- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాడు కూలీలు, బిచ్చగాళ్ళు.. నేడు పాలకులయ్యారు
చాలా కాలం క్రితం, గయానా అనేది ఒక దేశం పేరు కాదు, ఒక భౌగోళిక నిర్మాణం. రెండు వందలకోట్ల సంవత్సరాల పురాతనమైంది.

నాడు కూలీలు, బిచ్చగాళ్ళు.. నేడు పాలకులయ్యారు
గయానా నుంచి గయానా - ఐదు యూరోపియన్ దేశాల ఐదు గయానాలు
చాలా కాలం క్రితం, గయానా అనేది ఒక దేశం పేరు కాదు, ఒక భౌగోళిక నిర్మాణం. రెండు వందలకోట్ల సంవత్సరాల పురాతనమైంది. దానిని "గయానా షీల్డ్ (కవచం)" అంటారు. కఠినమైన రాళ్లు, అడవులు, నదులు, ఉష్ణమండల పచ్చికబయళ్ళ విస్తీర్ణ ప్రాంతం అది. సహస్రాబ్దాలుగా కోతలు, మార్పునూ అది నిరోధించింది. ఆ మొండి ప్రకృతి దృశ్యమే, ఆ ప్రాంతాన్ని భౌగోళికంగా - సాంస్కృతికంగా - దక్షిణ అమెరికాలోని మిగిలిన ప్రాంతాల నుండి వేరుగా ఉంచింది. ఆ కవచపు ఎత్తైన ప్రదేశాన్ని "గయానా పీఠభూమి" అని పిలుచుకుంటారు. 9వ శతాబ్దం నుంచి, అరవాక్, కారిబ్ తెగలు ఆ పీఠభూమిలో స్థిరపడ్డారు. ప్రధానంగా వారు వేటగాళ్ళు, మత్స్యకారులు. గయానా అన్నది ఆ స్థానికుల పదం. అంటే “అనేక జలాల భూమి”. ఎందుకంటే ఆ ప్రాంతంలో, కనీసం 300 జలపాతాలు, అనేక నదులు, వాగులూ ఉన్నాయి. విస్తారమైన వర్షారణ్యాలతో అలరారుతూ ఉంటుంది.
గయానాను ముక్కచెక్కలు చేసిన యూరప్
క్రిస్టోఫర్ కొలంబస్ తన మూడవ సముద్రయానంలో మొదటిసారిగా 1498లో గయానా తీరాన్ని గుర్తించాడు. "వైల్డ్ కోస్ట్ (కఠినమైన అరణ్య ప్రాంతం)"గా పిలువబడే ఆ అన్వేషణ పట్ల అతను ఆసక్తి చూపించలేదు. గయానా మీద మొదటిసారిగా దృష్టి సారించింది, 1499లో స్పానిష్ వారే. కఠినతరమైన అరణ్య ప్రాంతంగా పిలువబడే గయానా అన్వేషణ పట్ల, నిజమైన ఆసక్తి పదహారవ శతాబ్దం చివరి వరకూ ప్రారంభం కాలేదు. 15వ శతాబ్దం తర్వాత కొత్త మార్గాల అన్వేషణలో, గయానా మీద రెండు ప్రధాన యూరప్ శక్తులు, స్పెయిన్, పోర్చుగల్ సైన్యాలు ఒకదాని తర్వాత ఒకటి దాడి చేసుకొని, గయానా పీఠభూమిని, పశ్చిమ, తూర్పు భాగాలుగా విభజించుకొని, తొలి రాజకీయ భూభాగాలుగా "స్పానిష్ గయానా", "పోర్చుగీస్ గయానా" లుగా మార్చాయి. ఆ అరణ్య ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కష్టాలమయం కావడంతో, ప్రారంభ స్పానిష్, పోర్చుగీస్ స్థావరాలు ఎక్కువ కాలం అక్కడ మనుగడ సాగించలేక పోయాయి. డచ్ వారు మాత్రం, డచ్ వెస్ట్ ఇండియా కంపెనీ మద్దతుతో విజయవంతమయి, మొదటి శాశ్వత కాలనీను అక్కడస్థాపించగలిగారు. 17వ శతాబ్దంలో గయానా అలా డచ్ వారి మొట్టమొదటి వలసరాజ్యం అయింది. అందులో సారవంతమైన భూములు, చెరకు తోటల విస్తరణకు అపారమైన ఆస్కారం ఉండటంతో, వారితో పాటు తోటల వ్యవస్థను కూడా తీసుకువచ్చారు. ఆ తోటల్లో పనిచేయడానికి, ఆఫ్రికన్లను బానిసలుగా చేసుకున్నారు.
