ఎడారి కోయిల పరితప్త గానం.. నా ప్రయాణం

by Ravi |   (  Updated:2026-07-06 01:01:03  IST  )

Naa Prayaanam by Nari Naresh Book Review

ఎడారి కోయిల పరితప్త గానం.. నా ప్రయాణం
X

'ఎట్లున్నాడో కొడుకు.. ఎప్పుడొస్తాడో.. ' అంటూ సి నారాయణరెడ్డి దుబాయి పోయిన కొడుకును తలుచుకునే ఓ పేద తల్లి బాధను రాగయుక్తంగా వినిపించి కంటతడి పెట్టించేవారు. భార్యా పిల్లలను ఊర్లోనే వదలి బతుకు తెరువు కోసం వేల మైళ్ల దూరం వెళ్లేవారి వేదనకు రెండు వైపులా కన్నీళ్లే. రెండు, మూడేళ్లకని ఎడారి దేశాలకు పోయినవారు అప్పులు, ఖర్చులు తీరడానికి అక్కడే బతుకుల్ని వెల్లదీస్తుంటారు. గల్ఫ్ కార్మికుల కష్టాలు, బాధల గురించి అప్పుడప్పుడు తెలిసే వార్తలే తప్ప కథలు కవితల్లాంటివి తక్కువనే చెప్పాలి. వెళ్లినవారిలో శ్రామికులే ఎక్కువ కాబట్టి వీటిని ఆశించలేము.

పారిశుద్ద కార్మికుడి కవితలు..

అయితే ఈ మధ్య అదే వలస జీవుల్లోంచి ఒక యువ కవి వచ్చాడు. 'ఇంటి గడపనై కావలి కాయాలనుంది అమ్మ ఒడిలో పసిబిడ్డనై ఆడాలనుంది' అంటూ ఇంటి యాదితో కవితలల్లుతున్నాడు. అతనే నారి నరేష్. అరబ్బు దేశమైన ఒమన్ రాజధాని మస్కట్ లో పారిశుద్ద కార్మికుడాయన. నలభై ఏళ్ల జీవితంలో ఇప్పటికే సగభాగం గల్ఫ్ లో గడిచింది. పేదరికం వల్ల చదువును ఇంటర్ మధ్యలోనే వదిలేసి ఎడారి బతుకు ఎంచుకున్నాడు. వలస వెళ్లిన ఒంటరి జీవితంలోని భార్య, ఇద్దరు పిల్లలు కూడా వచ్చారు. వాళ్లు ఇక్కడే, ఊర్లోనే ఉంటారు. నిజామాబాద్ జిల్లాలోని మెండోరా ఆయన స్వస్థలం.

వలసజీవుల గుండె చప్పుడు..

నరేష్ జీవితంలో తవ్వుకోడానికి తరగని వేదన ఉంది. 'ఉండడానికి మనసు ఒప్పుకోదు తిరిగి వెళ్లడానికి ధైర్యం చాలదు' అంటూ తన కన్నీటి చెమ్మను అక్షరాల్లోకి దింపాడు. పలు సాహిత్య, సామాజిక మాధ్యమ వేదికలపై కనబడే ఆయన కవిత్వానికి వలసజీవుల గుండె చప్పుడుగా గుర్తింపు లభిస్తోంది. ఆ కవితల కూర్పుతో 'నా ప్రయాణం' పేరిట నరేష్ తొలి కవితా సంపుటి ఇటీవల వచ్చింది. దీనిని మస్కట్‌లో భారత రాయబారి జీవీ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఇంటి యాదితో నిద్రపట్టక అర్థరాత్రి లేచి కన్నీటి తెరల మధ్య రాసిన కవితలు ఇవి. కాళోజి, అలిశెట్టి కవిత్వం తనకు ప్రేరణ, బి ఆర్ అంబేద్కర్ జీవితాదర్శం అని నరేష్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

