- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

నా పుస్తకాల బీరువాలోని అద్దాల
తలుపులలోనుంచి కొన్ని పుస్తకాలు
నా వంక కోపంగా చూస్తాయి
ఇచ్చిన మాట ఎప్పుడూ నిలుపుకోవా అని
కొన్ని పుస్తకాలు నా వంక జాలిగా చూస్తాయి
చదవాలనే ఆశే కాని తీర్చుకునే తీరికేది అని!
కొన్ని పుస్తకాలు నాకెంతో ఇష్టమైనవి
నేను ప్రేమించినవి, నేను చదవటం వల్ల
నన్ను ప్రేమించినవి, మళ్ళీ నీ చేతిలోకి
మమ్మల్ని తీసుకుని మళ్ళీ చదవవా
అని ప్రేమగా పలకరిస్తాయి
రోజూ అనుకుంటాను మర్నాటి నుంచి
కొన్ని నిముషాలైనా పుస్తకం చదవాలని!
కాని, ఆ మర్నాడు
మర్నాడు గానే మిగిలిపోతుందేమో!
తెల్లవారింది మొదలు ఇంటెడు పని చేస్తాను
ఇంటిల్లిపాదికి కావాలసినవన్నీ అందిస్తాను
క్షణం తీరిక లేకుండా
మరబొమ్మ లాగా ఇల్లంతా
తిరుగుతూనే ఉంటాను
కాని చేరువలో ఉన్న పుస్తకాన్ని
అందిపుచ్చుకోలేను
నేను వాయిదా వేయగలిగింది అదొక్కటే!
ఋతువులు మారిపోతున్నాయి
సంవత్సరాలు దొర్లిపోతున్నాయి
దోసిట్లో నీరులా రోజులు
తెలియకుండా వెళ్లిపోతున్నాయి
కళ్ళజోడు వచ్చేసింది
అడుగులు తడబడుతున్నాయి
అయినా బాధ్యతల చట్రంలో
బందీగానే మిగిలిపోయాను
ఇంకా నా పుస్తకాల బీరువాలోని పుస్తకాలు
అద్దాల తలుపులలో నించి
నా చేతులలో ఇమిడిపోవాలని
ఆశగా, ప్రేమగా, జాలిగా
నా వంక చూస్తూనే ఉన్నాయి
నేను వాగ్దానం చేశాను
ఇవాళ నుంచే.. కాదు కాదు ఇప్పటి నుంచే
బంధనాలను బద్ధలుకొట్టి
పుస్తకాలు చదవటం మొదలుపెడతానని!
-డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి
63027 38678
- Tags
- Poem






