ముద్రించిన తెలంగాణ మాండలికం..

by Ravi |   (  Updated:2026-06-08 01:00:59  IST  )

Thampi written by Haragopal Book Review

ముద్రించిన తెలంగాణ మాండలికం..
X

ఒడిదుడుకుల్లో ఉన్న సమాజ ప్రయాణాన్ని చక్కదిద్దడానికి, మానవ తత్వం నడిచే విధానానికి, తాత్విక జ్వలనం అవసరం అన్నమాటను నొక్కి చెబుతూ, కవిత్వంతో చారిత్రక, రాజకీయ, తాత్విక దృక్పథాన్ని ఎత్తి చూపాలనే తపనతో వచ్చింది తంపి పుస్తకం.

కాలగర్భంలో మునిగిన చరిత్రను తవ్వుతున్న ఒక తెలంగాణ గ్రామీణ నుడికారం, చేతివృత్తుల నైపుణ్య దారుశిల్పం, చరిత్రను విశదపర్చడానికి సమాజ ప్రయాణానికి అవసరమైన బండిగీరకు తోడుగా తెచ్చిందే శ్రీరామోజు హరగోపాల్ తంపి కావ్యం.

తంపి అంటే..

ఎనిమిది సంవత్సరాల నుండి ఆత్మ సంఘర్షణ పడుతూ, ఎనభై ఒక్క కవితలతో తన విశాల దృక్పథాన్ని ఎర్రగా కాల్చి వాత పెట్టే విధంగా, ఎక్కువ భాగం తెలంగాణ మాండలికంలో ముద్ర వేసిన కవిత్వమే తంపి. తంపి అంటే నిప్పు అంటించిన పిడకల గూడు, దాలిగుంట, కలహం అని అర్థాలు ఉన్నాయి. పెద్దలు చెప్పినట్టు తంపి పదం నామవాచకం గాను, క్రియా పదంగాను వాడుకలో ఉంది. ఎడ్లబండ్ల గిర్రలకు ఇనుప కమ్ములు తొడిగించడానికి కమ్మరులు పిడకలు పేర్చి ఆ కమ్ములను అందులో కాల్చి కట్టె గీరలకు ఎక్కిస్తారు. ఆ కమ్ములను కాల్చేదే తంపి.

కవి హృదయ తంపిని తాకాలంటే..

ఈ సంపుటిని చారిత్రక, తాత్విక కోణంతోనే చదవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని పాఠకులు గ్రహించాలి. అన్ని కవితలకు విశ్లేషణ ఇక్కడ వేదిక కాకపోయినా, ఒకటికి రెండు సార్లు చదివితేనే ఈ కవిత్వం బోధపడుతుంది. విభిన్న ఇతివృత్తాలతో మనల్నీ ఆలోచింపచేస్తుంది. జాగ్రత్తగా పద పదాన్ని విశ్లేషిస్తే తప్ప వివరణ అంత సులువుగా చిక్కదు. కవి హృదయ తంపిని దొరక పట్టాలనే తలంపుతో రాసుకున్న విశ్లేషణ మాత్రమే ఇది. “సముద్రానికి చతుర్దిశల్లో ఇటుక మేకులు గదిలోపల మెదిలే గాలి చొక్కాతో సముద్రం” అంటూ తన ఫిలాసఫికల్ థియరీని చక్కగా అభివృక్తీకరించాడు.

త్యాగాలు మొక్కలై మొలకెత్తాలి!

ధ్వంసం అవుతున్న కుటుంబాలలో కునుకు కరువైన వేళ, తిరుగుబాటే శరణ్య మార్గంగా ఉద్భవించిన కుత్తుకతో ఇలా అంటాడు…మొగులెత్తు చెట్లను మొదలంట కూల్చి కట్టుకునే భవంతుల సర్వజనుల సుఖం కొరకే వేల ఏండ్ల నాళిక కడుపులో దాచినహనన దమన ఖడ్గం తిప్పి సాము గరిడీలు చేస్తుంటది రాజ్యం… ఆకు రాలిన కాలం కవితలో ధిక్కార స్వరూపాన్ని గిరిజన రైతు నోట పలికిస్త, అరణ్యమా మమ్మల్ని క్షమించు మళ్లీ మళ్లీ పచ్చగా కనికరించు మాకివి సంతాపదినాలు రేపటి మనుషుల సంతోష దినాల కోసమే చేసిన త్యాగాలు మొక్కలై మొలకెత్తాలని దహించిన స్వరాన్ని వినిపిస్తూ, పోడు ఎవుసం చేసుకునే రైతుకు ప్రభుత్వ దమనకాండను అడ్డుకోవాలని, రాజ్యంపై దండెత్తాలని ఉన్న కసిని, కాలం కలిసి రాలేదని నిట్టూర్పును మిగిల్చుకున్న వైనాన్ని మేలుకొలుపుగా చెప్పాడు. ఈ కవితలను చదువుతున్నప్పుడు కవి జీవితమే ఉదాహరణ అనుకున్న కానీ ఇది పూర్తిగా వర్తమాన జీవితాన్ని విశ్లేషణ చేసుకొనుటకు ఆసరాగా నిలబడుతుందని గ్రహించాను చివరికి.

