ఆశల పునాదిపై .. అధికారపు బుల్డోజర్

by Ravi |   (  Updated:2026-03-02 01:00:40  IST  )

Poem

ఆశల పునాదిపై .. అధికారపు బుల్డోజర్
X

నిన్నటి వరకు అక్కడ ఒక వాకిలి ఉండేది

ముంగిట ముగ్గు వేసిన ఆశల పొద్దు ఉండేది

పెనం మీద రొట్టె కాలే మట్టి వాసన ఉండేది

గోడల మధ్య పారే పిల్లల నవ్వుల సెలయేరుండేది!

కానీ... అధికారపు ఆకలికి హద్దులు లేవేమో!.

పేదవాడి గూడును పచ్చిగా కబళించింది!

అమ్మ ఒడి లాంటి గడప అనాథయ్యింది

గోడల మీద అక్షరాలు నేలపాలయ్యాయి

జనం గుండె చప్పుడు ముక్కలైపోయింది!

జీవితకాలపు చెమట చుక్కల్ని ఇటుకలుగా పేర్చి

ప్రాణాన్ని పునాదిగా వేసి కలల గూడు కట్టుకుంటే..

నిమిషాల వ్యవధిలో.. కలల కట్టడాన్ని

శిథిలాల కుప్పగా మార్చారు!

అధికారపు కళ్లకు పేదల కన్నీరు కనబడదు..

పాలితుల చెవికి బాధితుల ఆక్రోశం వినబడదు..

గూడు చెదిరిన పక్షికి ఆకాశమే దిక్కైనట్టు..

నేలమట్టమైన ఇంటి ముందర వాళ్లు..

నిశ్శబ్ద శూన్యంలా నిలబడి చరిత్రకు సాక్ష్యంగా మిగిలారు!

బాధితుల కన్నీరు కట్టలు తెంచుకుంటే..

నీ అహంకారపు కోటలు గడ్డిపోచలా కొట్టుకుపోవా?

నిన్ను అందలం ఎక్కించిన చేతులకు..

దించడమూ తెలుసు

నీ అహపు పొరలు విప్పి..

నిన్ను నిలదీయడమూ తెలుసు !

ఓ అధికార అహంకారమా..

జనం తలుచుకుంటే..

నువ్వు కూర్చున్న పీఠమే కాదు

రేపు నువ్వు నిలబడటానికి

నిలువ నీడ కూడా దొరకదు!

కాలం ఎప్పుడూ ఒకేలా

ఉండదని మరువకు ..

ప్రజా తీర్పు ముందు

ఏ కండకావరమూ నిలబడదు!

కళ్ళు విప్పి చూడు.. లేదంటే.. చరిత్ర

నిన్ను చెత్తబుట్టలో వేయక మానదు!

-వి. శాంతి ప్రబోధ

98667 03223

Next Story