పిల్లలు కాదు పిడుగులు అనిపించే బాలలు..

by Ravi |   (  Updated:2026-02-16 00:31:10  IST  )

Little Masters News Paper Book Review

పిల్లలు కాదు పిడుగులు అనిపించే బాలలు..
X

“అందాల బుజ్జాయి ఆనందమూర్తి, అపురూపమై నిలుచు ఆనంద కీర్తి” అన్నట్టుండే బాలలకు మేధో ప్రతిభలు తోడయితే విస్తుపోవడం లోకం వంతవుతుంది. పువ్వు పుట్టగానే పరిమళించిన తీరులో ఘనకార్యాలను సాధించి, అందరికన్నా విభిన్నంగా ప్రవర్తించి, చాలా ఎత్తున నిలిచిన చిన్నారులను చూస్తే ఆనంద పరవశం కలగకమానదు. అలా జరగాలంటే మనం చెయ్యాల్సింది ఒకటుంది. అదేమిటంటే రచయిత , పత్రికా రచయిత, అనువాదకుడు, అధ్యాపకుడు, కాలమిస్ట్ అయిన గోవిందరాజు చక్రధర్ గారి పిల్లల నవల ‘లిటిల్ మాస్టర్స్ న్యూస్ పేపర్’ చదవడమే.

‘పిల్లలు కాదు పిడుగులన్న’ రీతిలో అమోఘమైన కార్యాలతో చిరకీర్తి గడించిన ఘనులైన బాలలు ధ్రువుడు, మార్కండేయుడు, వినాయకుడు, హనుమంతుడు, శంకరాచార్య మొదలైన వారిని మన పురాణాలు చక్కగా పరిచయం చేసినట్టే, ఈ నవలలో ఏడుగురు బాలల్ని అంతే గొప్పగా పరిచయం చేశారు నవలా రచయిత. తొమ్మిదో తరగతి చదివే ఈషాన్, అర్జున్, వివాన్, తేజ, నీల్, నేహ, ఆద్యలు సంవత్సరాంతపు పరీక్షలయ్యాక వేసవి సెలవుల్లో క్రికెట్ ఆడాలనుకుంటారు. ఈషాన్ నానమ్మ ఉమ అయితే “వేసవి ఎండలు ఎక్కువ ఉన్నాయి. వడదెబ్బ తగులుతుంది. ఇంట్లోనే ఉండి ఫ్రెండ్స్‌‌తో కేరమ్స్ లాంటి ఆటలు ఆడుకోమని” అంటుంది. ఈషాన్‌కి అది ఇష్టం లేదు. ఇంకేం చెయ్యాలా? అని ఆలోచిస్తుంటాడు.

పిల్లలతో పత్రిక తీసుకువస్తే..

అప్పుడు రవి తాత ఈషాన్ స్నేహితులందరినీ పిలిస్తే మంచి ఆలోచన చెబుతానని అంటాడు. ఈషాన్ స్నేహితుల్లో అర్జున్ అనే అబ్బాయి తెల్లారకముందే లేచి పేపర్లు పంచుతాడు . వచ్చే ఆదాయంతో కుటుంబానికి సహాయపడతాడు. మిగతా పిల్లలు కూడా చురుకైనవాళ్లే. రవితాత చెప్పినట్టే స్నేహితులను ఇంటికి పిలిచాడు ఈషాన్. వాళ్లలో అర్జున్ కూడ ఉన్నాడు. క్రికెట్ ఆడాలనుకున్న వాళ్లందరితో ‘సమ్మర్ హాలిడేస్‌లో ఎవరూ ఎప్పుడూ చేయని యాక్టివిటీ చెయ్యమని, వాళ్ళంతా కలిపి ఒక పత్రిక తీసుకురావాలని’ చెబుతాడు రవితాత. ఆ మాటల్ని పిల్లలు నమ్మలేకపోతారు. ‘పిల్లలమైన మేము పత్రిక తేవడమా’ అని ఆశ్చర్యపోతారు. వాళ్ళకి ధైర్యం చెప్పి తానే అన్నీ నేర్పిస్తానని, గైడెన్స్ ఇస్తానని పత్రిక తీసుకురావడం వల్ల కలిగే లాభాలు వివరించి ఒప్పిస్తాడు రవితాత.

రచయిత అనుభవమే నవలగా..

ఏదైనా సంఘటన చూస్తే దానిని వార్తగా ఎలా మలచాలో, ప్రముఖ పత్రికలు వార్తల్ని ఎలా సేకరిస్తాయో మొదలైనవి రవితాత చాలా జాగ్రత్తగా విడమరిచి పిల్లలకు చెప్పాడు. వాళ్ల చేతనే పత్రిక ప్రారంభించాడు. ఆ పత్రిక పేరే “లిటిల్ మాస్టర్స్ న్యూస్ పేపర్”. భయపడుతూనే రంగంలోకి దిగిన పిల్లలైతే వాళ్ళకి అప్పగించిన పాత్రల్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహించడం విశేషం. ‘ఇలా జరుగుతుందా చోద్యం కాకపోతే’ అనే సందేహం ఎక్కడా కలగకుండా పాఠకుల్ని తన అక్షరాలతో పరిగెత్తిస్తూ చదివించేలా సహజంగా రాసారు రచయిత. పత్రికా సంపాదకుడిగా రచయితకున్న అనుభవమంతా నవలలో అనేక చోట్ల కనిపిస్తుంది. వార్తా పత్రికల భాష తెలియని వారికి కూడ అర్ధమయ్యేలా సంపుటి, సంచిక, కాలమ్, మాస్ట్ హెడ్, బైలైన్, సీరీస్ వంటి అనేక పదాలను వివరించి చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది.