యాభై డిగ్రీల వేడి బతుకుల గొంతు

బతుకు తెరువుపై సొంతవారికి దూరమైన వేదనకు తోడుగా - నరేష్‌కు కవిగా, వ్యక్తిగా సమాజంపై ఓ స్పష్టత ఉంది. పేద దళిత బిడ్డగా జీవితానుభవం ఉంది. అందుకే 'నీ జీవితమనే రాజ్యానికి నీవే రాజువై కాపాడుకోవాలి మంత్రివై ఆలోచించాలి సైనికుడివై ఎదుర్కోవాలి' అని రాయగలిగాడు. యాభై డిగ్రీల వేడిలో అనివార్యంగా బతుకుతున్న వారి గొంతుకను వినిపించాలనే ఆరాటం చాలా కవితల్లో కనిపిస్తుంది. 'మండే అగ్ని గోళాలు ఎటు చూసినా ఉక్కపోతలు వేడి గాలుల మోతలు లోలోపల ఉడికిపోతాం ఒంట్లో శక్తినీ కోల్పోతాం' అంటూ గల్ఫ్ పరిస్థితిని కళ్ల ముందు ఉంచుతాడు. 'ఆలోచనలే మాకు చుట్టాలు, బంధువులు కన్నీళ్లే మాకు మిత్రుడు ఇంటికి అతిథిలా వచ్చి వెళ్లే పరాయి దేశంలో కిరాయివాళ్ళం మేం గల్ఫ్ కార్మికులం' అంటూ సమిష్టి బాధలకు అక్షరాలను ఇస్తాడు.

బూడిదతో చిన్నపాటి యుద్ధం..

నేటి మనిషిలో మంచితనాన్ని కాంక్షిస్తూ రాసిన కొన్ని కవితలు ఇందులో ఉన్నాయి. 'గొంతులో నుండి ఓ మాట హృదయంలో పలికేది ఇంకోటి' అంటూ కపటత్వాన్ని నిరసించాడు. మహిళా కోణంలో రాసినవి కొన్ని. బీడీ కార్మికురాలు 'కష్టానికి బానిస. ఆకూ తంబాకు బూడిదతో చిన్నపాటి యుద్ధం చేస్తుంది' అని సానుభూతి ప్రకటిస్తాడు. సామాజిక వ్యంగ్య ప్రకటన కూడా ఉంది. 'రాను రాను పెళ్లిళ్లు యూట్యూబ్ ఛానల్లో చూసి గూగుల్ పే ఫోన్ పే లో కట్న కానుకలు పంపుతారు స్విగ్గి జొమాటో కొరియర్ వాళ్లు ఇంటికి పెళ్లి భోజనం డెలివరీ చేస్తారు' అంటూ దూరమవుతున్న మానవ సంబంధాలను ఎద్దేవా చేస్తాడు.

కవిత్వంపై ప్రేమ, సమాజంపై బాధ్యత నరేష్ గుండె నిండుగా ఉన్నాయి. అయితే కవి ఎదుగుదలకు కావ్య పఠనం, పరిశీలన, పద సంపద ఎంతో అవసరం. భావమేదైనా వాక్యాలు కూర్పు కవిత్వమనిపించుకోదు. కవిత్వ భాషను పట్టుకోవాలి. అక్కడక్కడా చమక్కుమనే పంక్తుల సంఖ్య కవితల్లో పెరగాలి. కృషి చేస్తే ఈ యువకవి సాధించగలడనే నమ్మకం 'నా ప్రయాణం' ఇస్తోంది.

పుస్తకం: నా ప్రయాణం (కవితా సంపుటి)

రచన: నారి నరేష్

పేజీలు: 100, వెల: రూ. 100-

పబ్లికేషన్: తపస్వి మనోహరం పబ్లికేషన్స్,

ప్రతులకు: +968 9302 9220 (వాట్సాప్)

పరిచయస్తులు

-బద్రి నర్సన్

94401 28169

Next Story