కంటి తెరపత్రాల వెనక కైతలయి

“కంటి చెలిమల నిండా ఊరి,ఊరి ఊరికే కొలనులై ఉలికి పడుతయెందుకో నవ్వినా,ఏడ్చినా కన్నీళ్లే గుండె గొంతుకలోన జలపాతాలై దూకుతయి…” మనసమ్మీ అనే కవితలో కన్నీళ్ళకు కొలమానం లేదు. అవి సార్వజనీనం. మనసులో జ్ఞాపకాలు కొండను తొలిచినట్లు బాధను ఎగజిమ్ముతుంటే ఈ పాడు బతుకు ఎందుకు అనిపిస్తుంది. కళ్ళు తోలిన కలలలో తడిసి ముద్దయిన జ్ఞాపకాల వారధులు, తోరణాలు కట్టినట్లు మనసును కుదేస్తవి. అందుకే అవి “కంటి తెరపత్రాల వెనక కైతలయితయి”అనీ హరగోపాల్ గారి నోట వినిపిస్తాయి మనకు.

ఎన్కౌంటర్‌లో ఎరుపెక్కిన నినాదం..

మానవ నైతికత గురించి ఎన్కౌంటర్ కవితలో ఎరుపెక్కిన నినాదాన్ని ఒంటి చేత్తో నెట్టుకొస్తాడు. ఒంటరి బాకా తనే ఊదుతాడు. “స్మశానం కాని స్థలమే లేదు భూస్థలం అంతా వెతికిన..” ఒకే కవితలో దేశభక్తి ,ధర్మం, అహింసల గురించి చెప్పుతూనే, బానిస బతుకును ఎన్కౌంటర్ చేయాలంటాడు. ఈ కవితలో కవి తాత్విక కోణం తేటతెల్లమవుతుంది. హరగోపాల్ గారు కలతో మాట్లాడుతున్నప్పుడు, ప్రశ్నగా మారి జవాబు కోసం దేవులాట మొదలుపెడతాడు. తను కన్న కలలను కన్నబిడ్డలుగా మలుచుకుంటూ గొప్ప భావుకతను సృష్టించి, ఆ పిల్లలే నన్ను సమాధి నుండి లేపుతారు.అనీ నిరాశవాదంలోని ఆశావాద దృక్పథాన్ని, కలను నేను అనే కవితలో చూపుతాడు. రైతన్న కళ్ళల్లో మెరిసే కాంతులు ఏ దిక్కున ఉదయిస్తాయో అని తనే పొలంగా మారి ఉత్తమకథనాన్ని చక్కగా చెపుతాడు.

విత్తుల కుత్తుకల్లో విప్లవాంకురాలు..

కాళోజీ ‘నా గొడవ’ లా …’నా గొడవకు బదులేది’ అనీ తన బతుకు పుస్తకం మీద ప్రశ్నల ఇంకను పొంగిస్తాడు. యుద్ధ మత్తులో ఉన్న దేశాలను మేలుకొలుపుటకు తెలంగాణ సాయుధ పోరాటాన్ని యాదికి తెప్పిచ్చి నా ప్రశ్నకు జవాబేది అంటూ మరో ప్రశ్నను సంధిస్తాడు. పాదాలే ఉత్త పాదాలే అంటూ తన అడుగులను అన్నిచోట్లలో విస్తరించి దేశ చరిత్రకు పునాదులు తవ్వుతాడు. పాదాలే దేశాన్ని మోస్తున్నాయి కనుక అవి దేశపు మూల స్తంభాలుగా వర్ణిస్తాడు. విత్తుల కుత్తుకల్లో విప్లవాంకురాలను చూస్తున్నాను నాగండ్ల చాళ్లతో వ్యూహాలు పన్నుతున్నాను గెలిపించినట్లు నటించే నీ నాటకాలు తెర తీస్తున్నాను మరిపించే వాగ్దానాల మాయాలాంతర్ జీనీ నాకెరికే…అని సౌమ్యవాద జవసత్వాన్ని జనం ముందుకు తెచ్చే ప్రయత్నంగా, బర్నింగ్ అవర్స్‌లో బలవంతపు మాటలను వేట కొడవల్లుగా మార్చి వైల్డ్ ఫైర్‌ను సృష్టించాడు.

తుప్పుపట్టిన ఆలోచనలకు స్వస్తి వాక్యం

వైవిధ్య భరితమైన వస్తువులను తీసుకొని చరిత్ర పూత పూసి, చెర్నాకోల చేతపట్టి, డొప్ప బోయిన బండి గీరకు, అంచులొంగిన కమ్మి పట్టను సవరిస్తున్నడు తంపి క్షేత్రంలో! చీకటి అద్దాలు తొడిగిన సమాజాన్ని అంట కాక బెట్టి చిలుము ఊడగొడుతున్నాడు. తుప్పు పట్టిన ఆలోచనలకు స్వస్తి వాక్యం పలుకుతూ తంపి నెగడును కవిత్వమై ముఖానికి అద్దుతున్నడు. పిడక పొగలో మసిబట్టిన కాలాన్ని తెల్ల బట్టగా పిండుటకు తనే తాపం వీడి సామాజిక చైతన్య వేశం కట్టి పాట పాడుతూ, కామ్రేడ్‌ను ఎస్కలేటర్ మీద కాలు పెడదాం రమ్మంటూ మనందరినీ తన వైపుకు పిలుస్తున్నాడు. ఈ సందర్భంగా గురు సమానులైన హరగోపాల్ గారికి, వారి కవిత్వానికి నమస్సులు.

పుస్తకం: తంపి (కవిత్వం)

రచయిత: శ్రీరామోజు హరగోపాల్

పేజీలు: 190

వెల: 200

ప్రతులకు: 9949498698


సమీక్షకులు

-గన్నోజు ప్రసాద్

94916 17161

Next Story