- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

ఇప్పుడు కాలం
నా చేతిలో కీలుబొమ్మ
ఇన్నాళ్ళు దాని నియంత్రణలో
నేనో పిల్లి కూన..
తెల్లారిందాకా
ముసుగుతన్ని పడుకోవాలని ఉన్నా
నాలుగింటికే లేపి ఉరిమి చూస్తూ
తరిమి తరిమి సాగనంపేది
అందువల్లే..
అరవై మైళ్లావలి చిన్నారుల చెంతకు
అందరికన్నా ముందే చేరిపోదును..
అప్పటికే వాళ్లు నాకోసం
గేటు దగ్గర ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు
అయితే.. గత కొన్నాళ్లుగా
తిరిగి తిరిగి
అక్షరాలను ఒలిచిపెట్టి
అలసిపోయానట
నా సేవలకిక సెలవంటూ
సర్కారు వారి లేఖ నా చేతికి
చింతించాలో, సంతసించాలో సందిగ్ధం
ఓ కొత్త మలుపు లోకి నా తొవ్వ
ఇప్పుడన్నా తీరిగ్గా లేద్దామనుకున్నా..!
ఊహూ.! కుదరదే
ఇన్నాళ్ళూ నన్ను నడిపిన జీవగడియారం
నా మాట వింటేనా.!
ఎప్పటిలా నాలుగింటికే తట్టి లేపి
కూర్చోబెడుతుంది.
శీతగాలుల సాకుతో
ముసుగుతన్ని ఇంకాసేపు నిదుర
నటిద్దామన్నా..
రెప్పలు తాజాగా విచ్చుకుంటున్నాయి
టిక్…టిక్…మంటూ చెవిలో
ఏదో జాగృత భాషణం
ఇది"విరమణ కాదు, ఒక విరామమే"
అని గుర్తుచేస్తూ
ఆ శబ్దంలోనే నాకు మరో సరికొత్త ఉదయం
కళ్ళ ముందు..!!
-నాంపల్లి సుజాత
- Tags
- Poem