పంచ గయానాలు
అది బ్రిటన్, డచ్, పోర్చుగల్, స్పెయిన్ దేశాల మధ్య అనేక యుద్ధాలకు దారి తీసింది. బ్రిటిష్ ఆక్రమించిన ప్రాంతం బ్రిటిష్ గయానా అయింది. ఫ్రాన్స్ కూడా చేరి, ఆ పీఠభూమిలో కొంత భాగాన్ని 1604లో ఆక్రమించి, అధికారికంగా ఆ ప్రాంతం మీద పాలన సాగించి, ఆ ప్రాంతాన్ని ఫ్రెంచ్ గయానాగా చేసుకుంది. అప్పటి నుంచి, గయానా పీఠభూమి, బ్రిటిష్ గయానా, ఫ్రెంచ్ గయానా, డచ్ గయానా, స్పానిష్ గయానా, పోర్చుగీస్ గయానాలుగా ఐదు గయానాలయాయి. గయానా పీఠభూమిలో ఆ ఐదు యూరోపియన్ దేశాల, పరిపాలన, అనుబంధాలు విభిన్నం.
స్పానిష్ గయానాను స్పానిష్ వైస్రాయల్టీ ఆఫ్ గ్రెనడా పరిపాలించాడు. పోర్చుగీస్ గయానాను బ్రెజిల్ పరిపాలించింది. బ్రిటిష్, డచ్, ఫ్రెంచ్ గయానాలుగా చేసుకున్న వాటిని బ్రిటన్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ నేరుగా పరిపాలించాయి. ఈ విభిన్న పరిపాలనా నిర్వహణలు, ఐదు గయానాలలో చాలా భిన్నమైన అభివృద్ధి ధోరణులకు దారితీసాయి. స్పానిష్ పోర్చుగీస్ గయానాలు మాత్రం అక్కడ బ్రిటిష్, డచ్ వారి శక్తులకు తలవంచి, వారి ప్రాంతాలు బ్రిటిష్ కు వదులుకోవడంతో, ఆ పీఠభూమి బ్రిటిష్ గయానా, డచ్ గయానా, ఫ్రెంచ్ గయానాలుగా స్థిర పడ్డాయి. ఆ ప్రాంతాలు, ఆ మూడు సామ్రాజ్యాల మధ్య యుద్ధాలలో, 17-18వ శతాబ్దాల కాలంలో కొన్ని ప్రాంతాలలో నిరంతరం చేతులు మారుతూ ఉండేవి. 1814లో వారంతా చేసుకున్న లండన్ ఒప్పందం, వారి మధ్య ప్రాదేశిక సరిహద్దులను అధికారికం చేసి, వారి మధ్య వైరుధ్యాల్ని ముగించుకున్నాయి.
బానిసల తర్వాత భారతీయ ఒప్పంద కూలీలు
వేర్వేరు కాలనీలను స్థాపించాక, యూరోపియన్లు అక్కడే స్థిరపడి, చెరకు తోటలను, త్వరలోనే కాఫీ, పత్తి, కోకోను కూడా ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. వాటి కోసం ఆఫ్రికా బానిసలను అన్నివిధాలా వాడుకున్నారు. 1834లో బానిసత్వం రద్దయాక, బ్రిటిష్ గయానా బానిసలందరూ 1 ఆగష్టు 1834న విముక్తి పొందారు. బానిసల తోడ్పాటు లేక, తోటల యజమానులు సంక్షోభంలో పడ్డారు. బానిసలు చేసిన పనుల కోసం, కరువులు కష్టాల బారిన పడిన భారతదేశాన్ని అనువుగా భావించి, లేనిపోని భ్రమలు కల్పించి మోసపూరితంగానే, ఆ మూడు గయానాలు కలిపి దాదాపు మూడు లక్షల మంది భారతీయులను, ఐదు సంవత్సరాలు స్వచ్ఛందంగా పనిచేయడానికి అంగీకరించిన ఒప్పంద కార్మికులుగా, ఒప్పంద పత్రం మీద సంతకం చేయించుకొని మరీ తీసుకుపోయాయి.
