ఆదివాసీల అస్తిత్వంలో.. ఇప్ప పువ్వు మూలాధారం

by Muthe.Rajitha |   (  Updated:2025-04-17 12:20:40  IST  )

భారత దేశ ఆదిమ తెగల పకృతి జీవనం లో ఒక చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకున్న వృక్షం ఇప్ప చెట్టు.

ఆదివాసీల అస్తిత్వంలో.. ఇప్ప పువ్వు మూలాధారం
X

దిశ, వెబ్ డెస్క్ : భారత దేశ ఆదిమ తెగల పకృతి జీవనం లో ఒక చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకున్న వృక్షం ఇప్ప చెట్టు. అందుకే అదిలాబాద్ ఇప్ప పువ్వు లడ్డులను “మన్ కి బాత్” కార్యక్రమంలో కూడ స్వయాన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇప్ప పువ్వు యొక్క పోషకాలు ఆహార పద్ధతిపై గొప్పగా చెప్పారు. ఉట్నూర్ గోండు మహిళల కృషినీ కొనియాడారు. ఈ క్రమంలో ఈ పువ్వు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివాసీల ప్రధాన ఆహారపు అలవాట్ల లో ఇప్ప పువ్వు ప్రధానమైనది.

ఒకానొక సందర్భంలో కరువు కాటకాలు సంభవించినపుడు ఆదివాసీ జాతికి అనేక రకాల ఆహార ఉత్పత్తులను ఇప్పచెట్టు అందించి బతికించింది అని చెప్తారు గూడెం పెద్దలు. అందుకే ఆదివాసీల ఆరాధ్య దైవంగా నేడు ఇప్ప చెట్టు ఉంది. తమ సాంస్కృతిక జీవనంలో ఇది లేకుండా పండుగలు జాతరలు జరగవు. భౌగోళిక దక్కన్ పీఠభూమిలో చోటా నాగపూర్, సెంట్రల్ హైలాండ్ పీఠభూమిలో ఆ భూమి సారానికి అనుగుణంగా ఇప్పచెట్టు తన రూపం మార్చుకుంటుంది కానీ దానిని ఉపయోగించటంలో మాత్రం ఒకే విధానాలు అవలంబిస్తారు. లేత పసుపు రంగులో ఎర్రని రెమ్మలతో మాఘ పున్నమిలో కొమ్మలకు కోలు వేసి కాముని పున్నమి వరకు పువ్వు వికసించే ఒక అందమైన పరిమళం ఇది.

700 తెగల జీవనాధారం ఇప్ప చెట్టు

కోల్ కోయ, గోండు, కొలాం, బైగా, సంతాల్, ముండా, ఒరాన్, చెంచు, బిల్ లాంటి 700 రకాల తెగలు ఆటవిపై పకృతి ఫల సహాయంపై ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. వీరందరికీ పూర్వం జీవన ఆధారం ఇప్పచెట్టు ఇవి నల్లరేగడి, ఇసుక నెలలు ఉన్న అటవీభూములలో అత్యధికంగా ఉంటాయి దీని సేకరణ ఉమ్మడి జీవన కలయికలో ఉంటుంది. గూడెం మొత్తం స్త్రీ పురుషులు తెల్లవారు జామున కోడి కూత నిద్రలేచి గంప(బుట్ట)పట్టుకొని అనిగా(సొరక) బుర్రలో నిలుపోసుకొని ఒక సమూహంగా ఆటవికి బయలుదేరి వెళతారు. అటవీ జంతువులు పశువులు ఇప్ప పూలను ఇష్టంగా తింటాయి అందుకే అవి రాక ముందే సమూహం నుండి చిన్న చిన్న గుంపులుగా విడిపోయి చీకట్లోనే వెళతారు.

ఇప్పపూల సేకరణ

అప్పటికే చెట్టు కింద పడిన పూలను ఏరడం జరుగుతుంది. క్రూర మృగాల దాడులు జరుగుతాయి కాబట్టి అందరు కూడ కనుచూపు మేరలోనే కేకలు పెట్టుకుంటూ ఇప్ప పూలని సేకరించడం జరుగుతుంది ఇలా సంవత్సరంకి సరిపడా పూలను ఒక నెల రోజుల పాటు సేకరిస్తారు బుట్టలో ఇంటికి తీసుకు వచ్చి వెంటనే వాకిట్లో ఆరబోస్తున్నారు, అలా 20 నుండి 30 రోజుల పాటు ఎండలో ఆరబోసిన వాటిని మళ్లీ బుట్టలోకి తీసుకున్న తర్వాత అడవికి వెళ్లి పెద్ద తునికాకులు సేకరించి ఇస్తారి ఆకు కుట్టి జల్ల గానీ గంపలు గానీ తీసుకొని వాటి లోపల ఇస్తార్లు కుట్టిన ఆకులను పరిచి ఎండ పెట్టిన ఇప్ప పువ్వులను గంపలో వేసి తొక్కుతారు సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి. దీనికి గాలి, నీరు తగలకుండా భద్రపరుస్తారు.

