హృదయం పగిలిన అక్షరాలు... ‘సిరా చుక్కలు’

by Disha edit |
హృదయం పగిలిన అక్షరాలు... ‘సిరా చుక్కలు’
X

'కళ తప్పిన కళాఖండం మా పల్లె. కనుచూపు మేర మచ్చుకైనా కనిపించని మహావృక్షం. పల్లె సీమల రూపురేఖల్ని చెరిపేయడం తెల్లదొరలకు కూడా సాధ్యం కాలేదు. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం మాటేమోగాని, కనీసం నేడున్న స్థితిలోనైనా మన గ్రామాలు కనుమరుగు కాకుండా మిగుల్చుకోవడం సాధ్యమేనా'

బతుకు బాధల కలరాత..

'సిరాచుక్కలు... బతుకు బాధల కలరాత' పుస్తకంలో ఎస్. సుధాకర్ వ్యక్తం చేసిన ఈ చేదు నిజాలు ప్రతి హృదయాన్ని కలవర పెడతాయి. తిరుపతిలో నలభై మూడేళ్ళ క్రితం ఆర్ఎస్‌‌యూ సుధాకర్‌గా నాకు పరిచయయ్యారు. రాడికల్ విద్యార్థి రాష్ట్ర నాయకుడుగా, మూడేళ్ళు జైలు జీవితం గడిపిన రాజకీయ ఖైదీగా, ఆర్టీసీ ఉద్యోగిగా, హైకోర్టు న్యాయవాదిగా, రచయితగా, పాత్రికేయుడుగా విశేష జీవితానుభవం గడించిన సూరిశెట్టి సుధాకర్ మళ్ళీ ఇన్నాళ్ళకు ఈ పుస్తకంలో హృదయం పగిలిన అక్షరంలా ఇలా దర్శనమిస్తున్నారు.

గ్రామీణ జీవితమే కాదు, నగర జీవితం కూడా అతలాకులతమైపోతోంది. చదువులు, ఉద్యోగాలు, చిన్న చిన్న వ్యాపారాలు, రాజ్యాంగం ప్రసాదించిన పౌరహక్కులు కూడా ఎలా ఛిన్నాభిన్నమై పోతున్నాయో సుధాకర్ తన పుస్తకంలో చూపించారు. 'ఆకలి, అనారోగ్యం, అభద్రత, కరువు, నిరుద్యోగం, అసమానతల వంటివన్నీ పాలకవర్గాల దృష్టిలో నేరాలుగానే నమోదవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకలి తీర్చలేని అభివృద్ధిని ఎలా గుర్తించాలో ఈ దేశ రైతాంగానికి అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోతోందంటారు.

భారత ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మల్లా ఉన్న పల్లెటూళ్ళు వల్లకాళ్ళుగా మారిపోవడం (2000 నాటికి) యాభై సంవత్సరాల అభివృద్ధి ఫలితమంటే కాదనడం సాధ్యం కాదేమో! సంక్షేమ పథకాల సబ్సిడీలన్నీ వికటించి రైతుల పాలిట నకిలీ విత్తనాలుగా, కరెంటు కోతగా మిగలడం అభివృద్ధిలో భాగమే! అభివృద్ధి అంటే హింస, కష్టాలు-కన్నీళ్ళు, జీవనోపాధిని కోల్పోవడమనే కొత్త నిర్వచనం వచ్చేసింది. అడ్డమొచ్చిన గుడిసెల్ని, గ్రామాల్ని కూలదోసి విశాలమైన రోడ్లను, విమానాశ్రయాలను, ఆకాశ హర్మ్యాలను నిర్మిస్తామంటే, మానవహక్కుల్ని వెతుక్కోవాలా, కోల్పోతున్న పౌరహక్కులకై పోరాడాలా అన్నది తేల్చుకోవాల్సిన ప్రశ్నే. దళిత చైతన్యం రిజర్వేషన్లకు, ఉద్యోగాలకు పరిమితమైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

విప్లవకారుల వైఫల్యం తెలియజేస్తూ..

క్విట్ ఇండియా ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ పాల్గొనక పోవడమే కాక, దాన్ని వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేస్తారు. మత విశ్వాసానికి గాంధీ ప్రతీక అయితే, మతోన్మాదానికి సావర్కార్ ప్రతీకగా నిలుస్తారని అంటారు. నిచ్చెన మెట్ల కులవ్యవస్థను 'హిందుత్వ ముసుగులో పునరుద్ధరించాలని భావించిన ఆర్ఎస్ఎస్ తన నైజాన్ని బహిరంగంగా ప్రకటించలేదు. కాశ్మీర్ అందాలు ఎంత విలక్షణమైనవో, సమస్యలూ అంతే విలక్షణమైనవంటారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న వేర్పాటువాద రాజకీయ హింసలో ఆ అందాలు మసైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తారు.

