అది శతాబ్దాల నొప్పి

by Ravi |   (  Updated:2025-11-24 00:15:32  IST  )

Poem

అది శతాబ్దాల నొప్పి
X

వేల ఏళ్ల ప్రతిఘటనకి

పుట్టిన ప్రతిధ్వని

కంచెల మీద నడిచిన

జాతుల పాదాలు

బూడిదైపోయిన గూడాల కేకలు

భూమ్మీదే ఆకాశం కాబోయే

అధ్యాయాల ఆరంభం

అక్కడే అతడు ఒక ఊపిరి

మట్టి వాసనలో రాసుకున్న చరిత్ర

గొర్రెల బారెల్లలో పుట్టిన గీత

అరణ్య ప్రజల సంస్కృతి

అగ్ని దుఃఖించినప్పుడే

ఒక యోధుడిని వెలిగిస్తుంది.

అతడిది

లొంగని పుట్టుక

వంగని నడక

మరవని పోరాటం

అతడు అలాంటి ఒక్క లేఖ

రక్తంతో రాసినా

మనిషి గౌరవానికే పంపిన ఉత్తరం

నువ్వు ఆయుధం కాదు

అయుధం అవసరమయ్యే

సమాజం చేసిన ప్రశ్న

నువ్వు వ్యక్తి కాదు

వ్యక్తుల్ని మింగే వ్యవస్థకు

ఎదురు నిలిచిన శ్వాస

చెట్ల మీద గాలి కదిలినంత

సహజం పోరాటం

రాత్రి గుడారాల్లో పంచిన

అర్ధరొట్టెలంత నిజం

శబ్దం

శబ్దం ఆపే నిశ్శబ్దానికి

ఎదురు నిలిచే చీలిక నువు

పశువుల బాటలో నడిచే గిరిజన బిడ్డలు

కర్రలతో రాసుకున్న స్వాభిమానం

వానల్లో తడిచిన గుట్టల మీద

అవమానాల బూడిదని ఊదేసే ప్రజలు

వాళ్లంతా నీలోనే ఉన్నారు.

నీకు మరణం లేదు అని కాదు

నీ మరణానికి ముందు

ఈ దేశం బ్రతకాలి

మరణం నీకు ఎప్పటికీ అందదు

నీ పేరు పిలిచే ప్రతి గొంతు

కొత్తగా పుడుతుంది.

అదే లయలో అగ్నిని మోసే

ఒక కవి సాక్షిగా

- మెర్సీ మార్గరెట్

90528 09952

Next Story