- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పల్లేరు మీద నడకే..!
సాకం నాగరాజని కలిసినప్పుడల్లా ఒక పుస్తకాల కట్ట చేతిలో పెట్టేవారు. కలవడం వీలుకాకపోతే పుస్తకాలను పోస్ట్ చేసేవారు. ‘నా జీవితం నల్లేరు మీద బండి’ అనే వారి ఆత్మకథా పుస్తకంతోపాటు మరికొన్ని పుస్తకాలు జోడించి పంపించారు.

సాకం నాగరాజని కలిసినప్పుడల్లా ఒక పుస్తకాల కట్ట చేతిలో పెట్టేవారు. కలవడం వీలుకాకపోతే పుస్తకాలను పోస్ట్ చేసేవారు. ‘నా జీవితం నల్లేరు మీద బండి’ అనే వారి ఆత్మకథా పుస్తకంతోపాటు మరికొన్ని పుస్తకాలు జోడించి పంపించారు. ‘వూరికో నాగరాజ వుంటే బావుణ్ణు’ అని తాడి ప్రకాష్ గారు రాసిన ముందు మాటలో, ‘ఇందులో గొప్పలు చెప్పుకునే దరిద్రమూ కానరాదు’ అని గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చారు. వీరి జీవిత చరిత్రలో హిపోక్రసీ లేదు, ఎలాంటి ఫైర్ వర్క్స్ లేవు, కవరింగ్ టెక్నిక్స్ లేవు.
నాగరాజ ఆత్మకథ ఆద్యంతం నిజాయితీ, హాస్య, వ్యంగ్య మేళవింపులతో సాగింది. వెనకటి రోజుల్లో ఇంట్లో పనివాళ్లను చూసుకునే విషయం ప్రస్తావిస్తూ ‘మేము వండుకున్న వుప్పాంసుల కూర మాతో పాటు పొలంలో పనిచేసే మా కూలీలకు వేసే వాళ్లం’ అని రాయడం పేదల పట్ల వారి కరుణను తెలియజేస్తుంది. ఒక ఆడకూలీ తనకు వడ్డించిన కూరను కుక్కి మంచం మీదున్న ముసలి అత్తకు తీసుకుపోవడం గమనించిన బాల నాగరాజ పెద్దయి ‘అట్టడుగు వర్గాల వారు ముసలి ముతకాను చూసినంత బాధ్యతగా అగ్ర వర్ణాల వారు చూడరు. అగ్రవర్ణాలు అనడం దేనికి అనుకుంటే, డబ్బున్న వాళ్లు అందాము’ అని నేటి సమాజాన్ని కళ్ల ముందుంచుతారు.
నలుగురికి పెట్టాలిరా నాయనా..!
చిన్నప్పుడు వారి కుటుంబ పెద్ద సంతవ్వ ‘నువ్వొకరి చేతిలో పెట్టేదే నిన్ను కాపాడుతుంది. నువ్వు తినేస్తే సరిపోదు. నలుగురికి పెట్టాలిరా నాయనా’ అని చెప్పిన మాటనే నాగరాజ జీవన వేదం చేసుకున్నారు. చిన్నతనంలో చేసిన దొంగతనాల్ని మనస్ఫూర్తిగా ఒప్పేసుకుని, ఆ నింద మోసిన వారిని క్షమాపణలు కూడా అడిగేస్తారు. బాల్యం మరచిపోలేక ‘బాల్యం అనేది మీకైనా నాకైనా ఒక చెలమ. తవ్వేకొద్దీ జల వూరుతూనే ఉంటుంది’ అని ఇంటెన్స్ నోస్టాల్జియాకి లోనవడం వారి విశిష్ట వ్యక్తిత్వం.
పని లేకపోతే ఎండనపడి తిరుగు..