ఇప్పపూలతో వర్షం అంచనా

వర్ష కాలంలో వాతావరణం అంచనా వెయ్యడం కోసం ఇప్ప పూలను ఉపయోగిస్తారు సాంప్రదాయ బద్ధంగా మాఘ పున్నమిలో గ్రామ పెద్దలు పూజారులు ( వడ్డే) లు స్నానం చేసి ఇప్ప చెట్టుకి పసుపు కుంకుమ పెట్టి మొక్కి చెట్టు పైకి ఎక్కి మండలకు ఉన్న ఇప్ప మొగ్గలను ఒకదగ్గరుకు అని తెల్ల గుడ్డతో కోలు కడుతారు. మళ్ళీ ఏప్రిల్ నెలలో వాటిని చెట్టు పైకి ఎక్కి తీసుకు వచ్చి దేవుని గుడి లోపెట్టి రోహిణి కార్తె‌లో భూమి పండుగ రోజు లేదా వేల్పు జాతర తరువాత ఆ ఇప్ప పూలను ఒక పీట ముగ్గు వేసి దానిపై ఒక కొత్త కుండ పెట్టి అందులో గంగా నీరు పోసి 12 కార్తులకు 24 పాదాలు దానికి 24 పూలు తీసి కార్తీకి రెండు చొప్పున కుండ నీటిలో కార్తీ పేరు చదువుతూ వేస్తారు. పువ్వు మునిగితే ఆ కార్తె లో వర్షం ఉందని, తేలితే ఆ కార్తెలో వర్షం లేదు అని కాలాన్ని ముందుగానే అంచనా వేసి తెలుసుకోవడం జరుగుతుంది. దానిని బట్టి వర్షాధార పంటనా లేక మెట్ట పంటనా ఏది వేయాలని నిర్ధారణకు వస్తారు అదివాసులు.

ఇప్పపువ్వు కుడుములు

అంటే ఇప్ప పువ్వ లడ్డూలు కూడ ఇడ్లిల వలె చేస్తారు. ఇప్ప పువ్వులను కుడుములు చేయటానికి కొన్ని తీస్కొని పొయ్యి మీద కుండ పెట్టి సరిపడ నీళ్లు పోసి మధ్యలో వెదురు పుల్లలు పెట్టీ వాటిపై ఇప్పపూలు, తెల్ల జొన్నల గడక కలిపి ముద్దలు చేసి గుడ్డ పరిచి వాటి పై పెడుతారు అలా ఆవిరికి ఉడికి ఇప్ప పూల లడ్డు తయారు అవుతుంది. దాన్ని ఆహారంగా తింటారు.

ఇప్ప నూనె

ఇప్ప గింజల నుండి నూనెను ఉత్పత్తి చేస్తారు ఆదివాసులు. జూన్ నెలలో ఇప్పకాయలు సేకరించి పలుకుల తీస్తారు అవి ఎండిన తర్వాత రోట్లో వేసి దంచి పిండిలా చేసి ఆ పిండిని కుండలో వేసి ఉడకబెడతారు. రెండు గంటల సమయం ఉడికిన తర్వాత దాన్ని తీసి వేడిగా ఉన్నప్పుడే తాటి ఆకుల బుట్టలో గట్టిగా కూరుస్తూ ఈ బుట్టలను గానుగ మొద్దులో పెట్టి నూనె ఉత్పత్తి చేస్తారు ఇది ప్రాచీన పద్ధతి.

ఇప్ప పువ్వుతో రొట్టెలు

ఇప్ప పువ్వుతో రొట్టెలు కూడా చేస్తారు. తెల్లజొన్నలను తీసుకొని ఒక అటికలో పెట్టి ఇప్ప పువ్వులను అందులో వేసి నీళ్ళు పోసి ఉడకపెట్టి రుబ్బు బండ పైన వేసి మెత్తగా రుబ్బి ఆ ముద్దను ఒక అటికలో వేసుకుని పిండిలో ఉప్పు కలిపి పొయ్యి మీద పెంక పెట్టి వేడయ్యాక అందులో నూనె లేదా నెయ్యి వేసి ఒక ఆకు పైన రొట్టె లాగ అద్ది పెంక పైన వేసి రెండు వైపుల కాల్చి చేస్తారు.

ఇప్పపువ్వు సారా

ఆదివాసి జీవనంలో ఇప్పపువ్వు సారా అతి ప్రాచీనమైనది, ప్రధానమైనది, అతి పవిత్రమైనది కూడ. ఈ సారాని సేవించడం ద్వార మానవునిలో రోగనిరోధకశక్తిని మెరుగు పరుస్తుంది. అందుకే దీనిని స్త్రీ, పురుషులు, చిన్నపిల్లలనే తేడా లేకుండ సేవిస్తారు. ప్రధానంగా పండుగలు సమ్మక్క సారలమ్మ ఇలవేల్పు జాతరలు, పెళ్లిళ్లు, దిన కార్యాలు ఉమ్మడిగా నిర్వహించే ప్రతి కార్యక్రమంలో ఉమ్మడిగా సేవిస్తారు. ఇప్పపువ్వులను కుండలో 9 రోజులు నానబెట్టి కుండపై చిన్న కుండ పెట్టి ఆవిరి ద్వారా సార తీస్తారు. ఇలా 30 రకాల ఆదివాసీల ఆహారపు అలవాట్లకు కడుపు నింపటానికి ఒక ఆధారం అయింది ఇప్ప పువ్వు.

గణేష్ కోర్నిబెల్లి

సమ్మక్క సారలమ్మ ఆర్కీయాలజి ఇండిజినస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్,

తెలంగాణ

94932 60760

Next Story