బ్రిటిష్ గయానా విషయంలో అక్కడ చక్కెర ఎస్టేట్‌ల యజమాని, ప్రసిద్ధ బ్రిటిష్ లిబరల్ రాజనీతిజ్ఞుని తండ్రి జాన్ గ్లాడ్‌స్టోన్, ఇతర తోటల యజమానులతో కలిసి భారతదేశం నుంచి, మొదట్లో 414 మంది కార్మికులు అవసరమని ఒప్పించి, ఎస్టేట్‌లో పని చేయడానికి ఒప్పంద భారతీయుల్ని, 5 మే 1838న అక్కడికి తీసుకుపోగలిగాడు. భారతదేశంలో కూడా అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వమే కాబట్టి ఆపని వారికి ఇబ్బంది లేకుండా జరిగిపోయింది. 1838 నుంచి అక్కడ "గ్లాడ్‌స్టోన్ ప్రయోగం" కింద భారతీయుల దిగుమతి అలా మొదలయింది. ఒప్పంద కార్మికులుగా పంపిన వారిని అక్కడ గ్లాడ్‌స్టోన్ కూలీలన్నారు. అందులోని కార్మికులు హజారీబాగ్, బాంకుడా, రామ్‌ఘర్, మిడ్నాపూర్, నాగ్‌పూర్ నుంచి వెళ్లారు. వారందరినీ హెస్పెరస్, విట్బీ అన్న రెండు నౌకలలో కలకత్తా నుంచి ఒప్పంద కార్మికులుగా పంపారు. విట్బీ నౌక 13 జనవరి 1838న కలకత్తా నుంచి బయలుదేరి 5 మే 1838న, 112 రోజుల ప్రయాణం తరువాత గయానా చేరింది. అలాగే హెస్పెరస్ నౌక 29 జనవరి 1838న కలకత్తా నుంచి బయలుదేరి 5 మే 1838 రోజునే, 96 రోజుల ప్రయాణం తరువాత గయానా చేరుకుంది.
నౌకల్లో మన కార్మికుల తీరని కష్టాలు
భారతీయ కార్మికుల బృందం ఆ సుదీర్ఘ ప్రయాణాలను, తట్టుకోలేని కష్టాలను నౌకల్లో భరించింది. అందరినీ మొదట ప్లాంటేషన్ హైబరీకి కేటాయించారు. ఆ తరువాత ఏవిధమైన శిక్షణ, వాతావరణానికి తగినంత అలవాటైనా లేకుండా అనేక ఇతర ఎస్టేట్‌లకు కూడా వారిని పంపారు. ఒప్పంద కార్మికుల సమూహంలో పరిస్థితులు చాలా అమానవీయంగా దయనీయంగా తయారు కావడం మొదలయాయి. మహిళల మీద భయంకరమైన సంఖ్యలో దాడులు చేసి హత్యలు చేశారు. కఠినమైన పని పరిస్థితులు, అధిక మరణ రేటు, లింగ అసమతుల్యతలను ఎదుర్కొన్నారు. ఎస్టేట్ యజమానులు, వలస పోలీసులు పరిస్థితులను దుర్వినియోగపర్చడం గురించి నివేదికలు బ్రిటిష్ వారు అందుకున్నాక, ఐదు సంవత్సరాల పాటు ఒప్పంద వ్యవస్థని తాత్కాలికంగా నిలిపి వేశారు. 1853లో ఒప్పంద విధానం చట్టబద్ధం అయిన తర్వాత, ఒప్పంద కార్మికుల సరఫరా మొదలయి 1917లో ఆ వ్యవస్థ రద్దు చేయబడే వరకూ కొనసాగింది.
తిరిగిరాలేక అక్కడే ఉండిపోయారు
తోటలో తక్కువ వేతనాలు, పెరిగిన పనులకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు, ఒప్పంద కార్మికులు సామూహికంగా సమ్మె చేసి, ఫిర్యాదు చేయడానికి ప్రొటెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. ఇమ్మిగ్రేషన్ ఆర్డినెన్స్‌ల ప్రకారం ఆ హక్కు అనుమతించబడినా, వారు తిరిగి వచ్చినప్పుడు అల్లర్లు సృష్టించడానికి కుట్ర పన్నారనే నెపంతో నాయకులను పోలీసులు చుట్టుముట్టారు. వారి మీద 72 రౌండ్లు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో నలుగురు మరణించారు, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో ఒప్పంద కాలం మొత్తం 79 సంవత్సరాలు, 245 ఓడలు 534 సముద్రయానాలు చేసి భారతీయ ఒప్పంద కార్మికులను అక్కడకు చేర్చాయి. వారిలో ఎక్కువ మంది ఉత్తర భారతదేశం నుంచే ఉన్నారు. దక్షిణ భారతదేశంలోని తమిళ తెలుగు జిల్లాల నుండి కూడా చిన్న సమూహాలు చేరాయి.