ఉద్యోగం ఆలస్యమై ఉంటే ‘తిరుపతి తీర్థకట్టవీధిలో ప్రొవిజనల్ స్టోర్లాంటిది పెట్టుకుందామన్న ఆలోచన కూడా చేయకపోలేదు’ అని ప్లాన్ ‘బి’ సిద్ధం చేసుకున్న దీర్ఘదర్శి. కాలేజి డేస్‌లో అంధులైన తన మిత్రుల గురించి ప్రస్తావిస్తూ ‘మనం వొట్టి కళ్ళతో చూసే లోకాన్ని వాళ్ళు మనోనేత్రంతోనే కాదు, జ్ఞాన నేత్రంతో కూడా దర్శిస్తారు’ అని హెలన్ కెల్లర్‌ను గుర్తుకు తెస్తారు. నాగరాజ అలుపెరుగని పనిమంతుడు. తన మిత్రుడు ‘ఏ పనీ లేకపోతే అది మిట్ట మధ్యాహ్నమైనా ఎండనపడి తిరుగుతూండు, ఖాళీగా ఉండకు, పగటి పూట పడుకోకు’ అని చెప్పిన మాటనే మంత్రదీక్ష వహించి జీవితాంతం యంత్రంలా గిరగిరా తిరిగేశారు. పెళ్ళిమాటలు జరిగే రోజుల్లో వారి శ్రీమతి శశిగారి ఇంట్లో బాయిలర్ సహా గ్యాసు, గ్రైండర్ వంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి అని అబ్బురపడి, ఒకరిద్దరు బావమరుదులు కూడా ఉన్నందుకు భరోసాతో పెళ్ళికి ‘ఎస్’ చెప్పేశాను అని సంబరపడిన అల్పసంతోషి. ఉద్యోగపర్వంలో ‘లెక్చరర్ అసోసియేషన్స్ ఉద్యమాలన్నీ శాలరీస్, ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్లు, సర్వీస్ మేటర్స్.. ఇంతే! విద్యార్థుల బాగుపట్టదు’ అని ఆవేదన వెలిబుచ్చారు.
లేడీ లెక్చరర్ చేతిలో పిస్తోల్ ఒకటే తక్కువ
తనకు నచ్చని ఇన్విజిలేషన్ క్రతువుల గురించి రాస్తూ ‘ఎగ్జామ్ చీఫ్ ఒకరు వచ్చి కాపీలకు పాల్పడవద్దని ఒక రౌండ్ (కాల్పులు జరిపినట్టుగా) హెచ్చరించి వెళ్లాడు’ అని, మరోసారి ‘తనిఖీకి వచ్చిన లేడీ లెక్చరర్ ఒకావిడకు చేతిలో పిస్తోలు ఒకటే లేదు అంతే.’ అని వారి ఓవర్యాక్షన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇది చదివితే చలంగారు మ్యూజింగ్స్‌లో ముచ్చటించిన వారి ఇన్విజిలేషన్ అనుభవాలు గుర్తుకొచ్చాయి. ఎవరి కష్టమూ చూడలేని మనసున్న నాగరాజ వారి పనిమనిషి భారం తగ్గించాలని సింకులో గిన్నెలు కొన్నిటిని తానే కడుగుతారట. జీవితాంతం విద్యా వ్యవస్థలో విద్యార్థులతో మమేకమైన నాగరాజ ఎన్నో ప్రయోగాలు చేశారు. పిల్లల్ని ప్రోత్సహించి వ్యాసాలు, ఉత్తరాలు రాయించారు. నాగరాజు పెద్దమ్మాయి వారికి రాసిన ఉత్తరంలో తండ్రిగారు తనని పుస్తకాలు చదవమని చిన్నప్పుడు ప్రోత్సహించడం గుర్తు చేసుకుని, పుస్తకాలు చదవడం వల్లనే తనకు కొంత హృదయ సంస్కారం అబ్బిందని, నాలెడ్జ్ అనేది తీరని దాహం అని కూడా అర్థమైందని తండ్రికి కృతజ్ఞతలు తెలియజేసిందట.
పసిపిలగాడి గుణానికి కితాబు..
నాగరాజ పట్ల గల అవ్యాజమైన ప్రేమాభిమానాలతో నామిని తన మిట్టూరోడి సమగ్ర సాహిత్యం పుస్తకాన్ని వారికే అంకితమివ్వడం వారి స్నేహానికి నిదర్శనం. ఆ పుస్తకాన్ని అంకితమిస్తూ ‘‘డెబ్బయిలలోకి అడుగిడుతున్న ఈ పసిపిలగాడికి, ఇతగాడి గుణానికి అంటూ కితాబివ్వడం నాగరాజకి జీవన సాఫల్య పురస్కారం ఇచ్చినట్లే. మిత్రుడు వాకా ప్రసాద్ సాయానికి మురిసిపోయిన నాగరాజ... ప్రసాద్ వల్ల తనకు కొడుకులేని లోటు తీరిందని చెప్పుకున్నారు.
