దయచేసి ఈ పుస్తకాన్ని ఎవ్వరూ చదవొద్దు...!

by Ravi |   (  Updated:2026-06-01 01:15:36  IST  )

Kadapa Jillaa Abhivrddhi - Atmagauravam Book Review

దయచేసి ఈ పుస్తకాన్ని ఎవ్వరూ చదవొద్దు...!
X

భద్రజీవులు కొన్ని పుస్తకాలు చదవకపోవడం మంచిది. చదివి నాలుగు గోడల మధ్యన ఆవేశపడటం, పెదవి కొరుక్కోవటం, ఫోన్ విసిరేయబోయి దాని ఖరీదు గుర్తుకొచ్చి ఆగటం, చివరగా దుఃఖించడం.. ఈ అవస్థలన్నీ తప్పుతాయి..

సామాజిక మాధ్యమాలలోని ఉద్యమకారులు కూడా కొన్ని విషయాలు చదవకపోవడం ఉత్తమం. చదివి అస్తవ్యస్త సమాజ పోకడలు అరగక కడుపులో తిప్పి తమ తమ మాధ్యమాల నిండా వాంతులు చేసుకోవడం, దాని తుడిచేందుకు జేబులో దాచుకొన్న కులాల పార్టీల జండాలను బయటకు తీయడం, బూతులతో చేతులు కడుక్కోవడం... ఈ బాధలు తప్పుతాయి.

మేధావి వర్గం విశ్లేషించొద్దు!

మేధావి వర్గం కూడా కొన్ని రచనలను విశ్లేషించకపోవడం క్షేమంగా ఉంటుంది. పెద్ద మనుషుల ఒప్పందాలు అమలు కాలేదనో, వాటాల పంపకాలు సరిలేవనో, ఒక ప్రాంతం మాత్రమే బలిసిపోతోందనో బాధపడి వేదిక లెక్కి ఉపన్యాసాలు ఇవ్వడం, వ్యాసాలు రాయటం లాంటి బాధ్యతల్ని పూర్తి చేసి, సమాజమంతా తమ ఆలోచనల వెంట రాలేదని బాధపడటం తప్పుతుంది. పత్రికలు కూడా కొన్ని పుస్తకాల సమీక్షలు ప్రచురించకుండా ఉండటం ఆరోగ్యకరం. సదరు పుస్తకాల్లో రాసిన అన్యాయాలు ఎంతకాలం నుంచో తమకు కనిపిస్తున్నా పట్టించుకోని తమ గుడ్డిదనాన్ని తామే బైట పెట్టుకున్నట్లు ఉంటుంది. వివక్షకేసి గురి చూడాల్సిన తమ చూపుడు వేలును తామే మడిచిపెట్టుకొన్న పక్షవాత జబ్బును నలుగురికి చూపెట్టుకొన్నట్లుంటుంది.

కడపోళ్లు చదవొద్దు.. ఏడుస్తారు!

అలాంటి పుస్తకం ఒకటి ఉంది. దాని పేరు 'కడప జిల్లా అభివృద్ధి - ఆత్మ గౌరవం'. 'రాయలసీమ ఉమ్మడి ప్రయోజనాలకే కాదు.. సీమలోని ఏ ఒక్క ప్రాంత ప్రయోజనాల కైనా విఘాతం కలిగించే ఏ చర్యనైనా ప్రతిఘటించడం అత్యవసరం' అన్న కడప కోటిరెడ్డి, మాసీమ రాజగోపాల్ రెడ్డిల నుంచి స్ఫూర్తి పొంది రాశానని చెప్పుకొన్న త్రివిక్రమ్ రచన ఇది. దయచేసి ఈ పుస్తకాన్ని కడప జిల్లా వాళ్ళు ఎవ్వరూ చదవొద్దు. వందేళ్లకు పైగా విశాల భూభాగానికి కేంద్రంగా ఉన్న కడప జిల్లా ఇప్పుడు పిడికెడు నేలకు ప్రతినిధిగా బిక్కచచ్చిపోయి ఎందుకుందో అర్థమయి ఏడుస్తారు.