ఉత్తరాది ఆర్కటీయా, దక్షిణాది మేస్త్రీల దోపిడీ
ఉత్తర భారతదేశంలో ఆర్కటీయా, దక్షిణ భారతదేశంలో మేస్త్రీ అని పిలువబడే దళారులతో, తరచుగా వారందరినీ నకిలీ వాగ్దానాల మీద నియమించుకున్నారు. వారి ద్వారానే ఆ నియామక వ్యవస్థ ప్రారంభం నుండి ముగింపు వరకు వెన్నెముకగా వారికి నిలిచింది. తిరిగి రావడానికి అనుకూలమైన పరిస్థితులు లేక, భారతదేశానికి ఎక్కువ మంది కార్మికులు తిరిగి రాలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అక్కడ ఇమడ లేక తిరిగిరాలేక, అక్కడి నుంచి పారిపోయిన వారిలో ఎక్కువ మంది దక్షిణ భారతదేశం నుంచి వెళ్లిన కార్మికులే. సంఖ్యాపరంగా అక్కడ మైనారిటీగా ఉన్న వారు. వారి జీవనశైలి ఉత్తర హిందూ భారతీయులకు చాలా భిన్నం. అలా అదృశ్యమైన భారతీయులలో చాలామంది పట్టణ ప్రాంతాలలో, ముఖ్యంగా బ్రిటిష్ గయానాలోని జార్జ్‌టౌన్‌లోని బౌర్డా మార్కెట్‌లో బిచ్చగాళ్ళుగా మారారు. వారి కొత్త నివాసాలలో, ఎక్కువమంది అనారోగ్యాలకు గురయారు.
డచ్ గయానాలోనూ మనవాళ్లే..
ఇక డఛ్ గయానా విషయానికొస్తే, జూలై 1, 1863న నెదర్లాండ్స్ బానిసత్వాన్ని రద్దు చేయడంతో, డచ్ కాలనీ అయిన సురినామ్‌లోని తోటలన్నీ భారీ కార్మిక కొరతను ఎదుర్కొన్నాయి. తత్ఫలితంగా, ఆ కొరతను భర్తీ చేయడానికి డచ్ వలసవాదులు సామ్రాజ్య బ్రిటన్‌ను ఆశ్రయించారు. దక్షిణ అమెరికా ఉత్తర తీరంలో ఉన్న సురినామ్‌లో చక్కెర, అరటి తోటల పెంపకం కోసం డచ్ ప్రభుత్వానికి, కార్మికులు కావలసి వచ్చింది. కరేబియన్, పసిఫిక్ కాలనీలలో తోటలలో పని చేయడానికి భారతదేశం నుంచి ఒప్పంద కార్మికులను నియమించుకున్న బ్రిటిష్ సహచరుల మారిషస్ నాయకత్వాన్ని అనుసరించి, డచ్ ప్రభుత్వం బ్రిటిష్ వారితో ఒప్పందం కుదుర్చుకుంది. సెప్టెంబరు 8, 1870న, నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, డచ్ వారు తమ సురినామ్ తోటలలో పని చేయడానికి భారతీయ ఒప్పంద కార్మికులను నియమించుకునేలా చేసుకోగలిగింది. ఫిబ్రవరి 17, 1872 న డచ్, బ్రిటిష్ వారి మధ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన ఒక సంవత్సరం తరువాతనే, 1873 నుంచి డచ్ గయానాకు సురినామ్ అని పేరు పెట్టుకున్నారు.
సురినామ్ రాముడి పవిత్రభూమి అట
ఎక్కడ ఏ ప్రమాదాలున్నాయో తెలియనప్పటికీ, ఒప్పంద కార్మికులుగా మారడానికి, వేలాది మంది సురినామ్‌కు అప్పట్లో వెళ్లడానికి కారణం, 19వ శతాబ్దంలో అవధ్, పశ్చిమ బీహార్ గంగా పరీవాహక ప్రాంతాలలో తీవ్రమైన కరువు కారణంగా ఏర్పడిన భయంకర పేదరికం, లేమి. ఆకలితో ఉన్న కుటుంబాలు మరణం, ఆకలి నుండి తప్పించుకుందుకు ఒప్పంద కార్మికులుగా మారటమే మార్గమని భావించారు. దానికితోడు మోసం కూడా దాని పాత్ర పోషించింది. స్థానిక భాషలో ఆర్కటీయాలని పిలువబడే దళారులు, ప్రజలను సురినామ్‌కు అనేకవిధాలుగా ఒప్పించగలిగారు. సురినామ్‌ను రాముడి పవిత్ర దేశంగా వర్ణించడం ద్వారా అక్కడికి వెళ్లడం ఒక తీర్థయాత్రగా చిత్రీకరించారు. మతపరమైన ఎరతో పాటు, తినడానికి బంగారం గిన్నెలు, తాగడానికి బంగారం చెంబులు వాడే సంపన్న దేశంగా కూడా వారు దానిని అభివర్ణించారు. వారిని మరింత ఒప్పించడానికి, అక్కడ నుండి తిరిగి వచ్చాక భూస్వాముల్లా జీవించే సంపన్నుల కథలను వారితో పంచుకున్నారు. వారిలో విశ్వాసాన్ని పెంపొందించడానికి బ్రిటిష్ ప్రభుత్వ రక్షణ అన్నది మరొక ముఖ్యాంశంగా వాడుకున్నారు.
