- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మట్టివాసనల తపించే మానవీయ తీరం
Maneru Teeram Book By Varala Anand Review

మానవీయ సమాజం కోసం మట్టి వేదికగా మనిషి రాసే నిర్మాణాత్మక రచనలు అక్కడక్కడ మిణుకు మిణుకుమనడం వర్తమానం.ఆ సందర్భంలో మెరుపులా తళుక్కుమన్నది సాహిత్య సౌధం. అదే వారాల ఆనంద్ ద్విభాషా రూపసి మన 'మానేరు తీరం' కవిత్వ ఝరి.
సాహిత్యాకాశంలో 25 చుక్కలను చెక్కిన వారాల ఆనంద్,కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డ్ గ్రహీత.ఈ కవిత్వం పెట్రికోరియన్ (Petrichorian)లా అనిపిస్తుంది.పెట్రికోర్ (Petrichor)అనే మాటకు సంబంధించిన విషయాన్ని సూచిస్తుంది. ఇక 'పెట్రికోర్' అంటే పొడి వాతావరణం తర్వాత వర్షం కురిసినప్పుడు కలిగే మట్టి వాసన మరింకా భావోద్వేగ వాతావరణం అని అర్థం.నిజంగా మానేరు తీరం అలానే ధ్వనిస్తుంది.అంటే మట్టివాసన మోసుకొచ్చిందని చెప్పడమే. మానవీయ విలువల కోసం పరితపించే కవిత్వం పంక్తుల నడుమ ఓలలాడుతుంది.
ప్రపంచ వీధుల్లో తెలుగు కవిత్వం
1998లో వచ్చిన మానేరు తీరం తెలుగు కవిత్వం మళ్ళీ 2026 మార్చిలో అదే టైటిల్‌తో ద్విభాష (తెలుగు,ఇంగ్లీషుభాష)ల్లో కవితాత్మకంగా వచ్చి మనసును కొత్తగా తట్టింది. 18 కవితలు తెలుగులో, వెన్వెంటనే 18 ఆంగ్లానువాద కవితలు గొప్ప ప్రయోగం. సాహిత్యంలో ఇది కొత్త కాదు కానీ చదివేవారికి చేరువవుతుంది. ప్రపంచాన్నే ఇంటికి పిలుస్తున్న నేపథ్యంలో మనం ఉన్నాం, గ్లోబలైజేషన్ ప్రభావం అందుకే మన తెలుగు కవిత్వం ప్రపంచ వీధుల్లో తిరిగేలా ఒక గొప్ప ప్రయత్నం.
ప్రవాహంతో మొదలైన కవితలు
స్పందన భావోద్వేగమే కవిత్వం. దాని ఇతివృత్తం, శైలి, లయ, అభివ్యక్తి ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు. ఇందులో సృజన, అనువాదం రెండు ప్రక్రియలు జంట సర్ప పరిష్వంగ కేళిగా ఉండి, ఆలోచనకు అనుభూతికి నిట్టాడులా నిలిచింది. జీవితంలో నిలబడి, దానితో పాటు నడిచిన అడుగులే ఈ కవితలన్నీ అంటే యదార్థమే. ప్రవాహంతో మొదలైన కవితలు బతుకు, మరుపు, విశ్వాసం, ఉదాసీనం, ఒంటరి సమూహం, దూరం,శూన్యం, నటన, కలయిక, మౌనం అలా అలా పరచుకున్నవి కొన్ని మానేరు తీరంపైన.
ఇది నయనాత్మల వ్యాయామమే!
ప్రవాహంలో ఇలా అలల పరుగు నురుగు అందంగా ఆలోచన ఉంది.'ఆవేశకావేశాలు ఉంటాయి. బతుకు పోరాటాలూ ఉంటాయి. అవును నదిలాగే జీవితమూ ఓ ప్రవాహమే' ఎంత గొప్ప భావుకత.లలిత లలిత పద విన్యాసం,లోతైన విస్తృత గాంభీర్యం.ఆటుపోట్ల నదిని పోలినదే బతుకు గీతం.కవిగా ఆనంద్ పరిచయం లేని సాహిత్యకారుడు ఉండరు. కానీ అతని అంతరంగాన్ని అందులోని లోపలి మనిషిని పట్టుకోవడం కొంత గొట్టే. అది నయనాత్మల వ్యాయామమే. దాదాపు మూడు దశాబ్దాలకు ఇంగ్లీషు అనువాదంతోనూ వచ్చిన ద్విభాషా కవిత్వం ఇది. వాస్తవానికి అనువాదం కాదు ఆంగ్లంలోనూ స్వీయ సృజననే తలపించింది. కొన్ని తెలుగు కవితల్ని డామినేట్ చేసినవి కూడా.'అందుకే ఆలోచనకు అంతులేదు. అది ఏ ఒక్కరి సొత్తూ కాదు' అనే మాట శక్తివంతమైన లోకోక్తి.
ఇంగ్లీషులో మచ్చుకు ఒక కవిత
'Union' కవిత... The union of two human beings/ Is a wondrous confluence./ Yes,from the meeting of two minds,/ two thoughts.../ Is born a consciousness/ That can not be replicated. ఒక స్నేహం, ఒక ఆలోచన కలయికలో ఒక సమూహంగా సమాజంగా రూపుచెందిన విలువల మానవీయతే మట్టివాసన అంటే మట్టి మనిషి కలయిక ఎంత గొప్ప ఆలోచనో అర్థం చేసుకోవాలి.
ఇలా ద్విభాషా కవిత్వం ఆలోచింజేస్తుంది. కష్టాలు, కన్నీళ్ళూ, బాధలు, వ్యథలు, చీకటి నిస్పృహ రుగ్మతలను దూరంచేసే సమాజ నిర్మాణాన్ని స్వప్నించమూ అనుభవించడమూ రెండూ ఉన్న కవిత్వం మానేరు తీరం.వారాల ఆనంద్‌కు అభినందనలతో...
-డా.టి.రాధాకృష్ణమాచార్యులు
98493 05871






