ఒరేయ్!...

by Ravi |   (  Updated:2026-07-13 00:00:37  IST  )

Poem

ఒరేయ్!...
X

ఒరేయ్!... ఓ సంబోధన!

ఒకరి ఆహంకారానికి ఆభరణమో,

ఒకరిపై ఆధిపత్యానికి ఆయుధమో కాదు!

మా అమ్మానాన్నలు

మాయమైపోతూ భూమిమీదే వదిలేసిన

అనాథ పదం.

అప్పుడప్పుడు మా బాబాయ్ పిలిచే

వాత్స్యల్యపు మూట.

చిన్న బడిలో, పెద్ద బడిలో

నాతో సదివిన దోస్తుగాళ్లు

బడిసదువు అయిపోయాక

కాలంతో పాటు సర్దుకుపోయిన జ్ఞాపకం.

ఇంటర్ సోపతోళ్లు

అమెరికాకు వలసపోతూ

సూట్ కేస్లో వేసుకున్న ఆప్యాయ పలకరింపు.

ముప్పై ఏళ్ల తర్వాత కలిసిన

మా లెక్కల సార్,

మాట్లాడటానికి కాస్త ఇబ్బంది పడుతూ

పలికిన గొప్ప పదం.

ఎప్పుడైనా

ఏకాంతంలో నా ప్రియురాలు

నన్ను పిలిచే ప్రేమ పరిమళం...

రాఖీ పండుగకి మా అక్కలు

మైసూర్ పాక్ కి జతగా తెచ్చే స్వీట్ ముక్క.

"ఒరేయ్!"

పదం కాదు...

కాలం దాచుకున్న

అనుబంధాల చిరునామా.

ప్రేమ అభిమానపు మాట.

-నక్క శ్రీనివాస్,

98486 13844

Next Story