ఇదేనా? మహిళా సాధికారత

by Ravi |   (  Updated:2026-03-08 23:46:19  IST  )

Poem

ఇదేనా? మహిళా సాధికారత
X

మాటలకేం అనేకం

ఉపన్యాసాలన్నీ ఊకదంపుడు పాటలేకదా

వాగ్దానాలన్నీ గురితప్పిన బాణాలే..

పోరాటాలన్నీ అస్తిత్వ స్వాభిమానాలే

ఎన్నికల మైదానంలో

హామీల అలల ఉద్ధృతిలో

గట్లు తెగిపడ్డ ప్రవాహాల్లో

బరిలో ఉన్నది ఎవరో ..

రాజకీయాలు రాటుదేలాయి

తర తరాలు ఎరుగని బంధం

తన్నులాటలకు, వెన్నుపోట్లకు నిలయం

మానవ ఆనవాళ్ళు లేనితనం

ఇన్ని నిజాలు కళ్లెదుట సాక్షాత్కరిస్తుంటే..

ఏదీ ఆచరణ సాధ్యం కాదని తెలిసీ ..

ఏదో ఫలితం ఉంటుందనే ఆశ .. గంపెడాశ

సాంకేతిక పరిజ్ఞానం తీరు

కొండనాలుకకు మందేస్తే

ఉన్న నాలుక ఊడిపోయినట్టు

మగ మృగాల సమాజంలో

అర్థం లేని ఆలాపనలు

ఉద్యోగినే కానీ ఆర్థిక స్వాతంత్ర్యం లేదు

స్వేచ్ఛ ఉంది కానీ

కట్టూ బొట్టు మీద విధించే ఆంక్షలు

నోరు మాట్లాడుతుంది.. హామీల రూపంలో

నొసలు వెక్కిరిస్తుంది.. ఆచరణ సాధ్యం కాదని

ఉచితమైనా అనుచితమైనా

బేటీ పడావో అయినా

మహిళా సాధికారత అయినా

మహిళలను కట్టడి చేసే జనాలు

సమాజంలో వ్యాపిస్తున్న వ్రణాలు

-గిరిజ పైడిమర్రి

99494 43414

Next Story