సత్యం అంతకంటే ప్రియతమమైనది..

by Ravi |   (  Updated:2026-05-04 00:56:35  IST  )

చతుష్కోటి గతితర్కం.. పరంపర -1గా ‘మావో ప్రియతముడే.. సత్యం అంతకంటే ప్రియతమమైనది’ అనే శీర్షికతో వెలువడిన వెన్నెలకంటి రామారావు రాసిన పుస్తకాన్ని ‘స్పైరల్’ పబ్లికేషన్స్, విజయవాడ వాళ్లు ప్రచురించారు.

సత్యం అంతకంటే ప్రియతమమైనది..
X

చతుష్కోటి గతితర్కం.. పరంపర -1గా ‘మావో ప్రియతముడే.. సత్యం అంతకంటే ప్రియతమమైనది’ అనే శీర్షికతో వెలువడిన వెన్నెలకంటి రామారావు రాసిన పుస్తకాన్ని ‘స్పైరల్’ పబ్లికేషన్స్, విజయవాడ వాళ్లు ప్రచురించారు. భారతీయ సమాజంలో సమసమాజ స్థాపన కోసం అవసరమైన విప్లవ పంథాకు షరతుగా కావాల్సిన తాత్విక పూర్వావసరాలపై భిన్న కాలాల్లో చర్చించిన మూడు విభిన్న అంశాలపై తాత్వికంగా చేసిన రచనల సంకలనం ఇది.

ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా వామపక్ష శక్తులు భీకరంగా కొనసాగుతున్న గ్లోబల్ ఆర్థిక సంక్షోభాన్ని విప్లవంగా మలచుకోలేని స్వీయాత్మక దౌర్బల్యంలో కొట్టుమిట్టాడుతున్న తరుణమిది. దేశంలోని సాయుధ, నిరాయుధ వామపక్ష ఉద్యమ ప్రవాహాలు రెండూ విఫలమైన నేపథ్యంలో వచ్చిన పుస్తకమిది. తాజాగా నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యంతో దీర్ఘకాలిక సాయుధ పోరాట పంథాను చేపట్టి, దశాబ్దాలుగా దండకారణ్య ఆదివాసీ ప్రాంతాలకే పరిమితమై, అంతిమంగా తిరోగమించిన మావోయిస్టు పార్టీ ప్రస్థానంపై అనేక సందేహాలు సుడులు తిరుగుతూ, వివిధ చర్చలు, వ్యాఖ్యానాలు, వెటకారాలు స్వీయాత్మక ధోరణిలో ప్రచారంలో ఉన్నాయి. ఇండియా వంటి దక్షిణార్ధ గోళ వ్యవసాయక సమాజాల్లో సమగ్ర సామాజిక మార్పు స్వభావం, గమ్యం, గమనంలోని విలక్షణత, విశిష్టతలను చర్చిస్తూ, అనే ఉద్దేశంతో, రచయిత ఈ పుస్తకం రాశారు.

రెండు కాదు.. నాలుగు విరుద్ధాంశాలు

వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రను రాజకీయ సంఘటనలు, ఎత్తుగడలు వరుస క్రమంగా కాకుండా, సామాజిక చారిత్రక భౌతికవాద స్వీయాత్మక గతితర్కం దృక్కోణంలో విశ్లేషిస్తూ రాయడం జరిగింది. ప్రపంచ (ప్రకృతి, సమాజం) పాదార్థికతను యుగ్మ (బైనరీ-రెండు విరుద్ధాంశాలు) దృక్కోణంతో కాకుండా, చతుర్థ (చతుష్కోటి) దృక్కోణంతో (క్వార్టెనరీ - నాలుగు విరుద్ధాంశాలు) కూడిన తాత్వికతను సంతరించుకుంటేనే భూగోళంపై సమగ్ర సామాజిక విప్లవాలు సంభవించగలవనే అవగాహనతో ‘చతుష్కోటి గతితర్కం’ అనే తాత్విక సిద్ధాంతాన్ని రచయిత నూతనంగా ప్రతిపాదిస్తూ, ‘గతితర్కం పునరావిష్కరణ’ అనే రచన చేశారు. మార్క్స్ మన ముందుంచిన ‘భౌతికవాద గతితర్కం’ అనే తత్వశాస్త్రాన్ని ఇండియా కమ్యూనిస్టు పార్టీలు అర్థం చేసుకోవడంలో లోపభూయిష్టతను, ప్రత్యేకించి దేశంలోని వివిధ ఎంఎల్ పార్టీలు దశాబ్దాలుగా పారాయణం చేస్తున్న మావోయిజంలోని మార్క్సిస్టు తాత్వికత ఎలా ఉందన్న విషయాన్ని ‘మావో ప్రియతముడే.. సత్యం అంతకంటే ప్రియతమమైనది’ అనే స్వీయ స్పష్టీకరణ (సెల్ఫ్ క్లారిఫికేషన్) రచనలో ఈ రచయిత చర్చించడం జరిగింది.

మావోయిజంలో మార్క్సిస్టేతర కాలుష్యం

ఆ క్రమంలో మావోయిజంలోని మార్క్సిస్టేతర స్వీయాత్మక భావవాద కాలుష్యమే ఆ ఉద్యమం విషాదాంత ముగింపుకు కారణమైందని ఆయన వ్యాఖ్యానించారు. ‘దక్షిణార్ధ గోళ వ్యవసాయక సమాజాల్లో రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కేవలం బలప్రయోగ యంత్రాంగంతో కొట్లాడడం వల్ల ప్రయోజనం ఉండదు. అంతకంటే ముఖ్యంగా పాలకవర్గ భావజాలం, సంబంధాలు, వ్యవస్థలు, సంస్థలు వాటిని నియంత్రించే యంత్రాగంతో పోరాడుతూ, ప్రజల్లో ప్రత్యామ్నాయ విప్లవ భావజాల సంస్థల్ని, వ్యవస్థల్ని సంబంధాల్ని నిర్మించడం ద్వారా మాత్రమే రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోగలమన్నది ఒక నిరూపిత సత్యం. ఒక చారిత్రక వస్తుగత చలన నియమం, అని రచయిత చెప్పిన అభిప్రాయంపై విస్తృతంగా చర్చ జరగాల్సి వుంది.