పిల్లలు చేసే పనులనే రాయించడం..

ఇక పిల్లలైతే రవితాత ఇచ్చిన ప్రోత్సాహంతో తప్పిపోయిన కుక్క పిల్ల గురించి రాసి దాన్ని అసలు యజమానికి చేరవేయడం, చెత్త కుప్పలతో అపరిశుభ్రంగా ఉన్న వీధి గురించి వార్త రాసి బాగుపడేలా చెయ్యడం, నీటి ఆవశ్యకత తెలుపుతూ పొదుపుగా వాడమని వార్తలు రాయడం, కల్తీ నీటితో ఐస్ క్రీం తయారు చేస్తున్న ఐస్ ఫ్యాక్టరీ గురించి వార్త రాసి, ఆ ఫ్యాక్టరీ యజమానిలో మార్పు తీసుకురావడం, పిల్లల బొమ్మల బ్యాంకు ఏర్పాటు చేసి ఎవరి ఇళ్లలోనైనా మూలన పడేసిన బొమ్మలుంటే వాటిని సేకరించి అవసరమైన వారింటికి చేరవేయడం మొదలైనవన్నీ పిల్లలు చెయ్యగలిగేవిగా ఉండడం రచయిత ఆలోచనా శక్తికి నిదర్శనం. పిల్లలు చేయగలిగే పనులనే వాళ్లు చేసినట్టు రాయడం రచయిత పరిశీలనా శక్తికి తార్కాణం.

సెలవుల్లోనూ పత్రికను నిర్వహిస్తే..

అంతేకాదు. గేటెడ్ కమ్యూనిటీలో జరిగే ఎన్నికల్లో మన పిల్లల పత్రికే ప్రముఖ పాత్ర వహించేలా వార్తలు రాయడం కూడ అసహజం అనిపించుకోదు. పిల్లల పత్రిక కోసం శ్రమిస్తున్న ఏడుగురినీ ప్రముఖ పత్రికాఫీసుకు తీసుకువెళ్లడం, అక్కడ పత్రిక పనిచేస్తున్న విధానం తెలుసుకోగలిగేలా చెయ్యడం వెనుక నవలా రచయిత వృత్తి జీవితంలోని అనుభవాలు పాఠకులకు గుర్తు వస్తాయి. వేసవి సెలవులు ముగిసే లోపు పత్రికా నిర్వహణలో పిల్లలు సాధించిన విజయాలతో బాటు ఎదుర్కొన్న సమస్యలను కూడ నవలలో రాసారు రచయిత. సెలవులు ముగియగానే పత్రికను ఆపేసారా? లేక కొనసాగించారా, సెలవుల్లో పత్రిక నిర్వహించిన ఏడుగురుకీ కలిగిన అనుభూతి ఎలాంటిది, ఈ పని చేయడం వల్ల వారికి సంతోషం కలిగిందా? లేక దుఖం మిగిలిందా? వంటి విషయాలకు జవాబు కావాలంటే నవల చదవాల్సిందే.

పిల్లలు తప్పక చదవాల్సిన నవల..

పిల్లలు సొంతంగా ఏదైనా చేస్తే బాగుణ్ణు అనుకునే పెద్దలు, తమ నైపుణ్యం, ప్రతిభ చూపించి కొత్త దారుల్లో నడవాలనుకునే పిల్లలు తప్పకా చదవాల్సిన నవల. ఇంత మంచి పిల్లల సాహస, స్ఫూర్తి దాయక, ప్రయోజనాత్మక నవలను రాసిన రచయిత గోవిందరాజు చక్రధర్‌కి అభినందనలు. అందమైన ముఖచిత్రంతో, నాణ్యమైన ముద్రణలో నవలను ప్రచురించిన ఎమెస్కో బుక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి అభిరుచిని మెచ్చుకుని తీరాల్సిందే. జి. పురుషోత్త్ కుమార్ ముఖచిత్రం ఆకర్షణీయంగా ఉండి ఆకట్టుకుంటుంది.

పుస్తకం: లిటిల్ మాస్టర్స్ న్యూస్ పేపర్

రచయిత: గోవిందరాజు చక్రధర్

పేజీలు: 160, వెల: రూ. 125/

ప్రచురణ: ఎమెస్కో బుక్ ప్రై. లి.

ప్రతులకు: 0866 2436643


సమీక్షకులు

- నారంశెట్టి ఉమామహేశ్వరరావు,

94907 99203

Next Story