- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

గాజాలో లెక్కలేనన్ని స్మశానాలు
ప్రతి మూలమలుపు ఒక మూగ సాక్షి
ప్రతి వీధి ఒక విస్తరించిన స్మశానం
ప్రతి ఇల్లు సజీవ జ్ఞాపకాల శవ పేటిక.
తోటల్లో, ఇండ్లల్లో, ఆలివ్ చెట్లకింద
ఎక్కడబడితే అక్కడ
మా ఆత్మీయులని పాతిపెట్టాం
మా బాధలను పూడ్చడానికి
ఈ భూమి చాలదు
గాజా సమాధులు
గట్టిగా అరవవు
గాయాల్ని గొణుగుతాయి
రోజూ పూడ్చిపెట్టబడే
మాతృభూమి గాథల గూర్చి
వీడ్కోలు చెప్పని
అంతిమ యాత్రల గూర్చి
సన్నగా గొణుగుతుంటాయి.
బతికిన రోజులూ ఉన్నాయి
ప్రేమాస్పద పలకరింపులు ఉండేవి
నవ్వులు గాల్లో నాట్యమాడేవి
పువ్వులా వికసించిన జీవితం
నేడు రక్తమోడుతోంది.
నేనేమో కృంగిపోయిన చోట
లంగరిడిసిన నా
సోదరుడిని కోల్పోయాను
ఒక వీడ్కోలు లేదు.
నుదుటి మీద ముద్దూలేదు
పొద్దుట జారిన మంచు బిందువులా
నన్ను ఈ తుఫాను కౌగిలికి వదిలి
అతడెల్లిపోయాడు
ఓ గాజా.. ఇంత భీభత్సంలో
ఇంత సహనమెక్కడిది
ఇంత మరణ వేదన మోస్తూ
తలెత్తుకు ఎలా నిలబడ్డావు
అంతులేని మరణాలకు
ఆకాశమే సాక్షి
స్మశానాలు రక్త మోడుతున్నాయ్
తమ గాథల్ని చెప్పడానికి
సిద్ధపడుతున్నాయి
ఛిద్రమైనా చావులేని జాతి గూర్చి
ఊరు పేరు లేని అమరుల గూర్చి
సాక్ష్యం లేని స్మశానాల గూర్చి
అక్షరాలు విప్పని విషాదాల గూర్చి
చెప్పడానికి సిద్ధపడుతున్నాయి
ఏ వీడ్కోలు లేకుంటేనేం
మేము రాస్తూనే ఉంటాం
మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాం
మూలం: Shaimaa qanoona
అనువాదం: ఉదయమిత్ర
89196 50545
- Tags
- Poem