మావో ప్రియతముడే... కానీ..

పుస్తకంలోని మూడు రచనలు ఆద్యంతం తాత్విక తర్కంతో కొనసాగుతుండడంతో సాధారణ పాఠకుడు చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అయితే ఇదివరకెన్నడూ లేని విధంగా కొత్త ప్రతిపాదనలతో వచ్చే రచనల్లోని పరిభాష సాధారణ పాఠకులను కొంత ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ‘మావో ప్రియతముడే..,’ అనే రచన రచయిత తాను విప్లవోద్యమం నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకోసం తాను రాసుకున్న స్వీయ స్పష్టీకరణ పత్రం కాబట్టి, ఆ మేరకు సంక్లిష్టత ఉండడాన్ని అర్థం చేసుకోవచ్చు. అదీకాక ఈ పుస్తకంలో ‘చతుష్కోటి గతితర్కం’ అనే నూతన తాత్విక ప్రతిపాదనను గురించి ప్రస్తావన మాత్రమే ఉంది గాని, దాని విశ్లేషణాత్మక వివరణ పాఠకునికి దొరకదు. ఆ విషయంపై మరొక పుస్తకాన్ని రాస్తానని, అందుకు ఈ సంకలనం ఒక పూర్వరంగం (కర్జెన్ రైజర్)గా మాత్రమే ఉపకరిస్తుందని రచయిత ముందుగానే హెచ్చరించారు.

సవ్యమైన తాత్వికత అవసరం!

ఒక రాజకీయ ఉద్యమం, విప్లవోద్యమం విఫలమైన సందర్భంలో దాని కార్యాచరణ ప్రణాళిక, రాజకీయ కార్యక్రమం అమలు తీరు, సామాజిక వ్యవస్థను గురించిన అంచనాలోని లోపభూయిష్టత ఇలాంటి విషయాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు, ఆ కోణంలో చర్చలు జరుగుతుండడం కద్దు. అయితే పై విషయాలను సవ్యంగా, శాస్త్రీయంగా అంచనా వేసేందుకు సవ్యమైన తాత్వికత అన్నిటి కంటే చాలా ముఖ్యం. అనివార్యమైనది. అందుకోసం పురోగామి శక్తులు తాత్విక దృష్టికోణంలోని లోపభూయిష్టతను మదింపు వేయడం అత్యవసరం. మార్క్సిస్టు (మావోయిస్టు) తత్వశాస్త్రం పుస్తకం చదవగానే, నేర్వగానే ఇక తాత్విక మదింపు అవసరంలేదని, రాజకీయ కార్యక్రమాన్ని సామాజిక వాస్తవాన్ని మాత్రమే అంచనా వేయడంతో సరిపోతుందని వామపక్ష శక్తులు అపోహపడుతుంటాయి.

లెనిన్ పునరధ్యయనం కావాలిప్పుడు..

కానీ, రష్యాలో 1905 నాటి విప్లవం విఫలం అయిన తర్వాత లెనిన్ రాజకీయ కార్యక్రమంలో లోపాలను గుర్తించి సమీక్షించడంపై కేంద్రీకరించడమే కాక, అంతకంటే ముఖ్యంగా ప్లాటో నుంచి మార్క్స్ దాకా తత్వశాస్త్రాన్ని మొత్తంగా మళ్లీ అధ్యయనం చేశాడు. రష్యన్ విప్లవ శక్తుల్లో స్వీయాత్మక భావవాద ధోరణి అయిన నియో పాజిటివిజం (నేడు పోస్ట్ మాడర్నిజం) తాత్విక జాఢ్యం ఎంత లోతుగా వ్యాపించిందో గుర్తించి, దాన్ని పూర్వపక్షం చేస్తూ ‘భౌతికవాదం, అనుభవవాద - విమర్శ’ అనే గ్రంథాన్ని రచించారు.

చతుష్కోటి గతితర్కం విలువ జోడింపు..

నేడు ఇండియా సహా పంచ వామపక్ష శక్తులు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులను అధిగమించాలంటే ద్వి విరుద్ధాంశాలతో కాకుండా, చతుర్థ విరుద్ధాంశాలతో నిర్వహించే ‘చతుష్కోటి గతితర్కం’ అనే దార్శనికతను అనివార్యంగా రూపొందించుకోవలసిన చారిత్రక సందర్భమిది అని రచయిత సూచిస్తున్నారు. ఈ ప్రతిపాదన మార్క్స్ ద్వి విరుద్ధాంశాల భౌతికవాద గతితర్క తత్వశాస్త్రాన్ని అభావం కాదనీ, ఆయన తాత్వికతకు నాలుగు విరుద్ధాంశాల (చతుష్కోటి) గతితర్కం రూపంలో విలువ జోడింపు మాత్రమే అని రచయిత ఉద్ఘాటిస్తున్నారు. మేధావులు, సామాజికోద్యమ పురోగామి శక్తులు వెన్నెలకంటి రామారావు సూచిస్తున్న తాత్వికతపై దృష్టి సారించి మేధో మధనం చేయవలసిన అవసరం ఉంది.

-మాదిరాజు రాంబాబు

94409 01485

Next Story