మగాడివి కదా… ఏడవకు!”

by Ravi |   (  Updated:2026-03-16 00:45:41  IST  )

Poem

మగాడివి కదా… ఏడవకు!”
X

అరిగిపోయిన మాటలకో

నాలుగు అక్షరాల ధైర్యం అయిపోతుంది.

“ఇంటి బలం నువ్వే” అన్న బాసలు

అతని అలిసిన భుజాలపై

రోజూ జరిగే అగ్నిహోత్రం.

మనసు కాదు… డబ్బు మాత్రమే

నిరూపించగలిగే మగతనం.

విక్టిమ్స్‌కి ధైర్యం చెప్పే లోకం ఇప్పుడు,

పదేళ్ల అబ్బాయిలకి కూడా

“నువ్వే ఇంటి భవిష్యత్” అని

బరువైన కలలు పెట్టేస్తుంది.

ఈలోగా,

రోడ్డు మీద కూలిపోతున్న

ఓ తండ్రిని చూసి

“బలహీనుడు” అని నవ్వి

మరుసటి రోజుకే మరిచిపోతుంది.

బయట. అతని చెమటతో

ఇళ్లు నిలబడతాయి…

లోపల అతని నిశ్శబ్దంతో

గోడలు నిలబడతాయి.

చట్టం అతని బాధను కాదు…

అతని మౌనాన్నే బలం అంటుంది.

ప్రతిఘటించలేని

అతని గుండె ఆర్తనాదాలు

గాలిలో కలిసిపోతాయి.

ఇంకేం రండి మరి!

ఉదయం పేపర్లో

మరో రైతు ఉరేసుకున్న కథ…

మరో తండ్రి ఓడిపోయిన

జీవితం చదువుకుందాం…

ఎప్పట్లాగే…

హ్మ్! మగాడి కన్నీళ్లు

పేపర్‌లో వార్తలే అవుతాయి…

లోకానికి మాత్రం ఎప్పటికీ కనిపించవు.

మగాడి కన్నీళ్లు బయట పడవు…

అవి లోపలే సమాధి అవుతాయి.”

-శ్రావణ్ కుమార్

Next Story