- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ పుస్తకం.. అక్షరాల ఆనందమే!
వర్తమాన విద్యా వ్యవస్థలో తరగతి గదులు ఒక నిర్దిష్ట దిశలోనే సాగుతున్నాయి గురువు చెప్పడం, విద్యార్థి వినడం. విద్యార్థి ప్రశ్న అడిగనప్పుడు. ప్రశ్నలు లేని తరగతి గది జీవం లేని పుస్తకం లాంటిది అవుతుంది. కేవలం అకాడెమిక్ అంశాలకే పరిమితమవుతున్నది.

వర్తమాన విద్యా వ్యవస్థలో తరగతి గదులు ఒక నిర్దిష్ట దిశలోనే సాగుతున్నాయి గురువు చెప్పడం, విద్యార్థి వినడం. విద్యార్థి ప్రశ్న అడిగనప్పుడు. ప్రశ్నలు లేని తరగతి గది జీవం లేని పుస్తకం లాంటిది అవుతుంది. కేవలం అకాడెమిక్ అంశాలకే పరిమితమవుతున్నది. నిజానికి విద్యార్థి ప్రశ్నించడం అనేది కేవలం సందేహం కాదు, అది ఆలోచన ప్రారంభం. విద్య యొక్క మూల స్ఫూర్తి.
గురువు చెప్పే సమాధానం కేవలం సమాచారం అందించడమే కాదు. అది విద్యార్థి ఆలోచనకు దిశానిర్దేశం చేయాలి. అది విద్యార్థిలో మరిన్ని ప్రశ్నలు అడగాలనే ధైర్యాన్ని పెంపొందిస్తుంది. ఈ ప్రక్రియలో ‘సంభాషణ’ ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. తరగతి గది ఒక ఉపన్యాస వేదికలా కాకుండా, ఒక సంభాషణ స్థలంగా మారాలి.
మౌనాన్ని అలవాటు చేస్తున్నామా?
ప్రస్తుతం మన స్కూళ్లలో ఉపన్యాసాలు ఎక్కువగా, సంభాషణలు తక్కువగా కనిపిస్తున్నాయి. పరీక్షల ఒత్తిడి, సిలబస్ పరిమితులు, కలిపి విద్యార్థి ప్రశ్నించే స్వరాన్ని క్రమంగా తగ్గిస్తున్నాయి. మనం నిజంగా విద్యను బోధిస్తున్నామా లేక మౌనాన్ని అలవాటు చేస్తున్నామా? సృజనాత్మక వ్యక్తిత్వ రూపకల్పన చేస్తున్నామా? అన్నది ఇవ్వాల్టి ప్రశ్న. విద్య అనేది ఒక పరస్పర సంభాషణ. ప్రశ్నలు అడిగే తరగతి గది చైతన్యంతో నిండిన సమాజానికి పునాది అవుతుంది. ప్రశ్నలతో ప్రారంభమయ్యే విద్య, కేవలం సమాధానాలకే పరిమితం కాకుండా, సృజనాత్మకతకు, విమర్శనాత్మక ఆలోచనలకు, భవిష్యత్ అభివృద్ధికి దారితీస్తుంది.
ర్యాంకులకు పరిమితం కాని సంభాషణ..
ఈరోజు ప్రశ్నించే విద్యార్థి రేపటి సృష్టికర్త. క్లాసులు కేవలం అధ్యాపకుల ఉపన్యాసాలకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి సంభాషణే సాహిత్యం పేర వారాల ఆనంద్ వినూత్న ప్రయత్నం చేసారు. తాను చదువుకున్న కరీంనగర్ కార్ఖానగడ్డ పాఠశాలలో తన మూడు పాదాల కవితా సంపుటి ‘త్రివేణి’ ఆవిష్కరించిన అనంతరం ఆయన విద్యార్థులతో జరిపిన సంభాషణను రికార్డు చేసి సంభాషణే సాహిత్యం పుస్తకంగా వెలువరించడం మరో విలక్షణ కృషి. సంభాషణే సాహిత్యం పేరుతో ముద్రించిన ఈ పుస్తకం స్ఫూర్తి గొప్పది. విద్యార్థులు పాఠాలు.. పరీక్షలు..ఫలితాలకు.. రాంకులకే పరిమితం కాకుండా సాహిత్యం, సమాజం గురించి ఆలోచన చేసేలా ఈ సంభాషణ సాగింది. పిల్లలు సరికొత్తగా ఆలోచించేలా..వారిలో సృజనాత్మకత వెలికి వచ్చేలా ఇది చేసిందనడంలో సందేహం లేదు.
