- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

నువ్వు రావడం.. నాకేమాత్రం ఇష్టం లేదు
అయినా.. వస్తావని తెలుసు
నువ్వు నా వెన్నంటే ఉంటావని..
నన్ను మనసారా హత్తుకోవడానికి
నీ చేతులనెప్పుడూ విస్తరించే ఉంటావని
కూడా నాకు తెలుసు!
వస్తే వచ్చావు గాని.. కాస్త నిదానించి రా..!
ఈ మధ్యనేగా బతుకు విలువ తెలిసింది?
ఇప్పుడిప్పుడేగా.. జీవితాన్ని
జీవించడాన్ని మొదలుపెట్టింది?
బ్రతుకునది ఒడ్డున వసంతాలు
సన్నటి చివురులేస్తోంది.. ఇప్పుడిప్పుడేగా!
అందుకే.. కాస్త ఆగు!
ఇక్కడ చక్కబెట్టాల్సిన కార్యాలు
చాలానే ఉన్నాయి
తీర్చుకోవాల్సిన రుణాలు ఉన్నాయి
పంచుకోవాల్సిన ప్రేమలు ఉన్నాయి
విదిల్చుకోవాల్సిన దుఃఖాలు ఉన్నాయి
దిద్దుకోవాల్సిన మెరుగులు ఉన్నాయి
సర్దుకోవాల్సిన చిందరవందరలూ ఉన్నాయి
కుట్టుకోవాల్సిన చిరుగులు ఉన్నాయి
ఆలపించాల్సిన రాగాలు వున్నాయి
ఆస్వాదించాల్సిన సాయంసంధ్యలు ఉన్నాయి
నడవాల్సిన దూరాలు ఉన్నాయి
చేరుకోవాల్సిన తీరాలు ఉన్నాయి
కలుపుకోవాల్సిన చేతులు ఉన్నాయి
పూడ్చుకోవాల్సిన లోటుపాట్లు ఉన్నాయి
అందుకే.. ఓ మరణమా..
నా హృదయంగ నేస్తమా..!
ఇంకొంత కాలమైనా
నన్నిక్కడ ఉండనీ!
నిండారా ఆవహించిన
అలసటను తుడుచుకొని..
ఈ కాలం నేలమీద
ఇంకొన్ని జ్ఞాపకాల మొక్కల్ని
నీరుపోసి పెంచుకోనీ!
నా మనో కలాన్ని స్వచ్ఛమైన
చెలిమి సిరాలో అద్ది
ఇక్కడి మనుషుల హృదయాలపై
నాలుగు చెరిగిపోని వాక్యాలు రాసుకోనీ!
-సునీత గంగవరపు
94940 84576
- Tags
- Poem






