ఇదేనా వైవాహిక బంధమంటే?

by Ravi |   (  Updated:2025-09-15 00:30:14  IST  )

Poem

ఇదేనా వైవాహిక బంధమంటే?
X

హింస, మోసం...

చంపడం, చావడం...

ఇదేనా కలిసుండడమంటే.

పెళ్లంటే ఇద్దరు వ్యక్తులు

కలిసి జీవించే లైసెన్సా?

జీవితం నిత్యం

ముళ్ల మీద నడకలా మారినా

సహజీవనం తప్పనిసరా..?

నిరంతరం నా మదిని తొలిచే ప్రశ్నలివి.

కాదు...

సహజీవనపు అర్థం అవగతమవ్వక

నేటి పెళ్లిళ్లు పెటాకులై ...

వివాహ వ్యవస్థ విచ్చిన్నమవుతుంది.

అంబుధిని అల్లుకున్న నదిలా

కొత్త పాతల కలయికలా

భిన్న వ్యక్తిత్వాలు ఒక్కటవ్వడమే పెళ్లంటే.

'నేను'ను నిలుపుకొని ...

'మనం' అనే భావనతో సాగడమే

సాహచర్యపు పరమార్థం.

ప్రేమలోనూ...

పరస్పర గౌరవంలోనూ ...

ఆశయ సాధనలోనూ తోడు నిలబడటం

ఆలుమగల బంధానికి అసలైన అర్థం.

హక్కులు, అధికారాలు

ఎక్కువ, తక్కువలు

అనుమానాలు, అవమానాలు

బంధానికి బంధిఖానాలని మర్చిపోతున్నారు.

ముందూ వెనకలు, హెచ్చుతగ్గులుండని

పరస్పర ఆధారితాలై...

ద్వితీయానికి తావులేని

అద్వితీయ బంధం ఆలుమగలది.

డా. ఆవుల రేణుక

9398268976

Next Story