కొత్త పుంతలు తొక్కుతూ... నా అడుగులటువైపే

by Ravi |   (  Updated:2026-05-25 01:00:54  IST  )

సాధారణంగా ఎటు వెళ్తున్నారని అడుగుతాము అటు వైపే అనగానే అందరి మదిలో మంచి వైపు ప్రయాణము అనే ఆలోచన వస్తుంది. మానవుడు మంచికై నడుము బిగించాలి అప్పుడే సన్మార్గములో ముందుకు వెళుతూ ప్రశాంతమైన జీవనం సాగించవచ్చు అనే కోణంలో

కొత్త పుంతలు తొక్కుతూ... నా అడుగులటువైపే
X

సాధారణంగా ఎటు వెళ్తున్నారని అడుగుతాము అటు వైపే అనగానే అందరి మదిలో మంచి వైపు ప్రయాణము అనే ఆలోచన వస్తుంది. మానవుడు మంచికై నడుము బిగించాలి అప్పుడే సన్మార్గములో ముందుకు వెళుతూ ప్రశాంతమైన జీవనం సాగించవచ్చు అనే కోణంలోనే ప్రముఖ కవి డాక్టర్ కొరుప్రోలు హరనాథ్ రచించిన "నా అడుగులటువైపే" అంటూ కవిత సంపుటి సమాజ ప్రయోగ శాలలో నిఘంటువుగా పొందుపరిచారు.

ఈ పుస్తకంలోకి వెళ్లినట్లయితే జీవిత సారంలో మనిషి ఎప్పుడు ఒంటరివాడే నిత్య సత్య అన్వేషని చెప్పారు. బతుకు పోరులో నేలకు ఒరిగిన బాటసారులపై కుటుంబం పడే వేదన గుర్తుకు చేశారు. అలాంటి విషాద ఘటనలు రాకూడదు అంటారు. మనిషి అవార్డు రివార్డుల కోసం కాకుండా దేశం కోసం పోరాడమంటారు. 'మానవత్వం పరిమళించే దిశగా సమాజ గమనం సాగాలి అంటూ 'మానవాభ్యుదయం వైపు వడివడిగా అడుగులేద్దాం' అంటారు.

'తెలుగు కవితకు తెగులుపట్టిందా...?

తెలంగాణపై ప్రేమతో పాటు ప్రత్యేకతను తెలుపుతూ ఎన్నో పోరాటాల అమరుల త్యాగ ఫలితంగా శుభ ఘడియలు వచ్చాయంటూ, హైదరాబాద్ చారిత్రక కట్టడాలను రగులుతున్న నగరం కవితలో పొందుపరిచారు. ఆనాటి సాహిత్యం నేడు లేదని యాదికి చేస్తూ 'తెలుగు కవితకు తెగులుపట్టిందా...? అని సందేహం వ్యక్తం చేశారు. 'యుద్ధ మేఘం' కవితలో కవి తన ఆలోచన విధానం తెలియపరచి కవిత్వంపై ఉన్న స్వాభిమానం చూపెడుతూ ఈ అనంత విశ్వంలో నేను అణువంత అంటూ, పండుగలు ఉన్నవాడికే.. లేని వారికి కాదంటూ, ఉన్న దాంట్లో పేదలు సర్దుకుపోతూ నిజమైన ఆనందం పొందుతారన్నారు. కవిత్వం లగ్జరీ గదులలో కాదు పేదవాడి నిజ జీవితంలోకి తొంగి చూసి రాయమంటారు, మధురానుభూతులను డిక్షనరి‌గా అభివర్ణించుకున్నారు.

శ్వేతవర్ణపు శాంతి బాటలో యువత..

ఓపికే స్త్రీకి వజ్రాయుధమని, కట్టు, బొట్టు, గాజుల సవ్వడితో స్త్రీల యొక్క ఔన్నత్యాన్ని గొప్పగా చెప్పుకువచ్చారు. విధ్వంసం మంచిది కాదంటారు దాంతో ప్రాణ నష్టం జరుగుతుందని శాంతికై తపించాలంటూ 'సందేశం' కవితలో శాంతి కోసం అడుగులు వేయాలంటూ యువత కూడా శ్వేతవర్ణపు శాంతిని నియమించాలంటారు. స్వచ్ఛమైన ప్రేమ వల్ల పొందే అనుభూతి, మాధుర్యాన్ని తెలిపారు. అన్వేషణ మనిషి లక్షణం అంటూ ఓడిన వాడికి సానుభూతి ఉంటుంది అన్నారు. పిరికితనం మంచిది కాదన్నారు.

కవిత్వమే నేనయ్యా..!