కార్మికుల మధ్య అపూర్వ ఐక్యత
లల్లా రూఖ్ అనే మొదటి భారతీయ ఓడ, ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్ లకు చెందిన 410 మందితో కలకత్తాలోని సురినామ్ ఘాట్ నుంచి ఫిబ్రవరి 26, 1873న సురినామ్‌కు బయలుదేరింది. మూడు నెలల ప్రయాణం తర్వాత 1873 జూన్ 5న, సురినామ్ రాజధాని పారామరిబోకు చేరుకుంది. 410 మంది ప్రయాణికులలో 399 మంది మాత్రమే సజీవంగా అక్కడికి చేరున్నారు, మిగిలిన 11 మంది సముద్ర ప్రయాణంలో మరణించారు. ఓడల్లో స్థల పరిమితి, కఠినమైన వాతావరణ పరిస్థితులు, ఓడల్లో కార్మికుల మధ్య ఐక్యతను ఏర్పరచాయి. భక్తులైన హిందువులు, ముస్లింలు సైతం రోజువారీ ప్రార్థనలు, ఆచారాలను వదులుకోవలసి వచ్చింది. అందుబాటులో ఉన్నవే తినవలసి వచ్చింది, అది కూడా కలిసి. ఇవన్నీ మానవ నిర్మిత అడ్డంకులను తొలగించాయి. అది వారు సురక్షితంగా దిగిన తర్వాత కూడా కొనసాగింది!
సురినామ్‌లో మన పండుగలు
తరువాతి సంవత్సరాల్లో, మరో 63 ఓడలు సురినామ్‌కు వెళ్లాయి. చివరిది 1916లో ఒప్పంద కార్మిక వ్యవస్థ ముగింపు దశకు చేరుకున్నప్పుడు చేరింది. ఒప్పంద సమయంలో మరణించిన వారి సంఖ్య చాలా ఎక్కువ 34,304 మందిలో 5,500 – దాదాపుగా 16%. మొత్తం 34,304 మంది భారతీయ ఒప్పంద కార్మికులు సురినామ్‌ను తమ కొత్త నివాసంగా చేసుకున్నారు. 1873-1912ల మధ్య 9,000 మంది వరకూ కార్మికులు తిరిగి వచ్చారు. వారి పని కాలంలో తోట యజమానుల నుంచి దోపిడీని ఎదుర్కొన్నప్పటికీ, ఈ కార్మికులు సురినామ్ సమాజంలో గణనీయమైన పాత్ర పోషించారు. ఆ దేశాన్ని తీర్చిదిద్ది తమకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకోవడమే కాకుండా దేశ సంస్కృతిలో భాగంగా దీపావళి, ఈద్ వంటి పండుగలను కూడా ప్రవేశపెట్టారు.
కులం అడ్డొస్తుందనే తిరిగి రాలేదు
ఒప్పందం ముగిసిన తర్వాత, భారతీయ కార్మికులలో మూడింట రెండొంతుల మంది సురినామ్ లోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. జీవితం కష్టంగా ఉన్నప్పటికీ, బ్రిటిష్ ఇండియాలో ఉన్నదాని కంటే సురినామ్ మెరుగు అనిపించి, అక్కడే ఉండేలా వారిని ప్రోత్సహించింది. ఆసక్తికరంగా, రక్షణతో పాటు, ఈ ప్రజలు డచ్ వారి నుండి కొంత భూమిని కూడా పొందారు. కుల మత విభజన గొలుసులు తెగిపోయాయనే వాస్తవం ఒక ప్రధాన కారకంగా పనిచేసింది. చాలా మంది కార్మికులు తక్కువ కులాల నుండి వచ్చినందున, తిరిగి వచ్చినప్పుడు వారు పురాతన కాలం నాటి కఠినమైన ఆంక్షలకు లోనవుతారని కూడా వారు భావించారు. ఇప్పుడు సురినామ్ జనాభాలో 30 శాతం మంది భారతీయ సమాజానికి చెందినవారున్నారు. వారు క్రియోల్స్, సురినామీస్ మెరూన్లు, స్వదేశీ తెగలు, చైనీస్, జావానీస్ లతో కలిసి ఒక కుటుంబంలా ఉంటున్నారు. సురినామ్ ప్రస్తుత అధ్యక్షుడు చంద్రికాప్రసాద్ సంతోఖి ఆ పదవిని నిర్వహించిన రెండవ వ్యక్తి, మొదటి వ్యక్తి 1988 నుండి 1990 వరకు రామసేవక్ శంకర్. భారతదేశంతో తన సంబంధాలను పునరుద్ఘాటిస్తూ, సంతోఖి తన చేతుల్లో వేదాల కాపీలను పట్టుకుని సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేశారు.
