. అతను ఒక పాలకుడిని సరైన విధంగా జడ్జ్ చేయగలడు. రాజకీయాల్లో ఏదీ యాదృచ్ఛికం కాదు. ప్రతి మూవ్ వెనుక ఒక మాకియవెల్లియన్ లాజిక్ ఉంటుంది. దాన్ని గుర్తించడమే మన ముందున్న అసలైన టాస్క్. అధికారం అనేది ఒక మత్తు. దాన్ని దక్కించుకోవడం కంటే. దాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నమే చరిత్రను రాస్తుంది. మన దేశ రాజకీయ చరిత్ర ఇప్పుడు ఆ మలుపులోనే ఉంది.

కాబట్టి. మనం చూస్తున్న ప్రతి పొలిటికల్ డ్రామా వెనుక ఒక మాకియవెల్లి దాగి ఉంటాడు. అతను మనకు నచ్చకపోవచ్చు. కానీ అతని సూత్రాలను కాదనడం ఎవరి తరం కాదు. ఎందుకంటే అధికారం ఎప్పుడూ తన స్వంత భాషలోనే మాట్లాడుతుంది. ఆ భాషే మాకియవెల్లిజం. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. అధికారం మారుతుంది. నాయకులు మారుతారు. కానీ ఆ అధికారాన్ని నడిపించే సూత్రాలు మాత్రం ఎప్పటికీ మారవు. అది 1513 అయినా. 2026 అయినా. ఒకటే లాజిక్. గెలిచిన వాడే ప్రిన్స్.

మాకియవెల్లి సిద్ధాంతాల్లో మరో కీలకమైన చాప్టర్ 'కూలీ సైన్యం' (Mercenaries). ఆయన అప్పట్లోనే హెచ్చరించాడు. సొంత సైన్యం లేని పాలకుడు ఎప్పుడూ ప్రమాదంలోనే ఉంటాడని చెప్పాడు. కూలీ సైనికులు డబ్బు కోసం వస్తారు. కష్టం వస్తే పారిపోతారు. దీన్ని నేటి కాలానికి అన్వయిస్తే 'పొలిటికల్ కన్సల్టెంట్స్' కనిపిస్తారు. ఇప్పుడు ప్రతి పార్టీకి ఒక ఐప్యాక్ (I-PAC) లాంటి సంస్థ ఉంది. వీరు జీతగాళ్లు. వీరికి సిద్ధాంతాలు ఉండవు. కేవలం డేటా. నంబర్లు. గెలుపు గుర్రాలు మాత్రమే తెలుసు. కానీ మాకియవెల్లి లెక్క ప్రకారం. వీరు ఇచ్చే విజయం తాత్కాలికం. ఎందుకంటే గ్రౌండ్ లెవల్‌లో పార్టీ క్యాడర్ అనే 'సొంత సైన్యం' నీరసించిపోతుంది. నేటి భారత రాజకీయాల్లో కార్పొరేట్ స్టైల్ మేనేజ్‌మెంట్ పెరిగి. కార్యకర్త అనే వాడు తగ్గిపోతున్నాడు. ఇది పాలకుడికి లాంగ్ రన్‌లో డేంజర్.

పతనమైనా మళ్లీ చక్రం తిప్పడమే 'విర్టూ'

ఇక 'విర్టూ' (Virtù) అనే పదాన్ని మాకియవెల్లి తరచుగా వాడేవాడు. అంటే పాలకుడికి ఉండాల్సిన మగతనం(sorry for using this word here, i used it as there is no other word to carry the real meaning here.). ధైర్యం. తెలివితేటలు అని అర్థం. ఒక నాయకుడు ఎదురుదెబ్బ తగిలినప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు అన్నదే ఇక్కడ పాయింట్. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని పార్టీలు ఒక్కసారిగా డీలా పడిపోయాయి. మరికొన్ని పార్టీలు తక్కువ సీట్లు వచ్చినా పవర్ లోకి రాగలిగాయి. ఇక్కడే విర్టూ కనిపిస్తుంది. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా అధికారాన్ని ఎలా ఒడిసిపట్టుకోవాలి? అదృష్టం (Fortuna) కలిసి రానప్పుడు తన సొంత తెలివితేటలతో ఎలా నిలబడాలి? ఇది ఒక ప్యూర్ సైన్స్. చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు పదేళ్లు అధికారం లేకపోయినా. మళ్ళీ చక్రం తిప్పడం వెనుక ఉన్నది ఈ విర్టూనే.

