అంధకారంలో ఆశలు

by Ravi |   (  Updated:2025-10-13 00:30:25  IST  )

Poem

అంధకారంలో ఆశలు
X

సూర్యుడు ఉదయిస్తే చాలు,

నా రోజు చీకటి మొదలు

చిన్న పనులే నాకు,

పర్వతమైన బాధల జ్వాల

శరీరం సహకరించదు,

కానీ మనసు ఎగసే

వికలాంగ జీవనం,

ఓ మౌనంలో మెరిసే గీతమా

నువ్వు వైకల్యమా? వెటకారమా?

దివ్యాంగ జీవనమా?

ఒక పుట్టుక కన్నవాళ్లకు శోకమా

జీవితమంతా ఒంటరి శోకమా

చుట్టూ ఉన్న చేతుల

వెకిలి వెటకారమా

వీధి దీపాల నా నీడ

వెక్కిరించే వెటకారమా

బడికి పోయే దారిలో

నడవలేనీ నరకయాతన

నడక అస్తవ్యస్తమా

శునకాల అరుపుల భయమా

పాదరక్షాలు ఇమడలేని పాదాలకు

తారు రోడ్ల జ్వాలల నరకయాతన

రాళ్లు రప్పల బాటలు రక్తంతో

రంగరించే యాతన

నువ్వు వైకల్యమా?వెటకారమా?

దివ్యాంగ జీవనమా?

చదువు కోసం పట్నం పోయి

పడరాని కష్టమే యాతన

ఒక చిన్న అడుగు,

నాకు పర్వత శిఖరమా

మనసు నిండా మథనలు

శరీరం ఆపసోపాలతో

పాఠం అర్థం కాకపోయే!

మనోవేదనతో ఒంటరితనమే బందువాయే!

ఎన్నో ధిక్కారాలు ఎన్నో దూషణలు

ఎన్నో వెటకారాలు

మరెన్నో హేళనల నీలి నీడలే

నిన్న –నేడు– రేపు

-షేక్ జమీర్ పాషా

94931 23678

Next Story