స్వయంభువు

by Ravi |   (  Updated:2025-12-15 00:45:32  IST  )

Poem

స్వయంభువు
X

నీ జన్మకు కారణమైనవాడే

నీ తలరాతను నిర్ణయిస్తాడంటారు

ఒకవేళ దేవుడుగా

పిలవబడే అటువంటివాడే

లేకపోతే నీ తలరాతకు

ఎవరిని బాధ్యుడుని చేస్తావు?

దేవుడు ఉన్నాడా లేడా

అని వాదులాడుకుంటూ

మరణించారు వారంతా

ఆ యుగయుగాల

వ్యాజ్యాన్ని పక్కన పెట్టు

నువ్వున్న ఈ కలను నువ్వే

సృష్టించుకున్నావా లేక

ఈ కలే నిన్ను సృష్టించిందా

అనేది ఎన్నటికీ

నీకు తెలిసే అవకాశం లేదు

కలోజియంలో

'మ్యునెరా' జీవన్మృత్యు క్రీడలో

మ్యాక్సిమస్ డెసిమస్ మెరిడియస్ లా

నువ్వు జీవితంతో పోరాడుతున్నప్పుడు

నీ ఎరుకని ఖడ్గంపై మాత్రమే ఉంచు

కాదు కాదు.. చాలనంపైనే ఉంచు

కరతాళ ధ్వనులు

పరాజయపు హేళనలూ

పగలూ ద్వేషాలూ అవమానాలూ

నిందలూ వంచనలూ అన్నీ

ఖడ్గ చాలనంలో

ఒక్కటిగా కలిసిపోనీ

నీవొక గమనంగా

నీవొక పూర్ణ శక్తి వ్యక్తీకరణగా

నీవొక చలనంగా

నీ ఖడ్గం కదులుతున్నప్పుడు

ఈ ప్రపంచం నీ ప్రత్యర్థులు

ప్రేక్షకులు అదృశ్యమైనప్పుడు

నీవు ఒక్క.. ఒకేఒక్క

ఈ క్షణంగా మిగిలినప్పుడు

నీవే దేవుడవు.. నీవే స్వయంభువు

- శ్రీరామ్

85198 63664

Next Story