వసంతాలు వెలుగులు ఆగవు

by Ravi |   (  Updated:2025-12-01 01:03:30  IST  )

Poem

వసంతాలు వెలుగులు ఆగవు
X

పూలు రాలుతుంటాయి

రాలిన పూల విత్తనాలు

కొత్తగా మొలకలెత్తుతూనే ఉంటాయి

చెట్లను నరికినంత మాత్రాన

అడవేమీ వట్టిపోదు

వసంతం అసలే ఆగిపోదు

ప్రకృతి నియమాన్ని, కాలధర్మాన్ని

కాలరాసేంత శక్తి నియంత

మనిషి నీకింకా రాలేదు

రాదు కూడా...

కెరటాలు కెరటాలుగా అలలు

తీరం ఆవలి రహస్యాలని

మూటగట్టుకొస్తాయి

తీరం అంచున నిలపడి మేము

మాలోకి వాటిని ఇంకించుకుంటాము

రహస్యమేమీ నీ కంటపడక,

నీ చెవికైనా వినపడక

నీవు గింజుకుంటుంటావు

అప్పుడు నీ అవస్థను చూసి

వెన్నెల పక్కున నవ్వి విరగకాస్తుంది

ఆ వేళ ఎగిసిపడే ఆటుపోట్లను

అడ్డుకోగల ఉపాయమేదీలేక

తప్పక నీవు వెనుదిరుగుతావు

అడవుల్ని సోదా చేసినంత

అలుకన కాదు

అలల్ని జల్లడపట్టడం అంటే

ఎదిగేటి మొక్కల్ని

అడ్డుకోగలవేమో కానీ

ఎగిసేటి అలలని కాదు

వనాల మీదుగా నడిచొచ్చే వసంతాలకు

రాలిన విత్తులే రహదారులు పరుస్తాయి

వనాల నరుకగలవేమో కానీ

వసంతాల కాదు

కిరణాలు కిరణాలుగా వెలుగులు

నిత్యం ఈ నేలకు కావలుంటాయి

పడమరకు సూర్యుడూ కుంగేటప్పుడు

వెన్నెలా తారలు బదులుగా కాపలుంటాయి

చీకటీ...

వెలుగు వాలని చోటే నీది కానీ

వెలుగులను మింగెంత శక్తి లేదు నీకు

వెలుగుల్ని బంధించిన ప్రతిచోట

అవి వెలుగుల్నే విరజిమ్ముతాయి కానీ

చీకట్లను కాదు...

వసంతాలను వెంట తోలుకొచ్చే

తూరుపు ముందూ

మేమెప్పుడూ వేచిచూస్తూనే ఉంటాం

ఆ తూరుపు కనుమల మీదుగా వచ్చే

వెచ్చటి ఆ కిరణాలనీ

మా కౌగిట్లోకి ఆహ్వానించడానికి.

దిలీప్.వి

84640 30808

Next Story