చదువులోని మానవీయ కోణం..
వ్యక్తిగా ఎదిగే క్రమంలో చదువు ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తూనే అంతకు మించి చేయాల్సిందేమిటో ఈ సంభాషణ వివరించింది. మరో ముఖ్య విషయమేమిటంటే ఇది ఆనంద్ వ్యక్తిత్వాన్ని కూడా ఆవిష్కరించింది. ప్రజలు, సమాజం పట్ల ఆయన ఆలోచనా ధోరణిని చాటి చెప్పింది. ఆయనలో ఉన్న మానవీయ కోణాన్ని పరిచయం చేసింది. ఆయన సమాధానాల్లో తరతరాలకు ఉపయోగపడే ఎన్నో జీవన సత్యాలున్నాయి. వినయం, సంస్కారం, బాధ్యత, పట్టుదల ఇలా అనేక అంశాలపై ఆచరించాల్సిన అంశాలున్నాయి. వాటిలో మచ్చుకు కొన్ని..
చదువు జీవితం కోసం...
చదవండి..చదవండి..పుస్తకాల్ని చదవండి..జీవితాన్ని చదవండి. సమాజాన్ని చదవండి. ముఖ్యంగా మిమ్మల్ని మీరు మీరు చదవండి. చదవడం కేవలం పరీక్షల కోసమే చదవకండి. చదువు మార్కుల కోసమే కాదు చదువు జీవితం కోసం అని గుర్తుంచుకుని చదవండి. చదివింది అర్థం చేసుకోండి. ఆస్వాదించండి. రక్త నాళాల్లోకి ఇంకనీయండి. అదే చదువుకు సార్థకత”. ఒక మంచి వాక్యం చదివితే ఒక వెలుగు తలుపు తెరుచుకుంటుంది. దాని భావం అర్థం చేసుకుంటే మనసు నెమ్మదిగా వికసిస్తుంది. మనలోకి ఇంకితే అది ఓ గొప్ప ఆలోచనగా సజీవమవుతుంది. చదువు ఒక కాంతి.
ప్రక్రియ ఏదైనా రాస్తూపోవడమే...
వారాల ఆనంద్ నుంచి వచ్చిన ఇలాంటి ఎన్నో వాక్యాలు విద్యార్థులకే కాదు...అందరికీ మార్గదర్శకాలే. నాలో ఉవ్వెత్తున ఎగసి వస్తున్న భావాల్ని ఏదో ఒక రూపంలో వ్యక్తం చేస్తూనే వచ్చాను. చేస్తున్నాను.. ప్రక్రియ ఏదయినా కావచ్చు. నేను చెప్పాలనుకున్నది, రాయకుండా ఉండలేనిది రాస్తూనే ఉన్నాను అని వారాల ఆనంద్ అంటారు. అనేక సందర్భాలకు ఆయన స్పందిస్తూ ఉంటారు. ఆ స్పందన మూడు చిన్న పాదాల కవిత ‘త్రివేణి’ కావొచ్చు... మూడు వందల పేజీల విశ్లేషణ కావొచ్చు. అందరికీ సాధారణంగా కనిపించే అంశాలను ఆయన కవిత్వీకరించే తీరు, విశ్లేషించే తీరు అబ్బురపరుస్తుంది.
రక్తనాళాళ్లోకి ఇంకేదాకా చదవండి!
చదవండి...చదవండి..చదువుతూనే ఉండండి.. చదివింది రక్తనాళాల్లోకి ఇంకేవరకు చదవండి అని చెప్పడమే కాకుండా తాను కూడా దానినే పాటిస్తుంటారు. ఇలా కరీంనగర్ కార్ఖానాగడ్డ స్కూలులోనే కాదు అనేక కాలేజీలో విద్యార్థులతో సంభాషిస్తూ వాళ్ళల్లో సృజనాత్మక చైతన్యాన్ని మేల్కొల్పుతున్నారు. విద్యార్థులతో సంభాషణ లాంటి మంచి ప్రయత్నం చేసి సంభాషణే సాహిత్యం పుస్తకంగా తెచ్చిన వారాల ఆనంద్‌కి అభినందనలు. వారి సాహితీ సృజన నిరంతరం ఇలాగే కొనసాగి వెలుగులు ప్రసరింపజేయాలని ఆకాంక్షిస్తున్నాను.
-రావికంటి శ్రీనివాస్,
సీనియర్ జర్నలిస్ట్,
99088 92067