క్రూరత్వాన్ని ఒకేసారి వాడాలి

మాకియవెల్లి మరో కఠినమైన సలహా ఇస్తాడు. "క్రూరత్వాన్ని ఒకేసారి వాడాలి" అని చెబుతాడు. అంటే ఒక పాలకుడు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే. అది ఒకేసారి తీసేయాలి. ప్రజలకు ఆ బాధ వెంటనే మర్చిపోయేలా ఉండాలి. కానీ మేలు చేసే పనులు మాత్రం కొంచెం కొంచెంగా. నిరంతరం చేస్తూ ఉండాలి. తద్వారా పాలకుడు ఎప్పుడూ మంచివాడు అనే ముద్ర ఉంటుంది. మన దగ్గర నోట్ల రద్దు (Demonetization) లేదా కొన్ని కఠినమైన చట్టాలు వచ్చినప్పుడు ఇది గుర్తించవచ్చు. అయితే ఆ క్రూరత్వం గనుక సాగుతూ పోతే. అది ద్వేషంగా మారుతుంది. పాలకుడు భయం పుట్టించాలి కానీ. ద్వేషం కాదు. ద్వేషం పుడితే ప్రజలు తిరగబడతారు. అది పాలకుడి పతనానికి నాంది.

ఉచితాలు కాదు.. పాలకులకు సేఫ్టీ వాల్వ్

రాజకీయాల్లో 'నోబుల్స్' (ఎలైట్స్) మరియు 'పీపుల్' (ప్రజలు) అనే రెండు వర్గాలు ఉంటాయి. మాకియవెల్లి ఒక క్లారిటీ ఇచ్చాడు. ఎలైట్స్ ఎప్పుడూ పాలకుడి మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తారు. కానీ సామాన్య ప్రజలు కోరుకునేది ఒక్కటే. తమను ఎవరూ వేధించకూడదని. ఒక తెలివైన పాలకుడు ఎప్పుడూ ప్రజల వైపు ఉండాలి. ఎందుకంటే ఎలైట్స్ సంఖ్య తక్కువ. వారు ఎప్పుడైనా వెన్నుపోటు పొడవగలరు. కానీ ప్రజలు ఎక్కువ. వారి నమ్మకం ఉంటే పాలకుడికి తిరుగు ఉండదు. భారత రాజకీయాల్లో 'వెల్ఫేర్ స్కీమ్స్' (సంక్షేమ పథకాలు) ఇక్కడ కీలక పాత్ర పోషిస్తాయి. ఉచితాలు అని మనం విమర్శిస్తాం కానీ. మాకియవెల్లి లెన్స్‌లో చూస్తే అది ప్రజలను తన వైపు తిప్పుకునే ఒక సేఫ్టీ వాల్వ్.

ప్రజలను నమ్మించడం.. సైకలాజికల్ వార్ ఫేర్

నేటి డిజిటల్ యుగంలో 'ప్రశంసల కంటే ఫలితాలే ముఖ్యం'. మాకియవెల్లి ఒక మాట అన్నాడు. "ప్రజలు ఎప్పుడూ ఫలితాలను చూసి మురిసిపోతారు." ఒక ప్రాజెక్ట్ కట్టామా లేదా? రోడ్లు వేశామా లేదా? అన్నది పక్కన పెడితే. మనం ఏది సాధించాం అని ప్రజలను నమ్మించగలిగాం అన్నదే ముఖ్యం. ఇప్పుడు జరుగుతున్న ప్రతి రిబ్బన్ కటింగ్. ప్రతి సోషల్ మీడియా పోస్ట్ వెనుక ఒక సైకలాజికల్ వార్ ఫేర్ ఉంది. నువ్వు పనిచేయడం ఒక ఎత్తు. అది చేస్తున్నావని ప్రజల మెదళ్ళలోకి ఎక్కించడం మరో ఎత్తు. పాలకుడు ఒక గొప్ప స్టేజ్ పెర్ఫార్మర్ లా ఉండాలి. తన బాధను దాచుకోవాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కేవలం విజేతలా మాత్రమే కనిపించాలి.

