బ్రెయిన్ డెడ్ మరణాన్నే కోరుకుంటాను..

by Ravi |

Poem

బ్రెయిన్ డెడ్ మరణాన్నే కోరుకుంటాను..
X

సహజ మరణం కన్నా బ్రెయిన్ డెడ్

మరణాన్నే కోరుకుంటున్నాను.

బ్రెయిన్ డెడ్ అయితే నా శరీరం లో

ప్రతి అవయవాన్ని దానం చేయొచ్చు.

నేను బతికున్నప్పుడు ఒక బక్కప్రాణినే

బ్రెయిన్ డెడ్‌తో పదుగురిలో కొత్త వెలుగులు

నింపుతు బలియై సజీవమవుతాను.

పునర్జీవనం అంటే ఇదే కదా!

ఎవరో ఒకరికి ప్రాణం పోస్తూ..

మరణించినా జీవిస్తాను!

మిత్రమా! బ్రెయిన్ ఆగుతున్నప్పుడే

నా కళ్ళు...నలుగురి కళ్ళల్లో

నిజాన్ని చూసే ధైర్యాన్ని నేర్పుతాయి.

కన్నీళ్లను దాచుకుని

నవ్వును ప్రపంచానికి ఇచ్చేస్తాను.

నా కళ్ళతో ఈ లోకం తీరు చూస్తా.

పర్వతాల ఎత్తులను... అంతులేని అగాదాల్లో

భూమి దాచుకున్న నిశ్శబ్దాన్ని

నీలిపూల నిబిడీకృత రహస్యాలను

ఆశ్చర్యoగా, అద్భుతంగా చూస్తాను.

లోయల ఒడిలో నిద్రించే అందాన్ని

సెలయేళ్ల చప్పుడుల నర్తించే సౌందర్యాన్ని

ఇంద్రధనస్సు రంగులను

వాన తాకిన కళ్ళల్లో

లేలేత వలపుల్లా నింపుకుంటాను.

వరిచేల వంపులను,

సజ్జ జొన్న చేల ధీరత్వాన్ని

వెదురుగూముల సామూహికతను

వంగపూల రంగులను

నా కళ్ళ కాన్వాస్‌పై రవివర్మ చిత్రాల్లా

ప్రకృతిలో అందమంతా నా కళ్ళతో ఎక్సరే తీసేస్తాను.

మిత్రమా!

మరణం అంటే మట్టిలో కలిసిపోవడం కాదు

బ్రెయిన్ డెడ్..అంటే నిశ్శబ్దమైన సరస్సు

అలలు ఆగినప్పటికీ నీరు

ఇంకా ఆకాశాన్ని ప్రతిబింబిస్తుంది.

నా గుండె మరొకరి ఛాతిలో

లబ్ డబ్ అని నినాదమై మోగినప్పుడు

అది కేవలం రక్త ప్రవాహం కాదు నా స్వప్నాల రాగం.

నా ఊపిరితిత్తులు...

మరొకరిలో లోతుగా శ్వాస తీసుకున్నప్పుడు

పారిజాత పూల సువాసనగా

వారి జీవితంలో నేను విహరిస్తాను.

నా లివరు నిశ్శబ్దంగా పని చేస్తూ

మరొకరి గమనంలో అజ్ఞాత నక్సలైట్‌గా నిలుస్తుంది.

నా ప్రాంక్రియాస్ చిన్న మాధుర్యాన్ని సమతుల్యం చేస్తూ

వారి రక్తంలో సంతులనం అనే కవిత రాస్తుంది.

నా చర్మం...మరొకరి గాయాలపై పూతగా మారి

నొప్పిని నెమ్మదిగా మసకబార్చినప్పుడు

మృదువైన స్పర్శగా నేను మళ్ళీ జీవిస్తాను.

మిత్రమా!

ఇలా ఒకరి చూపులో వెలుగై

ఒకరి ఛాతిలో నాదమై

ఒకరి శ్వాసలో గాలై

ఒకరి రక్తములో సమతుల్యమై

ఒకరి గాయంపై మృదువైన కవచమై

మళ్ళి మళ్ళి జీవిస్తాను... మళ్ళి మళ్ళి జీవిస్తాను.

నామిత్రమా!

మరణం ఒక ముగింపు అయితే

దానం ఒక విభజిత వసంతం.

ఒక విత్తనం అనేక చెట్లుగా మారినట్లే

ఒక్క జీవితం.. అవయవ దానంతో

అనేక శ్వాసలుగా మారిపోతాను.

మరణం తరువాత కూడా

ఇవ్వడానికి పనికివచ్చే ప్రతి దాన్ని ఇచ్చేద్దాం.

ఇంతకన్నా ఇంకేం కావాలి, ఇంత కన్న

గొప్ప ఆనందం ఏమి ఉంటుంది.

ఈ ఆనందం కోసం బ్రెయిన్ డెడ్ మరణాన్ని

కోరుకోవడo మధురమే కదా

- కాంతి నల్లూరి

63003 28040

Next Story