మన చరిత్రకు నిశ్శబ్ద సాక్షి ఆ ఘాట్
హుగ్లీ నది ఒడ్డున సురినామ్ ఘాట్ పేరుతోనే, కోల్‌కతాలోని గార్డెన్ రీచ్‌లో ఉంది. ఫిబ్రవరి 26, 1873న, ఒప్పంద కార్మికులను తీసుకువెళ్లిన మొదటి ఓడ లల్లా రూఖ్, అక్కడి నుంచే సురినామ్‌కు బయలుదేరింది. 144 సంవత్సరాల తరువాత, అదే ఘాట్ వద్ద, పరాయినేలలో పని చేయడానికి ఏడు సముద్రాలు దాటి వెళ్లిన ఆ ఒప్పంద కార్మికుల ప్రయాణాన్ని స్మరిస్తూ, అక్కడ మాయి-బాప్ (అమ్మా-నాన్న) ల విగ్రహాలతో ఒక జ్ఞాపకచిహ్నం నెలకొల్పారు. సురినామ్ లో కూడా అటువంటి జ్ఞాపకచిహ్నాన్నే ఒప్పంద కార్మికుల వారసులు ఏర్పాటు చేసుకున్నారు. సురినామ్ ఘాట్ నుంచి చివరి ఓడ బయలుదేరిన దాదాపు ఒక శతాబ్దం తర్వాత, దాని చారిత్రక ప్రాముఖ్యత అలా గుర్తించబడింది. విగ్రహ పీఠం దగ్గర ఉన్న హిందీ, ఇంగ్లీష్, డచ్, భోజ్‌పురి భాషలలో రాసిన ఫలకాలు, ఆ వ్యక్తుల పోరాటాలు కష్టాలను స్మరించుకుంటున్నాయి. నేడు ఆ విగ్రహమూ, సురినామ్ ఘాట్, భారతీయ చరిత్రలో ముఖ్యమైన అధ్యాయానికి నిశ్శబ్ద సాక్షిగా ఉన్నాయి. సురినామ్, కరేబియన్, పసిఫిక్‌లోని ఇతర దేశాలలోని భారతీయ ప్రవాసులలో ఈ ప్రదేశం విస్తృతంగా గుర్తించబడినా, భారతదేశంలోనే అంతగా ప్రసిద్ధి కాలేదు.
ఫ్రెంచ్ గయానాలో తెలుగు, తమిళులు
ఫ్రెంచ్ గయానా విషయానికొస్తే, ఆత్యంత విచారకరంగా, బానిసత్వాన్ని రద్దు చేసే వరకూ, మొదటి బానిస సమాజం అక్కడే ఉండింది. 1848లో ఫ్రెంచ్ సామ్రాజ్యంలో బానిసత్వాన్ని రద్దు చేయడంతో, 1834లో బ్రిటిష్ కాలనీలు ఎదుర్కొన్న కార్మిక సమస్యలనే ఫ్రెంచ్ కాలనీలు కూడా ఎదుర్కొన్నాయి. కార్మిక సంక్షోభం ఏర్పడింది. ఫ్రెంచ్ తోట యజమానులు, మొదట్లో భారతీయ కార్మికులను నియమించుకోవడానికి ప్రయత్నించారు. బ్రిటిష్ అధికారులు 1860 వరకు భారతీయ కార్మికుల్ని పంపడానికి నిరాకరించారు. అంచాత వారు భారతదేశంలోని ఫ్రాన్స్ ప్రాంతమైన పాండిచ్చేరి నుంచి భారతీయ కార్మికులను నియమించుకుందుకు ప్రయత్నించారు. అదే కాలంలో, తూర్పు భారత సంతతికి చెందిన వలస కార్మికులు, పొరుగు దేశాలైన బ్రిటిష్ గయానా, సురినామ్, ట్రినిడాడ్ టొబాగో నుంచి కూడా చేరారు.
