న్యూటన్‌ను తిరిగేసిన పద్యం

by Ravi |   (  Updated:2025-08-03 23:30:52  IST  )

Poem

న్యూటన్‌ను తిరిగేసిన పద్యం
X


ఎప్పుడూ లేనిది

మా మనమరాలు

ఈసారి తన పుట్టినరోజు

కవిత రాయమని కోరింది

బాల్యంలో మా గుండెలను

పచ్చని లేలేత తీగలా అల్లుకున్న

ఆమె ప్రతి జన్మదినం రోజున

ఉదయంలా మా హృదయాల మీద

నడిచిన చిగురు పాద ముద్రల నుంచి

కవిత్వ పదాలను చరణ కిరణాలను

ఒక్కటొక్కటిగా ఏరుకుని

కేవలం కవితను బహుమతిగా

ఒక విరిసిన పువ్వున్నై అర్పించేవాడిని

చిన్నప్పుడు మాటలు ఆటలు నేర్పి

చింతకాయ తొక్కు మంచినూనె కలిపి

వాడ వాడంతా తిప్పుకుంటూ

అన్నం ముద్దలు తినిపించిన నన్ను

మా అమ్మ "మీ పిల్లలకన్నా తినిపించలేదు

కానీ మనవరాలుకు మాత్రం

ఏమి తిరుగుకుంటూ తినిపిస్తున్నావురా "

ముసి ముసిగా నవ్వుకుంటూ మందలించేది

ఆపిల్ చెట్టు నుంచి

పండు కింద పడితే

భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని

న్యూటన్ మహాశయుడు కనుగొన్నాడు

కోరిందని కాదు కానీ

మా మనవరాలు మాత్రం

ఇయ్యాళ్ల మిగుల పండిన మా గుండెల్ని

తన వైపు ముద్దు ముద్దుగా

న్యూటన్ సిద్ధాంతాన్ని

తలకిందులు చేస్తూ లాగేసుకుంటున్నది

- జూకంటి జగన్నాథం

94410 78095

Next Story