కవిమాట

by Ravi |

కవిమాట
X

బొంది ఎవరి సొమ్ము పోషింప పలుమారు

ప్రాణమెవరి సొమ్ము భక్తి సేయ

ధనము ఎవరి సొమ్ము ధర్మమే తన సొమ్ము

విశ్వదాభిరామ వినురవేమ

(ప్రస్తుతం నీది అనుకుంటున్నదేదీ నీది కాదు. అంటే ఎప్పటికీ నీతో ఉండేది కాదు. శరీరం పట్ల అంత శ్రద్ధ తీసుకుంటున్నావెందుకు? అది ఎప్పుడూ ఇలాగే ఉంటుందా? జరా దుఃఖం ఉండనే ఉంది కదా! ప్రాణమూ అంతే! ఊపిరి ఎప్పుడుఆగిపోతుందో తెలియదు.)

చావు వచ్చినపుడు సన్యసించేదెట్లు

కడకు మొదటి కులము చెడినయట్లు

పాపమొకటి గలదు ఫలమేమి లేదయా

విశ్వదాభిరామ వినురవేమ

(అవసాన దశకు చేరుకున్నప్పుడు సన్యాసం స్వీకరిస్తున్నావా? అంటే పూర్వాశ్రమంలో చేసినవన్నీ తప్పులన్నట్టేగా. గతంలో జరిగిన పాపం ఎటూ పోదు. దాని ఫలితం అనుభవించక తప్పదు. సన్యసిస్తే మంచి ఫలితం వస్తుందనుకుంటున్నావా? అదంతా వొట్టిది)

ఉత్తమోత్తముండు తత్వజ్ఞుడిల మీద

మహిమ జూపువాడు మధ్యముండు

వేషధారి యుదర పోషకుండధముండు

విశ్వదాభిరామ వినురవేమ

(తారతమ్యాన్ని బట్టి లోకంలో మూడు రకాల గురువులుంటారు. మొదటివాడు పరమాత్మ సంబంధమైన జ్ఞాని. ఇతడు శిష్యులకు తత్త్వజ్ఞానం బోధిస్తాడు. ఉత్తమ శ్రేణికి చెందిన గురువంటే ఇతడే. రెండోవాడు మధ్య రకం వాడు. ఇతడు జనులను ఆకట్టుకోడానికి మహిమలుచేసి చూపిస్తాడు. ఇక మూడోరకం వాడున్నాడే ఇతడు పొట్ట కూటికోసం గురువు వేషం వేసుకొని ప్రజలను మోసం చేస్తాడు. ఇతనిది అతి తక్కువ స్థాయి. ఇటువంటివారిని నమ్మకూడదు)

ఆనుకూల్యము గల అంగన కలిగిన

సతికి పతికి పరమ సౌఖ్యమమరు

ప్రాతికూల్యయైన పరిహరింప సుఖంబు

విశ్వదాభిరామ వినురవేమ!

(ఒద్దిక కలిగిన భార్య ఉన్నట్టయితే ఆమెకూ ఆమె భర్తకూ సుఖ సంతోషాలు సమకూరి ఆ కాపురం ఒడిదుడుకులు లేకుండా నడుస్తుంది. విరుద్ధమైతే మాత్రం ఆ దాంపత్యం నిలువదు. అట్లాంటప్పుడు ఆమెను వదిలెయ్యటం తప్ప గత్యంతరం లేదు)

-వేమన

Next Story