పచ్చి రాజకీయ ఎత్తుగడలే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్

నికోలో మాకియవెల్లి రాసిన 'ది ప్రిన్స్' పుస్తకం ఒక అద్దం లాంటిది. అందులో మనం చూసుకుంటే మన అసలు రూపం కనిపిస్తుంది. రాజకీయం అంటే నీతిశాస్త్రం కాదు. అది కేవలం ఒక శక్తి పోరాటం (Power Struggle). ఇక్కడ గెలిచిన వాడు హీరో. ఓడిన వాడు విలన్. భారత రాజకీయం ఇప్పుడు ఆ రియలిజం వైపే వేగంగా అడుగులు వేస్తోంది. ఆదర్శాల ముసుగులు తొలగిపోతున్నాయి. పచ్చి రాజకీయ ఎత్తుగడలే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్.

అనైతికమే రాజకీయం

ముగింపుగా. మనం ఒక విషయాన్ని ఒప్పుకోవాలి. మాకియవెల్లి చెప్పిన సూత్రాలు మనకు అనైతికంగా అనిపించవచ్చు. కానీ అవి పనిచేస్తాయి. ప్రపంచాన్ని మనం ఎలా ఉండాలి అని కోరుకుంటామో అలా చూడటం ఆదర్శం. కానీ ప్రపంచం ఎలా ఉందో అలా అర్థం చేసుకోవడం జ్ఞానం. భారత రాజకీయాల్లో ఈ జ్ఞానమే ఇప్పుడు గెలుపుకు గీటురాయి. నాయకులు మారుతుంటారు. ప్రభుత్వాలు మారుతుంటాయి. కానీ అధికారం కోసం జరిగే ఈ చదరంగంలో ఎత్తుగడలు మాత్రం మాకియవెల్లి గీసిన గీత దాటవు. పవర్ అనేది ఒక ఇన్ఫైనైట్ గేమ్. ఈ గేమ్‌లో రూల్స్ లేవు. కేవలం రిజల్ట్స్ మాత్రమే ఉంటాయి.

కుటిలత్వమే అధికార సోఫానం

ఒక సామాన్యుడిగా ఈ ఎత్తుగడలను గమనించడం. వాటి వెనుక ఉన్న ఉద్దేశాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే నువ్వు రాజకీయాల్లో ఆసక్తి చూపకపోవచ్చు. కానీ రాజకీయం మాత్రం నీ జీవితం మీద ఆసక్తి చూపిస్తుంది. మాకియవెల్లి మనకు నేర్పిన పాఠం ఒక్కటే. అధికారం అనేది ఆకాశం నుండి ఊడిపడదు. అది వ్యూహంతో. బలంతో. ఇంకా చెప్పాలంటే కాస్తంత కుటిలత్వంతో సంపాదించుకోవాలి. ఆ సంపాదించుకున్న దాన్ని ప్రజల క్షేమం కోసం వాడుతున్నావా లేదా అన్నది నీ విజ్ఞత. కానీ గెలవడం మాత్రం తప్పనిసరి. ఎందుకంటే ఓడిపోయిన వాడికి చరిత్రలో చోటు ఉండదు. కేవలం విజేతలే చరిత్రను రాస్తారు.

భారత రాజకీయ వీధుల్లో మాకియవెల్లి ఆత్మ

మనం ఇప్పుడు ఒక కొత్త పొలిటికల్ ఎరాలో ఉన్నాం. ఇక్కడ నైతికత అనే పాత కాలపు బరువును నాయకులు దించేస్తున్నారు. ప్రాక్టికల్ గా ఉండటం. స్పీడ్ గా నిర్ణయాలు తీసుకోవడం. ప్రత్యర్థిని దెబ్బతీయడం. ఇదే నేటి రాజధర్మం. ఇది మంచిదా చెడ్డదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. కానీ ప్రస్తుతం మాత్రం మాకియవెల్లి ఆత్మ భారత రాజకీయ వీధుల్లో రాజసంగా తిరుగుతోంది. దాన్ని గుర్తించిన వాడే అసలైన పొలిటికల్ అబ్జర్వర్.

-డాక్టర్ నంబూరి చంద్రశేఖర్

రాజకీయ, శాస్త్ర సాంకేతిక విశ్లేషకులు

93939 90399

Next Story