గడప నుండి గగనం దాకా..

by Ravi |   (  Updated:2026-03-09 00:31:25  IST  )

Poem

గడప నుండి గగనం దాకా..
X

ఆమె కేవలం ఒక పూలదండ కాదు

కాలాన్ని మలిచే ఉక్కు సంకల్పం.

ఆమె కేవలం కన్నీటి చరిత్ర కాదు

నిశ్శబ్దాన్ని చీల్చే సింహగర్జన.

శతాబ్దాల చీకటిని మోసిన చేతులే

ఇప్పుడు వెలుగుల

దీపస్తంభాలుగా మారుతున్నాయి.

ఇంటి గడపకే పరిమితమైన అడుగులు

ఇప్పుడు ఆకాశాన్ని కొలుస్తున్నాయి.

ఆమె గొంతు నిన్నటి నిశ్శబ్దం కాదు

నేటి స్వేచ్ఛా శంఖనాదం.

అణచివేత గోడలపై ఆమె స్వప్నాలు

విప్లవ జెండాలు ఎగరేస్తున్నాయి.

హక్కులు ఆమెకు ఇచ్చే దానం కాదు

ఆమె జన్మహక్కు.

బాధ్యతలు ఆమెపై మోపిన బరువు కాదు

సమాజాన్ని నిలబెట్టే భుజబలం.

స్త్రీ సమానత ఒక నినాదం కాదు

మనిషి చరిత్రను మళ్లీ రాసే అక్షరం.

ఆమె నడక ప్రారంభమైతే

భవిష్యత్తు దిశ మారిపోతుంది.

ఆమె అడుగుల సవ్వడిలోనే

కొత్త చరిత్ర పురుడు పోసుకుంటుంది.

- యండి. ఉస్మాన్ ఖాన్

99125 80645

Next Story