ఓ అపరిచితుడా!

by Ravi |   (  Updated:2026-05-31 23:45:22  IST  )

Poem

ఓ అపరిచితుడా!
X

వెళ్లిపోతున్న ఓ అపరిచితుడా

నీకు తెలీదు, నేను నిన్ను

ఎంత ఆర్తిగా చూస్తున్నానో

నువ్వే నాక్కావాల్సిన అతడివి,

లేదా నాక్కావాల్సిన ఆమెవి

(ఇదంతా నాకు కలలా తోస్తోంది)

నేనెక్కడో నీతో సంతోషంగా

జీవించి వుంటా

మనం విడివడుతున్నప్పుడు

అంతా గుర్తుకువస్తోంది,

ఆ ప్రవాహం, అనురాగం,

పవిత్రత, పరిణితి.

నువ్వు నాతోపాటే పెరిగావు

ఒక బాలుడిలానో, బాలికలానో.

నేను నీతో కలిసి తిన్నా,

నీతో కలిసి పడుకున్నా

నీ శరీరం నీది మాత్రమే కానట్టు,

నా శరీరం నాది మాత్రమే కాదు.

మనం తారసపడినప్పుడు

నీ నేత్రాలు, వదనం, మేనితో

నువ్వు మధురానుభూతిని కలిగించావు

బదులుగా నా చుబుకాన్ని,

వక్షాన్ని, హస్తాలను

నీతో తీసుకుపోయావు.

నేను నీతో మాట్లాడకూడదు.

ఒంటరిగా కూర్చున్నప్పుడో

రాత్రి ఏకాంతంలో మేల్కొన్నప్పుడో

నీ గురించి ఆలోచించాలి

నేను నిరీక్షించాలి.

సందేహమేం లేదు, నేను

నిన్ను మళ్లీ కలుస్తాను

నేను చూసుకుంటాను,

నిన్ను కోల్పోకుండా.

ఆంగ్లం: వాల్ట్ విట్మన్

తెలుగు: దేశరాజు

99486 80009

Next Story