- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాగసూరి వేణుగోపాల్ 'గాంధీయే మార్గం' పుస్తకావిష్కరణ
ప్రముఖ రచయిత,పాత్రికేయులు, సంకలనకర్త నాగసూరి వేణుగోపాల్ రచించిన 'గాంధీయే మార్గం' పుస్తకాన్ని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆవిష్కరించారు.

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ రచయిత,పాత్రికేయులు, సంకలనకర్త నాగసూరి వేణుగోపాల్ రచించిన 'గాంధీయే మార్గం' పుస్తకాన్ని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా రామన్నపేట ఒకటవ లైన్ లోని జనచైతన్యవేదిక హాల్ లో నిర్వహించిన పుస్తకావిష్కరణ సభ అర్థవంతంగా జరిగింది. మహాత్ముని సిద్ధాంతాలు-ప్రభావాలు-పరిష్కారాలు ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా నాలుగవ సంకలనం పూర్తి చేసినట్లు సంపాదకులు నాగసూరి వెల్లడించారు. మొత్తం 21 మంది రచించిన 21 వ్యాసాలను నాలుగవ సంపుటిగా తానే నాగసూరి అకాడమీ ఆఫ్ మీడియా అండ్ సైన్స్ నేతృత్వంలో తీసుకురావడం వెనుక ఉద్దేశ్యాన్ని ఆయన వక్తలకు వివరించారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ గాంధీ అంటే ఓ వ్యక్తి కాదని యావత్ భారతదేశమని వ్యాఖ్యానించారు.
సమాజంలో గాంధీపట్ల ఓ వర్గం అర్థంలేని ప్రచారాలకు ఇలాంటి పుస్తకాలు కనువిప్పు కలిగిస్తాయని తెలిపారు. గాంధీ ఎంచుకున్న మార్గాలను ఈ తరం తెలుసుకునే ప్రయత్నం చేయాలని జనచైతన్యవేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. మహాత్ముడితో ఎన్నో అనుబంధాలు పెనవేసుకున్న గుంటూరు వేదికగా ఈ పుస్తకావిష్కరణ జరగడం సముచితమన్నారు. గాంధీయే మార్గంలో వ్యాసాన్ని రాసిన రచయిత వావిలాల సుబ్బారావు గాంధీని ఆరాధించాల్సిన భారతజాతి గాడ్సేని అనుసరిస్తుండడం ఆందోళనకరమన్నారు. గాడ్సే గాంధీని చంపిన సంఘటన వెనుక విషయాలను ఆసక్తికరంగా వివరించారు. గాంధీయే మార్గం పుస్తకంపై ఒక చేత్తో రాముడిని, మరో చేత్తో కృష్ణుడిని పట్టుకుని మహాత్ముడు నడుస్తున్నట్లు బాపు గీసిన చిత్రం ప్రత్యేకార్షణగా ఉందన్నారు.
ప్రొఫెసర్ డీ.ఏ.ఆర్ సుబ్రమణ్యం మాట్లాడుతూ గాంధీపై ఎలాంటి విభిన్న అభిప్రాయాలున్నా..ఆయన గొప్ప మానవతావాది, విశాల ఆలోచనలు కలిగిన మంచి మనిషన్నది ఏకాభిప్రాయమన్నారు. దురదృష్టవశాత్తు అందరి మంచికోరి తుది శ్వాస వరకూ శ్రమియించిన మహాత్మున్ని ఆరాధించేవారితో పాటు ద్వేషించేవారూ ఉండడమే బాధాకరమన్నారు. చివరిగా రచయిత నాగసూరి ముగింపు ఉపన్యాసంలో భాగంగా మాట్లాడుతూ గాంధీ ఆదర్శాలపై పైపైన మాటలు కాకుండా నవతరంలో లోతుగా చర్చ జరగాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వ్యక్తిగత అభిప్రాయాలనే నిజాలుగా నమ్మి పుస్తకాలు చదవకుండా, చరిత్ర తెలుసుకోకుండా చేసే ప్రచారాలను నమ్మవద్దని హితవు పలికారు. కొన్ని ఆకర్షణీయ వ్యాసాలతో త్వరలోనే ఐదవ సంపుటి పూర్తి చేయనున్నట్లు నాగసూరి స్పష్టం చేశారు.