1862 ప్రారంభంలో, ఫ్రెంచ్ గయానాలోకి భారతీయ కార్మికుల ప్రవేశం అలా మొదలయింది. అయితే 1880ల మధ్య నాటికి, బ్రిటిష్ వారు తమ ఉపాధి కింద ఉన్న భారతీయ కార్మికుల పట్ల ఫ్రెంచ్ వారి నిర్దాక్షిణ్య వైఖరికి ప్రతిస్పందనగా భారతీయుల్ని అక్కడకు తీసుకుపోవడం ఆపేసారు. అయినా 1848-1917ల మధ్య కాలంలో ఫ్రెంచ్ గయానాకు 19,276 మంది భారతీయ వలసదారులు వెళ్లారు. తతిమా రెండు గయానాల కంటే సంఖ్యా పరంగా ఇక్కడ తక్కువగానే ఉన్నా, ఉన్న వారిలో తెలుగు, తమిళులే ఎక్కువ. వారంతా తోటల్లో పని చేయాల్సిన ఒప్పంద కార్మికులే అయినా, అటవీ అంతర్గత ప్రాంతంలో లోతైన బంగారు క్షేత్రాలలో కూడా పనిచేయించారు. ఇతర కరేబియన్ ద్వీపాల్లో కంటే భారతీయుల మరణాలు అత్యధికంగా ఉండేవి. ఇప్పుడు ఫ్రెంచ్ గయానాలోని భారతీయులు ఎక్కువగా ఫ్రెంచ్ గయానాలోని ఫ్రెంచ్ విదేశీ విభాగంలో పనిచేస్తున్న భారతదేశానికి చెందిన తమిళ ఒప్పంద కార్మికుల వారసులు. ఫ్రెంచ్ గయానాలో సుమారు 12,000 మంది భారతీయులు ఉన్నారు, ఇది జనాభాలో 1.6%.
క్రూరశిక్షలకు కాణాచి డెవిల్స్ ఐలాండ్
ఖైదీలను బహిష్కరించిన ప్రసిద్ధ ప్రదేశం డెవిల్స్ ఐలాండ్, ఫ్రెంచ్ గయానా తీరంలోనే ఉంది. 1852 నుంచి 1953 వరకు ఒక శతాబ్దం మొత్తం, ఫ్రెంచ్ ఖైదీలు ఫ్రెంచ్ గయానాలోనే బహిష్కరించబడ్డారు. మరింత ప్రత్యేకంగా చెప్పాలంటే, ఈ ప్రాంత తీరంలో ఉన్న ప్రసిద్ధ డెవిల్స్ ద్వీపం, మొత్తం ప్రపంచంలోనే అత్యంత క్రూరంగా శిక్షలు అమలుపరిచే కాలనీ! ఉష్ణమండల వాతావరణం, మండే ఎండలతో బాధపడుతూ కేవలం కడ్డీలతో కూడిన సెల్‌లో బంధించబడడంతో, ఖైదీలు చాలా కఠిన మైన జీవితం గడిపేవారు. అంచాత, ఫ్రెంచ్ గయానా "ఫ్రాన్స్ జైలు"గా కూడా ప్రసిద్ధి చెందింది. ప్రముఖ ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం, అక్కడి కౌరౌ సమీపంలోని అడవిలోనే ఉంది. ఒక పెద్ద యూరోపియన్ కేంద్రంగా, దీని నుంచి ప్రసిద్ధ ఏరియన్ రాకెట్ ప్రతిసారీ ప్రయోగించబడుతోంది. ఫ్రెంచ్ గయానా రాజధాని కయెన్ పేరు మీద కాయెన్ పెప్పర్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అధికారిక భాష ఫ్రెంచ్ అయినా, చాలా మంది నివాసితులు క్రియోల్ కూడా మాట్లాడతారు. ఫ్రెంచ్ గయానా యూరప్, లాటిన్ అమెరికా మధ్య వారధిగా పనిచేస్తూ, అంతర్జాతీయ సంబంధాలను ప్రభావితం చేస్తోంది.
బిచ్చగాళ్లుగా బతికారు తప్ప వెనక్కి రాలే...
