- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సవాళ్లను ఎదుర్కొన్న సహజాత
Sahajata By Bandaru Vijaya Book Review

అనాదిగా మహిళలు స్వంతవారితో, సమాజంతో ఎదుర్కొంటున్న సవాళ్లని, పరిష్కరించిన తీరుకి అద్దం పట్టే పుస్తకమే ఈ "సహజాత". ఇందులో కథలు కథలు కావు.. నిత్యం మన చుట్టూ జరిగే జీవితాలనే కథలుగా మలిచారు.
మానసికానుభూతి (ఒక ఆలోచన పట్ల ప్రతికూలత కానీ అనుకూలత గాని కలిగి ఉండటం.) ఈ కథలు చదువుతున్నప్పుడు అన్ని చోట్ల ప్రతికూలత కనిపించిన కూడా పాజిటివ్ దృక్పధాన్ని కలిగి ఉండటాన్ని గమనిస్తాము. మార్గదర్శకత్వం ఇక్కడ సమస్యలు వాటి పరిష్కారాలని అనుభవాలే గైడ్ చేస్తాయి. మొదటి కథలో వినోదిని అమ్మ ఎలా సమస్యల నుంచి గట్టెక్కింది దాని అనుసారమే కదా వెళ్ళింది. జీవితం అంటే ఏమిటి ...కష్టం సుఖం కదా...కానీ అన్నీ కష్టాలే అది కూడా భర్త నుంచి ఎదురు అయితే, రచయిత ముసుగులో శాంతి భర్త పెట్టిన హింసకి చివరి వరకు పోరాటం చేసింది. ఆ హింసకి ఆమె abberation (మాములు మానసిక స్థితి కోల్పోవడం) తన స్థితి అస్థిరంగా ఉన్నా కోలుకుంటుంది. శాంతి లాంటి మహిళలు ఎందరో ...ముసుగు వేసుకున్న పురుష అహంకారం ఎప్పటికి చావదు (జీవితం అంటే)
ఈ తరానికి కావాల్సిన నిర్ణయం!
ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు ఆడపిల్ల పుట్టింది అని హింసకి గురి చేస్తే పిల్లల కోసం అయినా ఎటు పోవాలో తెలియక మహి సతమతం అవుతుంటే వంశీ వాళ్లు తీసుకున్న నిర్ణయం ఇప్పటి తరానికి కావాల్సింది. చేజారిన జీవితాన్ని మళ్ళీ నిలబెట్టేందుకు పడిన కృషికి హ్యాట్సాఫ్ (చేజారిన జీవితం) .. ఎంతమంది బంధువులు ఉంటే ఏమిటి ...కొడుకులు కోడళ్ళు, అన్నతమ్ములు ఎంతమంది ఉన్నా కూతురుకి ప్రేమ ఇసుమంత కూడా తగ్గదు ...వాళ్ళ కొట్లాటలో తన తల్లిని కాపాడుకోలేని వసుధ లు ఎంతమందో ....(అమ్మ నువ్విక వెళ్ళిపో ).... అనఘ కదా చదువుతున్నప్పుడు ఒక్కసారిగా దుఃఖం తన్నుకొస్తోంది .. కంటికి రెప్పలా కాపు కాయాల్సిన కుటుంబ సభ్యులే, చేయకూడని పనులు చేస్తే ఇంకా దిక్కు ఎవరు ? ...అసలు బాలికలు , యవ్వనవతులు ఎదుర్కొంటున్న లైంగిక దారుణాలు కుటుంబ వ్యవస్థనే మూలం. ...(అనఘ)
మనసును వెంటాడే కథలు..
సహజాత సంపుటిలో ప్రతి కథని చాలా అంటే చాలా తీరికగా చదవాలి ..ఇలా పేజీలు తిరగేస్తూ హడావుడిగా ముగిస్తాను అంటే కుదరదు ..ఎందుకంటే ప్రతి కదా మనసుకి హత్తుకుంటుంది. ఆలోచింప చేస్తుంది . ఇప్పటి సమాజంలో మహిళా తన స్థానం ఏమిటి, పురుషాధిక్యత ఎన్ని రూపాల్లో తనని వెంటాడుతుందో చూడవచ్చు. ఈ సంఘర్షణ ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. ఈ కథల్లో మీకు సామెతలు, సూక్తులు కనిపిస్తాయి ...బహుశా కధల్ని సరళత దిశలో తీసుకువెళ్తూ మరింత మందికి చేరవేయడానికి కావొచ్చు ..."మనుసులు కలవని చోటు" లో మాటలతో మహిళలని హింసించడం ఎంత దూరం వెళ్తుంది చూపుతుంది ....అనుమానం, అసమానతలు, మానసిక హింస వలన ఏకాకిగా మరి ఏమి చేస్తున్నారో తెలియని దిశలో అర్ధరాత్రి ఒంటరిగా ఎక్కడికో వెళ్లడం భయానకంగా ఉంటుంది.
వీధిన పడకూడదంటే...!
అన్ని కథల కంటే నన్ను బాగా కదిలించిన కథ ఒకటి ఉంది .. మనం కోరుకునే సిస్టర్ హుడ్‌కి సజీవ ఉదాహరణ ...స్త్రీల మద్య సామరస్యం ఉన్నప్పుడు సమస్యల పరిష్కారం సాధ్యమే అని చెప్పే కథ "మార్పు అనివార్యం" .. శరీరంలో వచ్చే అనుకోని మార్పుల వలన, మనసులో వచ్చే భావనలు, భావోద్వేగాల వలన, ట్రాన్స్ ఉమెన్‌గా మారే పిల్లలని కుటుంబం అర్థం చేసుకొని కలుపుకుంటే వాళ్ళు వీధిన పడే అవసరం ఉండదు అని సమాజం, కుటుంబం ఎప్పటికీ అర్థం చేసుకుంటాయి ?... విజయ భండారు ఎన్నో మంచి కథా సంపుటిలని అందించారు. ఇది అందులో ఉత్తమ సంపుటి అని నిర్మొహమాటంగా చెప్పొచ్చు. ఇలాంటి ఆలోచింపచేసే కధల్ని వెలికితీసి మరింత చైతన్యవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి అభినందనలు .
పుస్తకం: సహజాత
రచయిత: భండారు విజయ
ప్రతులకు: 88019 10908
అన్ని పుస్తక కేంద్రాలు ..
సమీక్షకులు
-పుష్యమీ సాగర్
79970 72896