రిటైర్మెంట్ సొమ్మంతా పుస్తక ప్రేమకు పెట్టి..
పలు పుస్తకాలను, ఎన్నో ప్రపంచ ప్రఖ్యాత కథా సంకలనాల్ని ప్రచురింపచేసి, ఆ పుస్తకాలను స్కూటర్‌లో పెట్టుకుని స్కూల్ పిల్లలకు పంచిన నాగరాజ అసలు సిసలైన తెలుగు భాషా ప్రేమికులు. మహాకవి శ్రీశ్రీ సైతం వారి చిత్తశుద్ధిని ప్రశంసిస్తూ ‘వారి సామాజిక చైతన్యం, ఉత్సాహం గొప్ప కవిత్వాంశం’ అనడం విశేషం. వారి సేవలను బాపు, రమణలు మెచ్చుకుని, చేయూతనివ్వడం ఎంతో ఉత్సాహాన్ని కలిగించిందట. పుస్తక ప్రేమ అనే మంచి వ్యసనంతో తన రిటైర్మెంట్ సొమ్మునంతా పోగొట్టుకున్న సత్తెకాలపు మనిషి. ఒక రోజు ఐన్‌స్టీన్ సభానంతరం ఒకామె తన పదేళ్ల కొడుకుతో తన వద్దకు వచ్చి ‘‘మా అబ్బాయి తెలివైన వాడు కావాలంటే ఏమి చేయాలి?’’ అని అడిగిందట. ఐన్‌స్టీన్ ‘‘మీ వాడికి కథలు చెప్పండి’’ అని చెప్తే ఆమె ‘‘అలా కాదు మీలా గొప్ప తెలివైన వాడు కావాలంటే ఇంకా ఏమి చేయాలి?’’ అని అడిగిందట. ‘‘ఏముంది, వాడికి మరిన్ని కథలు చెప్పండి’’ అని నవ్వేసాడట. కథల ప్రాధాన్యత, వ్యక్తులపై వాటి ప్రభావం ఐన్‌స్టీన్ తరువాత మా నాగరాజన్నకే తెలియడం వల్ల నేమో కథలంటే చెవితో పాటు, కాలు చెయ్యి కోసేసుకునైనా పుంఖానుపుంఖాలుగా అచ్చు వేయించి వాటిని పంచే పనిని ఉద్యమంలా నిర్వహించాడు. కథల్ని సాకడంలో, సేకరించడంలో, పంచడంలో సాకంగారి తపన, కృషి నిరుపమానం. ఆచార్య ఎన్.గోపిగారు, ‘కవిత్వమంటే ఇష్టమే కాని మనిషికంటే కాదు’ అంటారు. నాగరాజ ‘మనిషంటే ఇష్టమేకాని, పుస్తకమంత కాదు’ అంటారేమో!
నిజంగానే పల్లేరుమీద నడక
వారి ధర్మపత్ని అనారోగ్యానికి వ్యధ చెందుతూ ఆమెకంటే చాలా పిన్న వయస్కులైన మరో ఇద్దరు పేషంట్లను తలుచుకుని ‘సాత్విక్, రోహిత్‌ల ముందు మా శశిది చిన్నగీత’ అని నిబాయించుకుంటారు. వాస్తవానికి వారి జీవితం నల్లేరు మీద బండేమీ కాదు. పల్లేరు మీద నడకే. జీవితం పట్ల వారికున్న సంతృప్తి, కృతజ్ఞతా గుణం, సేవా తత్పరత వారి కష్టాలను మైమరపించి పల్లేరు నడకను నల్లేరు మీద బండి చేసేసింది. ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా ఇన్ని సత్కార్యాలను చేసి త్వరలో వజ్రోత్సవం జరుపుకోనున్న నాగరాజ సేవలను మయోపిక్ ప్రభుత్వాలు గుర్తించకపోవడం సర్వసాధారణమే.
పుస్తకం : నా జీవితం నల్లేరు మీద నడక
రచయిత : సాకం నాగరాజ,
పేజీలు : 127, వెల : రూ. 100
ప్రతులకు : 9440331016
సమీక్షకులు
హర్షవర్ధన్, డిప్యూటీ కమిషనర్.
కమర్షియల్ టాక్స్ ( రిటైర్డ్ )
99499 92880






