రక్తాక్షరాల్లో రాసిన బాల్యం

by Ravi |   (  Updated:2026-03-09 00:45:28  IST  )

Poem

రక్తాక్షరాల్లో రాసిన బాల్యం
X


పాఠశాల ముంగిట

పసిడి పొద్దు పూస్తుండగా

పుస్తకాల పరిమళంలో విరిసిన బాల్యం

ఒక క్షణంలో బారుదు గాలికి బలి అయింది.

ఇరాన్ ఆకాశం చీలి పడింది

నీలిమ ముక్కలై రాలింది

నల్లబల్లపై “శాంతి” అక్షరం

రక్తంతో చెరిగిపోయింది.

నవ్వులు నేర్చుకుంటున్న పెదవులు

అరుపులకూ అవకాశం లేకుండానే

నిశ్శబ్దమయ్యాయి చిన్నచేతుల్లో

పెన్సిళ్లు కాదు భయమే వణికింది.

అది యుద్ధమని చెప్పారు, వ్యూహమని చెప్పారు

అమెరికా శక్తి, ఇజ్రాయిల్ ఆగ్రహం

రాజకీయ పదాలు కావచ్చు

కాని మట్టిలో కలిసినవి పదాలు కావు

పసిప్రాణాలు..

సామూహిక సమాధి వద్ద

భూమి గుండె బీటలైంది

మట్టిని తాకితే ఇంకా వేడిగానే ఉంది

అక్కడే కొట్టుకుంటున్నాయి అనాథ కలలు.

జెండాలు కప్పి విజయం పాడటం

మనిషితనానికి అంత్యక్రియలే.

రక్తంతో రాసిన చరిత్ర విజయగాథ కాదు

మనిషితనం ఓటమి గాథ.

మనుషులుగా ఆలోచిద్దాం

మనుషులుగా మిగిలిపోదాం.

-వలిపి శ్రీరాములు,

9441135762

Next Story