పెరుగుతున్న నిత్యావసర ధరలతో పేదల బ్రతుకు బండి నడవడం లేదంటూ అభివృద్ధికి సంక్షేమాలు, చట్టాలు ఎన్ని వచ్చిన పేదలు నేటికి నిరుపేదలుగా ఉన్నారని తెలిపారు. అక్షరము ఆనాటి నుండి నేటి వరకు అక్షరంతో ప్రయాణిస్తూ 'కవిత్వమే నేనైనాను' అంటారు. 'ఓ మనిషి' కవిత్వంలో ఆహారము వ్యర్థం చేయరాదంటారు. కార్మికులు ఏకమై, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యమకారులు ఒకటి కావాలంటూ ఉద్యమాన్ని ఏకతాటిపైకి నడిపే నేత ఉత్తమం అన్నారు. 'చెట్టు కూలితే' కవితలో చెట్టు ఉపయోగాలు తెలియజేస్తూ, ప్రతి వస్తువు సందర్భంలో కవిత్వం ఉంది అంటారు. మరణం ఓ అత్యధ్బుతమని వర్ణిస్తూ, ఏదీ శాశ్వతం కాదంటారు. 'ఆత్మఘోష' కవితలో పూర్వ జ్ఞాపకాలు వదిలి కొత్త ప్రపంచంలోకి వెళ్లమంటూనే, ఇష్టమైనదే బాధిస్తుందన్నారు.

సూర్యచంద్రులు ఉన్నంత కాలం కవిత్వం

'నా కవిత'లో కవిత్వం రాయడానికి పడే కలం వేదనను తెలుపుతూ సూర్యచంద్రులు ఉన్నంత కాలం కవిత్వం ఉంటుంది అన్నారు. వ్యక్తిత్వం దృఢమైన సౌధం అంటూ, నుదుటి మీద గాయం కంటే గుండె గాయం చెదపురుగులా తొలుస్తుందని తెలిపారు. చైతన్య కావాలంటూ సత్యం పలుకమంటారు. బాల్యం నాటి రోజులు మళ్లీ వస్తే బాగుండని అభిప్రాయపడ్డారు. అక్షరాలు బలమైనవని తెలుపుతూ, ఉన్నత ఆలోచనలతో ముందుకు పోవాలి అంటునే, అక్షరానికి అంతం లేదంటారు. దేవుడి సాక్షిగా మనం ఏకమై విహరించలంటూ, గుండెలోని ప్రేమను గుర్తుకు చేస్తూ, అర్ధాంగిని అమృత మూర్తిగా వర్ణిస్తూ తను తోడుంటే ప్రపంచాన్నే గెలవచ్చు అంటూ భార్యపై ఉన్న మమకారం చాటుకున్నారు.

చినుకు పులకరిస్తుంది కానీ..

కవచం కవితలో పుట్టింటికి దూరమై భర్తను పోగొటుకున్న స్త్రీ పడే వేదన తెలిపారు. చినుకు పులకరిస్తుంది అంటూనే, వ్యవసాయానికి గతంలో అయ్యే అప్పు 'మోంబత్తి' కవితలో, తుఫాను నష్టం తెలిపారు. చక్కని చుక్క అంటూ గత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ మెత్త ప్రత్యేకతను తెలిపారు. సముద్ర ప్రయాణంలో ఆటుపోట్లను తెలుపుతూ, అక్షరం వజ్రాయుధమని, కవి మాత్రమే హృదయ స్పందనను తెలుపగలరంటారు. ప్రకృతి సౌందర్యానికి మనం రాసే అక్షరాలు ఇతరులకు నచ్చితే 'మధురామృతం' అంటారు. చివరి కవిత అయిన 'నా దేవత' లో తన కవిత రచనకు మూలం తన అర్ధాంగి అని చెప్పకనే చెప్పారు. ఈ పుస్తకం ఒక కొత్తదనంతో పులకించి పోయ్యేలా భావ కవితను పొందుపరుస్తూ సమాజం ధర్మం వైపు నడిచేలా ప్రతి కవితను అద్భుతంగా వర్ణిస్తూ ప్రతి అక్షర కదలిక మంచికే అని తెలుపుతూ, ఇలాంటి పుస్తకాలు మరిన్ని వెలుగులోకి రావాలని ఆశిద్దాం.

పుస్తకం : నా అడుగులటువైపే -కవితా సంపుటి

రచయిత: డాక్టర్ కొరుప్రోలు హరనాథ్

వెల: 150/-

ప్రతులకు: 9703542598

లభ్యం : అన్ని పుస్తక కేంద్రాల్లో


సమీక్షకులు

-మిద్దె సురేష్

97012 09355

Next Story