ఒప్పంద కాలం మొత్తం 79 సంవత్సరాలు, 245 ఓడలు 534 సముద్రయానాలు చేసి భారతీయ ఒప్పంద కార్మికులను అక్కడకు చేర్చాయి. వారిలో ఎక్కువ మంది ఉత్తర భారతదేశం నుంచే ఉన్నారు. దక్షిణ భారతదేశంలోని తమిళ తెలుగు జిల్లాల నుండి కూడా చిన్న సమూహాలు చేరాయి. ఉత్తర భారతదేశంలో ఆర్కటీయా, దక్షిణ భారతదేశంలో మేస్త్రీ అని పిలువబడే దళారులతో, తరచుగా వారందరినీ నకిలీ వాగ్దానాల మీద నియమించుకున్నారు. వారి ద్వారానే ఆ నియామక వ్యవస్థ ప్రారంభం నుండి ముగింపు వరకు వెన్నెముకగా వారికి నిలిచింది. తిరిగి రావడానికి అనుకూలమైన పరిస్థితులు లేక, భారతదేశానికి ఎక్కువ మంది కార్మికులు తిరిగి రాలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అక్కడ ఇమడ లేక తిరిగిరాలేక, అక్కడి నుంచి పారిపోయిన వారిలో ఎక్కువ మంది దక్షిణ భారతదేశం నుంచి వెళ్లిన కార్మికులే. సంఖ్యాపరంగా అక్కడ మైనారిటీగా ఉన్న వారు. వారి జీవనశైలి ఉత్తర హిందూ భారతీయులకు చాలా భిన్నం. అలా అదృశ్యమైన భారతీయులలో చాలామంది పట్టణ ప్రాంతాలలో, ముఖ్యంగా బ్రిటిష్ గయానాలోని జార్జ్‌టౌన్‌లోని బౌర్డా మార్కెట్‌లో బిచ్చగాళ్ళుగా మారారు. వారి కొత్త నివాసాలలో, ఎక్కువమంది అనారోగ్యాలకు గురయారు.
సగం గయానా ప్రజలు భారతీయులే
భారతీయ ఒప్పంద కార్మికుల వారసులు ఇప్పుడు అక్కడి మొత్తం జనాభాలో 50శాతానికి పైగా ఉండటం విశేషం. తమ సొంత మార్గాలను ఏర్పరుచుకుంటూ, వారి పూర్వీకులను గుర్తుంచుకుంటూ గౌరవిస్తున్నారు. మే 5వ తేదీని వారి పూర్వీకుల రాక దినోత్సవాన్ని ప్రతి ఏటా జరుపుకుంటున్నారు. గయానాకు వచ్చిన మొదటి భారతీయుల సంబంధాలను గౌరవించడానికి, అక్కడకు వచ్చిన మొదటి నౌకల కాంస్య విగ్రహాల్ని అక్కడ నెలకొల్పుకున్నారు. డాక్టర్ చెడ్డీ జగన్, గయానాకు చెందిన భారతీయుడు, వృత్తి రీత్యా దంతవైద్యుడు, పీపుల్స్ ప్రోగ్రెసివ్ పార్టీ (PPP) నాయకుడు, రిపబ్లిక్ ఆఫ్ గయానా మొదటి ప్రధానిగా ఎన్నికయ్యాడు. అయినా ఎన్నాళ్లో అతను కొనసాగలేదు. గయానా సామాజిక, జాతి అస్థిరత కారణంగా పదవీచ్యుతుడయ్యాడు. 1995లో రిపబ్లిక్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యే వరకు ఆయన రాజకీయ అరణ్యంలో తిరిగాడు. డాక్టర్ జగన్ మరణం తర్వాత, ఆయన భార్య జానెట్ జగన్ అధికారంలోకి వచ్చింది. పన్నెండేళ్ల వయస్సు నుంచి PPP సభ్యుడు భరత్ జగదేవ్ గయానా అధ్యక్షుడిగా ఉన్నాడు.
తేనెలో చిక్కుకున్న ఈగల్లా బానిసలైపోయాం
ఒప్పంద కార్మికులు వారిలో వారు కుమిలిపోయిన క్షణాల్లో అనుకోకుండా ఉండలేని మాటలివి. “ఓడలో చాలా నెలలు చాలా కష్టంతో గడిచాయి, ఏడు చీకటి సముద్రాలలో, అలవాటు లేని సమస్యల్ని అనుభవించాం. బతికి బయటపడ్డాం అనుకునే లోపే - తేనెలో చిక్కుకున్న ఈగల్లా మేము బానిసలమయాం, రాత్రీ పగలూ నిద్ర ఆహారాలు లేకుండా పొలాల్లో పాటుపడ్డాం”
-ముకుంద రామారావు
99083 47273
- Tags
- Guyana