ఖనిజ సంపదల జిల్లా.. కానీ లూటీ

భూగర్భ గనుల ద్వారా అన్ని జిల్లాల కంటే ఎక్కువ ఖనిజ సంపద కలిగి, భూమిని పగలగొట్టుకొని ఆదాయాన్ని రాష్ట్రానికి అందించి, ఆ గాయాన్ని చూసుకొంటూ నోట్లో వేలు పెట్టుకొని చప్పరిస్తూ ఆకలితో చావటం చూసి రోదిస్తారు. మొట్టమొదటి విమానాశ్రయం ఏర్పడి కూడా విమానాలను ఎగరనీయకుండా చేసిన ప్రభుత్వ వివక్షపూరిత విధానాల పట్ల కోపంతో పెదవి కొరుక్కొంటారు. పత్రికలు సినిమాల ద్వారా ఒక ప్రణాళిక ప్రకారం ఇక్కడంతా ఫ్యాక్షన్ గొడవల అశాంతి రగులుతున్నట్టుగా చూపించి, పెట్టుబడిదారులు రావడానికి భయపడుతున్నారని నికృష్టమైన నిందలు వేసి ఒక్క పరిశ్రమ కూడా నిర్మించకుండా జనాన్నంతా ఉపాధి హామీ కూలీలుగా మార్చిన విషయం తెలుసుకుని దుఃఖిస్తారు.

అత్యంత వెనుకబడిన జిల్లా.. కారణం

నీతి అయోగ్ సర్వే ప్రకారం దేశంలో అత్యంత వెనుకబడిన 112 జిల్లాల్లో కడప ఒకటి. ఎందుకు వెనకబడింది అత్యల్ప జనసాంద్రత ఉంది, దళితుల కంటే సవర్ణ జనాభా ఎక్కువగా ఉంది, సహజ వనరులు అధికంగా ఉన్నాయి. మరి వెనక పడడానికి కారణం ఏమిటి ఆ విషయాల్ని పుస్తకమంతా చర్చించాడు త్రివిక్రమ్. సౌమ్యంగా చెప్పడానికి ప్రయత్నించాడు. గణాంకాలతో సహా వివరించాడు. ఇతర ప్రాంతాల వల్లే కాకుండా ఇరుగుపొరుగు జిల్లాల వల్ల కూడా కడపకు జరిగిన నష్టాన్ని చెబుతూ ఒక్కోసారి ఆవేశపడ్డాడు. అక్కడక్కడ నాలుక కూడా అదుపుతప్పింది. ఆయనే కాదు పుస్తకం చదివిన కడప జిల్లా వాసి ఎవరికైనా కడుపు మండుతుంది. రాజకీయ నాయకుల మీద కోపం కలుగుతుంది. ఇన్నేళ్లుగా ఈ జిల్లాను వివక్షాపూరితంగా కావలసే తొక్కిపడేసిన ప్రభుత్వాల మీద కళ్ళెర్ర జేస్తారు.

ఫ్యాక్షనిస్టుల పేరుతో వంచించారు..

ఎంత వివక్ష చూపించాయనీ ప్రభుత్వాలు! ఎంత చేతగానితనంతో చూస్తుండి పోయారనీ ఇక్కడి ప్రజాప్రతినిధులు! నోటికాడి కూడు లాక్కుపోతుంటే చూస్తూండి పోయారు. 'కూలోనికి కూడా మగ పిల్లోడా' అన్నట్లు, ఏవైనా ఫ్యాక్టరీలో కాలేజీలో హాస్పిటల్లో మంజూరైతే అటు కోస్తావాళ్ళో ఇటు రాయలసీమలోనే పక్క జిల్లాల వాళ్లో తరలించుకపోయారు. ప్రజలు ప్రశ్నిస్తే 'మీ నాయకులు ఫ్యాక్షనిస్టులు, అందుకే పెట్టుబడులు రాలేదు' అంటారు. నీళ్లను అడుక్కోవాలి. రోడ్లను అడుక్కోవాలి. ట్రైన్ మార్గాలు కడుక్కోవాలి. విద్యా వైద్యాలయాలను అడుక్కోవాల్సిందే. ఎంత దేబిరించినా ఇక్కడ మీసాల పులులని బూచోళ్ళలా చూపించి ఉత్త చేతులు ఊపుతారు. ఎలక్షన్లు వచ్చేసరికి మళ్ళీ వాళ్లకు ఈ బూచోల్లే కావాల్సి వస్తది.

