ప్రవాస గాయం.. కూలి ట్యూడ్..!

by Ravi |   (  Updated:2025-09-15 01:15:53  IST  )

Poem

ప్రవాస గాయం.. కూలి ట్యూడ్..!
X

సముద్రం మీద నురగలా ప్రతీ శరీరం

అలలమీద మేల్కొంటుంది

మేము బెల్లం మడ్డి, చెరకు పిప్పి

మా ఆఫ్రికా సోదరులు,

బానిసలనుండి అవతరించారు

వారిలానే మా చర్మమే మా ఆనవాలు

వారిలా ఒకటే నల్లని సంతతి

అలలు మోసగించకముందు

సముద్రాన్ని స్పృశించాను

నా కలని మోసుకెళ్లమని

ఉప్పు దాని కళ్లు

తెరవకముందే అన్నీ చూశాను

నా ఆత్మని తీసుకెళ్తున్నా

మరణాన్ని కలుసుకున్నా

న్నడూ మళ్లీ మరణించలేదు

నేను సముద్ర చుక్కానికి

చిక్కుకున్న మానవ పుప్పొడిని

నిజానికి నేను తాజా మాంసాన్ని

మాంసంతో సమృద్ధిగా,

పుష్టిగా ఉన్న కండని

కూలీ అంటే

మెడకు ఉచ్చు వేలాడుతున్న వాడిని

కలాసుని, మలబారుని,

మదరాసు దుకాణాల చింతపండుని

నీకోసం బయటపెట్టే తెలుగుని

క్రూరమైన మరాఠీ తల్లిని లేదా చర్మకారుడ్ని

ఏదైనా నీకు నచ్చిన, నల్లని ఇండియన్‌‌ని

ప్రతీ మానవ గాయం నా సొంత కథ

ప్రతీ మానవ సంఘర్షణ, నా నిజమైన నమ్మకం

మనుషుల రక్తాన్ని

ఏ వ్యాకరణమూ వ్యక్త పర్చలేదు

నాకంటే నా చర్మం ఎక్కువగా పాడుతుంది

సముద్రంలో అంతర్లిఖితంగా పేరున్న

దేశంలో నేను అందుకే పుట్టాను

నా స్వరం కంటే నా చర్మం

త్వరగా మాటాడుతుంది

అది నా యదార్థం

ప్రతి కొత్త ప్రారంభం

మాకొక ప్రవాసమే...

మారిషస్ మూలం: ఖాల్ తోరాబుల్లీ,

అనువాదం: ముకుంద రామారావు

99083 47273

Next Story