'ఎన్నికల్ని కూడా ఒక ఎత్తుగడగా గుర్తించి, పెరుగుతున్న శక్తిని సంఘటిత పర్చుకోవడంలో తన రాజకీయ వ్యూహానికి అనుకూలంగా మలుచుకోవడంలో పీపుల్స్ వార్ విఫలమైంద’ని తన జీవితం పెనవేసుకుపోయిన ఆ విప్లవ సంస్థ గురించి కూడా నిర్మొహమాటంగా వ్యాఖ్యానిస్తారు. 'ఓటు వెయ్యని వాడు చచ్చినవాడితో సమానం' అన్న స్థితి ఇంకా బలంగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తారు. సమసమాజ స్థాపనకు పోరాటమే ఏకైక మార్గం అనడం ఎంత సత్యమో, పోరాట రూపాలు కూడా అనేకం అన్నది అంతే సత్యం అంటారు. మార్క్సిస్టు మూల సూత్రాల వెలుగులో పరిశీలించినా దీర్ఘకాలం ఎన్నికలను బహిష్కరించడం శాస్త్రీయమైన ఆలోచన కాదంటారు.

ఎన్నికల వ్యవస్థను అసహ్యించుకోవలసిందే. ఆ ఏవగింపు, కోపం ప్రదర్శించాల్సింది ప్రజలు కానీ, పిడికెడు మంది నాయకులు కాదన్న విషయాలు ఆలోచించాలి. ఒక ఆయుధం అనివార్యమనుకుంటే, అది కేవలం ఒక ఆసరాగా మాత్రమే ఉండాలి. అలాంటి ఆయుధం తమకు ఆసరాగా నిలబడుతుందనుకున్నప్పుడు ప్రజలు దాన్ని ముద్దాడుతారు. భుజాలపై మోస్తారు. ఆయుధం తమను శాసిస్తుందనుకుంటే ప్రజలు తిరగబడతారు. ఆయుధాలకు ఎదురొడ్డి పోరాడుతారు. దొరలైనా, పోలీసులైనా, అన్నలైనా అందులో ఎలాంటి మినహాయింపులూ ఉండవు' అంటారు నిర్మొహమాటంగా. 'శత్రువును దూషించడంలో చూపించిన చొరవ, శత్రువును అధ్యయనం చేయడంలో చూపించలేదు' అంటూ కొనసాగుతున్న భారత విప్లవకారుల వైఫల్యం గురించి ఆవేదన వ్యక్తం చేస్తారు.

చదవదగ్గ మంచి పుస్తకం..

చరిత్రలో 'మతం' పాత్ర గురించి చెపుతూ పాలకుల భావజాలంగా 'మతం' రూపొందింది. కింది స్థాయిలో అదే మతం పాలితుల జీవన విధానంగా మారి 'చట్టం'గా చలామణి అయింది. ఏ మతమూ దానికదే సంపూర్ణ స్థాయిలో ఉన్నతమైందీ కాదు, దురదృష్టమైందీ కాదు అంటారు. సమాజాన్ని చాలా బాగా ప్రభావితం చేయగలిగిన పారిశ్రామిక విప్లవం, ఫ్రెంచ్ విప్లవం ముస్లిం సమాజాన్ని చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రభావితం చేయలేకపోవడం ఒక చారిత్రక విషాదం అంటారు. ఇది చర్చించాల్సిన అంశం.

నేపాల్‌లో లౌక్యమో, గందరగోళమో, లోపమో తెలియని మావోయిస్టు నేత ప్రచండ గురించి, అమెరికాలో ఆర్థిక మాంద్యం గురించి, శ్రీలంకలో జాతుల సమస్య గురించి, ఎల్టీటీయీ దుందుడుకు పోకడలతో లంక తమిళులు ఎలా సమిధలైందీ వివరించారు. ఆస్ట్రేలియాలో మూలవాసులను నాశనం చేసి పెత్తనం చెలాయిస్తున్న శ్వేతజాతీయుల గురించి విశ్లేషించారు. అమెరికా, ఐరోపా దేశాల అభివృద్ధి యావత్తూ ఆసియా, ఆఫ్రికా దేశాల కాయకష్టం, మేధోసంపత్తిపైన ఆధారపడి నిర్మించిందేనని స్పష్టం చేశారు. దాడులతో దోచుకోవడం తప్ప కష్టపడి సంపదను సృష్టించడం చేతగాని సోమరుల జాతిగా శ్వేతజాతి ఏనాడో దిగజారిపోయిందని ఒక మాటల పోటు పొడుస్తారు.

కోర్టు ధిక్కారం పేరుతో అరుంధతీరాయ్‌కు శిక్షవేయడం, ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నీరుగార్చిన తీరు, ఇలా ఒకటేమిటి సమస్త విషయాల గురించి 368 పేజీల 'సిరాచుక్కలు'లో సుధాకర్ చర్చించారు. వరవరరావుతోపాటు తనపైన పెట్టిన రామనగర్ తప్పుడు కుట్రకేసులో హైదరాబాద్ సెషన్స్ కోర్టులో తాను చదివిన ప్రకటనను కూడా ఇందులో చివరగా పొందుపరిచారు. కాస్త పేజీల భారమైనా చదవదగ్గ మంచి పుస్తకం. ఈ పుస్తకం కోసం నవోదయ బుక్‌హౌస్‌తో పాటు రచయితను సంప్రదించవచ్చు. ఆయన ఫోన్ నెంబర్ 92462 16234. పుస్తకం వెల రూ. 200/-

సమీక్షకులు

-రాఘవశర్మ

94932 26180

Next Story

Most Viewed