ఎటు చూసినా వలసబతుకే..

పల్లెలు ఖాళీ అవుతున్నాయి చదువుకొనే పిల్లలకు విద్యాలయాలు ఇక్కడ ఉండవు, వలస పోవాలి. చదువు పూర్తి అయితే ఉద్యోగాలు ఇక్కడుండవు, పక్క రాష్ట్రాలకు వలస పోవాలి. రోగాలు వచ్చిన మనుషులకు వైద్యశాలలు ఇక్కడుండవు, వలస పోవాలి. మిరప పండిస్తారు, దాన్ని అమ్ముకొనేందుకు గుంటూరు మార్కెట్‌కు వెళ్లాలి. పసుపు పండిస్తారు, దుగ్గిరాల మార్కెట్‌కి వెళ్ళాలి. చీనీకాయలు పండిస్తే నాగపూర్.. అరటి, జామ, ఏమి పండించినా ఎక్కడో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాలి. ఆధునిక యుగంలో కూడా వలస జీవితం తప్పడం లేదు.

యూనివర్సిటీ చేయాల్సిన పనిని ఒంటిచేత్తో..

ఇదంతా నేల దుఃఖమే. పుస్తకం నిండా ఈ దుఃఖానికి కారణాలు వెతకడం కనిపిస్తుంది. ఎన్ని వివరాలు సేకరించాడనీ రచయిత. ఒక యూనివర్శిటీ చేయాల్సిన పనిని ఒంటి చేత్తో చేశాడు. పాలకుల నిర్లక్ష్యం వల్ల ఒక ప్రాంతం క్రమేణా కన్నీటి బిందువుగా మారిపోయిన క్రమాన్ని నిజాయితీగా ఆవిష్కరించాడు. ప్రకృతి పరంగా వచ్చే కరువులనైతే ఆధునిక సాంకేతికత వల్ల ఎదుర్కోవచ్చు. పాలకుల సమదృష్టిలో కరువు ఏర్పడితే దాన్ని అధిగమించడం అసాధ్యం.

స్థానికులను మండించే నిజాలు..

కడప జిల్లా వాళ్లు ఈ పుస్తకాన్ని చదివితే కుదురుగా ఉండలేరు. ఆవేశపడకుండా నిలబడలేరు. ఒళ్లంతా కోపంతో పదరుతుంది. నాలుక మర్యాదకరమైన భాషను మరుస్తుంది. గొడవల్ని తెస్తుంది. అందుకే నా సలహా ఈ పుస్తకం చదవొద్దని. ప్రచురించి నాలుగు నెలలైనా 40 కాపీలు అమ్ముడు పోలేదట. పుస్తకాన్ని గురించి అందరికీ తెలిసినట్టు లేదు. తెలియకపోవటమే మంచిది. తమ ప్రాంత దుర్భిక్షానికి కారణం తెలుసుకోవడం, కోపంతో పళ్ళు కొరకటం, కారకులను బండ బూతులు తిట్టడం, జైళ్ళపాలవటం.. ఇవన్నీ అవసరమా కడప జిల్లా మిత్రులారా... ఈ పుస్తకాన్ని చదవకండి...

పుస్తకం: కడపజిల్లా అభివృద్ధి - ఆత్మగౌరవం

రచయిత: త్రివిక్రమ్ జి.

పేజీలు: 352

వెల: రూ. 350 (డిస్కౌంట్ ధరతో)

ప్రతులకు: 9901065406


సమీక్షకులు

-సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

94412 87865

Next Story