ఆమె వెళ్లిపోయింది..!

by Ravi |   (  Updated:2026-03-08 23:45:19  IST  )

Poem

ఆమె వెళ్లిపోయింది..!
X

నాలుగు గోడల మధ్య

తనని బందీని చేసి అనుమాన వ్యాధితో

అవమానించినందుకు ఆమె వెళ్లిపోలేదు

నోరే కాదు చేయి చేసుకుంటున్నా

నోరు మూసుకు పడి ఉందే కాని

గడప దాటి వెళ్లలేదు

పరువు, రక్షణ అనే రెండు సూత్రాలను

నమ్ముకుని నిలిచింది కాని

వెళ్లిపోవాలనుకోలేదు

పొడవుగా, ఒత్తుగా, మోకాళ్ల దాకా

విస్తరించిన తన జడని

మొదలంటా కత్తిరించటానికి

కత్తితో మీద మీదకు వస్తుంటే

అతనిలోని అమానవ లక్షణాన్ని చూసి

భయంతో బెదిరిపోయి వెళ్లిపోవాలనుకుంది!

అతని నాలుక దాహానికి తన జుట్టుని

అమ్ముకుంటానన్నప్పుడు

సహనం బద్ధలై, భయం నిర్భయమై

అతని వ్యసన దాహానికి ఇంకా

తనని కూడా అమ్మేస్తాడేమోననే

అసహ్యంతో, ధిక్కారంతో

విశాల ప్రపంచంలో తనకో

చోటు వెతుక్కుంటూ

ఆమె ఇల్లు వదిలి వెళ్లిపోయింది.!

- డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి

63027 38678

Next Story