స్వాతంత్య్ర సమరంలో తెలుగు సాహిత్యం

by Ravi |   (  Updated:2025-08-18 00:31:10  IST  )

రష్యా అధినేత లెనిన్ సాహిత్యం, కళలు సమాజంలోని పొరల్లోకి చొచ్చుకెళ్లి, ఆయా ప్రాంతాల పరిస్థితులను బట్టి వాటి రూపాలను

స్వాతంత్య్ర సమరంలో తెలుగు సాహిత్యం
X

రష్యా అధినేత లెనిన్ సాహిత్యం, కళలు సమాజంలోని పొరల్లోకి చొచ్చుకెళ్లి, ఆయా ప్రాంతాల పరిస్థితులను బట్టి వాటి రూపాలను మార్చుకోవాలని అంటారు. భారత స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో సాహిత్య రచనలు ప్రజలను సంగ్రామంలో భాగస్వాములను చేశాయి. కవులు, రచయితలు ఆనాడు వారి కలాల ద్వారానే ప్రజలను ఉత్తేజపరిచి స్వాతంత్య్ర ఉద్యమంలో భాగస్వాములను చేశారు.. మన తెలుగు కవి కాళోజీ పేర్కొన్నట్టుగా ఒక అక్షరపు సిరా చుక్క లక్షల మెదళ్ల కదలిక అని గళానికున్న శక్తిని వివరించారు. వలస వాదానికి వ్యతిరేకంగా భారత స్వాతంత్య్ర పోరాటంలో కళ, సాహిత్యం రెండూ ఒక సాధనంగా పనిచేశాయి.

ఉర్రూతలూగించిన రచనలు..

స్వాతంత్య్రోద్యమ నాయకులైన రబీంద్రనాథ్ ఠాగూర్, బంకించంద్ర చటర్జీ, గాంధీజీ, లజపతిరాయ్ మొదలైన వారి రచనలు ఉత్తర భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమాన్ని ఉర్రూతలూగించాయి. వందేమాతర ఉద్యమంలో బంకించంద్ర చటర్జీ రాసిన వందేమాతర గేయం, మహమ్మద్ ఇక్బాల్ రాసిన సారే జహాసే అచ్చా, శ్యామ్ లాల్ గుప్తా రాసిన జెండా ఉంచా రహే హమారా మొదలైన గేయాలు, పద్యాలు స్వాతంత్ర ఉద్యమ ప్రచారంలో ప్రముఖ పాత్ర వహించాయి.

కత్తులు దూసిన దక్షిణాది..

దక్షిణ భారతంలో ముఖ్యంగా తెలుగు మాట్లాడే వారిలో తెలుగు కవులు నాటి ఆంగ్లేయ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అనేక మైనటువంటి గేయాలు పద్యాలు రాశారు. తెలుగు కవుల సాహిత్యానికి ఆనాటి వివేకవర్ధిని, ఆంధ్ర భాషా సంజీవని, గోల్కొండ, విశాలాంధ్ర, కృష్ణ పత్రిక లాంటి తెలుగు పత్రికలు ప్రముఖ పాత్ర పోషించాయి. జయ జయ ప్రియ భారత / జనయిత్రీ దివ్యధాత్రి / జయ జయ జయ శత సహస్ర/ నరనారీ హృదయ నేత్రి.. అంటూ రాసిన దేవులపల్లి కృష్ణశాస్త్రి భారత మాత కీర్తిని వర్ణించారు.

గురజాడ, త్రిపురనేని, చిలకమర్తి

గురజాడ అప్పారావు 1910లో దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టవొయ్ అంటూ, దేశ స్వాతంత్య్రానికి కృషి చేయాలని, పాడి పంటలు ఉన్న మన దేశం అంటూ, దేశాభివృద్ధికి ప్రజలు తోడ్పడాలంటూ ఉత్తేజపరిచారు. ముఖ్యంగా త్రిపురనేని వీరస్వామి చౌదరి గారు రాసిన వీర గంధము తెచ్చినారం వీరుడెవడో తెలుపుడి పూసిపోతము మెడకు వేతుమై పూలదండలో భక్తితో అనే పాట వేలాదిమందిని కదిలించింది, చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు 22 సంవత్సరాల వయసులో రాసిన గయోపాఖ్యానం గొప్ప నాటకం. భరత ఖండము చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ, తెల్లవారను గడుసరి గొల్లవారు, పితుకుచున్నారు మూతులు బిగియ బట్టి.. అని తాను రాసిన సుప్రసిద్ధ పద్యం బ్రిటిష్ దోపిడీ విధానాన్ని ఎండగట్టింది.

గరిమెళ్ల, దాశరథి

గరిమెళ్ల సత్యనారాయణ రాసిన.. 'మాకొద్దు తెల్ల దొరతనము దేవ, మాకొద్దీ తెల్లదొరతనము!, మామా ప్రాణాలపై పొంచి మానాలు హరించే! మాకొద్దు తెల్ల దొరతనము' అంటూ పాడిన పాట స్వాతంత్ర శంఖారావాన్ని పూరించింది. దేశభక్తి కవితలు రాసినందుకు గాను బ్రిటిష్ ప్రభుత్వం ఈయనకు జైలు శిక్ష వేసింది. జైలు శిక్ష అనుభవించిన ప్రథమ కవి గరిమెళ్ల. దాశరథి కృష్ణమాచార్య తెలంగాణకు చెందిన కవి రచయిత. నాటి నిజాం ప్రభువును ఎదిరిస్తూ అనేక రచనలు చేశారు. తెలంగాణ విముక్తి కోసం కృషి చేశారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించిన అప్పటి తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ అందించిన కవి దాశరథి.

ఏ దేశమేగినా..రాయప్రోలు

రాయప్రోలు సుబ్బారావు (1892-1984) ఆధునిక నవ్యాంధ్ర కవిగా పేరు పొంది తెలుగు సాహిత్య ప్రక్రియలో మూడు కొత్త కోణాలను ఆవిష్కరించారు. భావ కవిత్వాన్ని, ఖండకావ్య ప్రక్రియను, అమలిన శృంగారాన్ని మొదలెట్టిన రాయప్రోలు దేశభక్తిని ప్రస్ఫుటంగా చేసే రచనలు అనేకం చేశాడు. నాది జాతి నాది దేశం నాది భాష అను అహంకార దర్శనమందు అని ప్రబోధిస్తూ జాతీయ అభిమానాన్ని, దేశ అభిమానాన్ని, భాషాభిమానాన్ని ప్రతి ఒక్కరిలో ప్రవహింపజేసినటువంటి గొప్ప కవి రాయప్రోలు సుబ్బారావు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవము అంటూ రాసిన పదాల అల్లిక భారత ప్రజలను తెలుగు ప్రజలను స్వరాజ్య సమరంలో ముందుకు నడిపింది.

-ఆర్.ఎస్. సంధ్య

96761 25579

Next Story