భూటాన్‌లో వేడి నీటి తొట్టె స్నానం మహానుభూతి - 4వ భాగం

by Muthe.Rajitha |   (  Updated:2025-07-15 16:29:48  IST  )

భూటాన్ ప్రజలు ఎంత దయాహృదయులో నేను స్వానుభవంతో తెలుసుకున్నాను.

భూటాన్‌లో వేడి నీటి తొట్టె స్నానం మహానుభూతి - 4వ భాగం
X

భూటాన్ ప్రజలు దయాహృదయులు

భూటాన్ ప్రజలు ఎంత దయాహృదయులో నేను స్వానుభవంతో తెలుసుకున్నాను. నేను కిందికి దిగిన చోటనే నా ఫ్రెండ్స్ రాక కోసం అక్కడ కూర్చున్నాను. అప్పటికే దారిన పోతున్నవాళ్ళు ఒంటరిగా ఎందుకు కూర్చున్నారు? అని ప్రశ్నిస్తూ అది శ్రేయస్కరం కాదని హెచ్చరించారు. అప్పటికే ఐదు పది నిమిషాలు గడిచి పోయాయి. ఇంక నేను కూడా అటుగా వచ్చిన కుటుంబం హెచ్చరించడంతో వాళ్ళతో కలిసి నడక మొదలు పెట్టాను. మధ్యలో జలపాతం దగ్గర ఫొటోలు తీసుకొని ముందుకు సాగాము. ఆ కుటుంబం ఒరిస్సా నుంచి వచ్చిందట. అలా నేను బస్ లోకి వెళ్ళి కూర్చున్నాక పది నిమిషాలకు మా స్నేహితులు కూడా వచ్చారు. వాళ్ళకు కూడా ఒక స్థానిక నేపాలీ యువకుడు సహాయం చేసాడట. మేం వెళ్ళేసరికి కొందరు బస్‌లో ఉన్నారు. ఆ బస్‌కు సంబంధించిన వాళ్ళు అందరూ వచ్చాక డ్రైవర్‌ను బస్ తీయమన్నాము. కానీ గైడ్ లేకుండా పర్యాటకుల బస్సు నడపడానికి భూటాన్ రూల్స్ అంగీకరించవని డ్రైవర్ దుర్గా ఖాత్రా చెప్పడంలో మా గైడ్ సోనాల్ వచ్చేదాకా ఎదురు చూడక తప్పలేదు.

హోటల్ చేరేసరికి సుమారు మూడు గంటలైంది. లంచ్ చేసి గదిలోకి వెళ్ళి గంటన్నర విశ్రాంతి తీసుకున్నాం. సాయంత్రం ఐదుగంటలకు హోటల్ లాబీలో కలుసుకొని, వేడి రాతి నీటి స్నానం (Hot Stone bath) కోసం డబ్బులు కట్టిన వాళ్ళందరం ఒక బస్‌లో బయలుదేరాం. ఐదున్నరకల్లా అక్కడికి చేరుకున్నాం. ఒక్కరికి రెండు వేలు. కానీ మేము గ్రూప్‌గా వెళ్ళినందువల్ల మా ఆర్గనైజర్ లక్ష్మి మాట్లాడి ప్రత్యేక రాయితీ ఇప్పించింది. అందువల్ల మేం ఒక్కొక్కరికి పన్నెండు వందల రూపాయలు చెల్లించాము. టీ, కాఫీలతో స్వాగతించారు. జంటలు, స్త్రీ, పురుషులకు విడి విడి ఏర్పాట్లున్నాయి.

వేడి రాతి నీటి తొట్టి (Hot stone bath) స్నానం

దీనిని స్థానికంగా ' దోత్షో ' అంటారు. భూటాన్ సాంప్రదాయ వైద్య పద్ధతులలో అత్యంత ప్రాచుర్యం పొందింది. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ దానిని అనుభవించి తీరాలి. స్థానిక నదులలో లభించే రాళ్ళను బహిరంగ ప్రదేశంలో నిప్పుల మీద వేడి చేసి, లోపల అమర్చిన చెక్కతొట్టిలోకి ఆ రాళ్ళ మీదుగా నీటిని వదులుతారు. అప్పుడు సుయ్c మనే వింత శబ్దం భలేగా ఉంటుంది. తొట్టి నీళ్ళలో వైద్య ప్రయోజనాలున్న ఔషధ మూలికలను వేస్తారు. అవి సువాసనతో ఉంటాయి. తొట్టిలో మనకు సరిపడినంత వేడిగా నీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. తొట్టిలో నీళ్ళు చల్లారితే తొట్టి నెంబర్ చెప్పి వేడి కావాలని అడిగితే అవతలి వైపున్న వ్యక్తి మళ్ళీ వేడి చేసిన రాళ్ళ పైనుంచి నీటిని తొట్టిలోకి వదులుతాడు. బాత్ టబ్స్‌కు 1,2,3 ఇలా వరుసగా నెంబర్లుంటాయి. ఆ వేడి రాతి స్నానం ఒక గంటపాటు వుంటుంది. డీహైడ్రేషన్ కాకుండా అప్పుడప్పుడు మంచినీళ్ళు తాగడం తప్పనిసరి. ముందుగా మగవాళ్ళు వెళ్ళారు. తర్వాత జంటలుగా ఉన్నవాళ్ళు వెళ్ళారు. చివరగా మిగిలిపోయింది మేం ఐదుగురు ఆడవాళ్ళం మాత్రమే. చాలా ఆలస్యం అవుతున్న కొద్దీ చికాకు వేసిన మాట నిజమే.. ఒకానొక దశలో డబ్బులు వాపస్ తీసుకొని వెళ్లిపోవాలను కున్నాం. కానీ అలా వెళ్ళి వుంటే ఆ ప్రత్యేకమైన అనుభవాన్ని కోల్పోయి ఉండేదాన్ని. మా అందరిదీ పూర్తయ్యే సరికి రాత్రి తొమ్మిది అయింది. మా బృందంలో మాదే ఆఖరు బ్యాచ్. ట్రెక్ వల్ల వచ్చిన అలసట, ఒళ్ళు నొప్పులు అన్నీ పోయి శరీరం తేలిక పడింది. ఎంతో హాయిగా అనిపించింది. హోటలుకు వెళ్ళి డిన్నర్ ముగించి, గదికి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోయాను.

బస్ కూడా అలిసిపోయిన వేళ

మర్నాడు ఉదయం అల్పాహారం ముగించి తొమ్మిది గంటలకు పారో నుంచి జలదాపారాకు తిరుగు ప్రయాణమయ్యాము. సుమారు 170 కిలోమీటర్ల దూరం. ఆరుగంటల ప్రయాణం. భారతసైన్యం ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టిన వార్తలు తెలుస్తున్నాయి. ఢిల్లీ, కలకత్తా విమానాశ్రయాలు కొన్ని విమానాలను రద్దుచేసినట్లు ప్రకటించాయి. ఆ ముచ్చట్లలో ఉండగానే ఒక దగ్గర బస్‌లో పొగ కమ్ముకొని ఆగిపోయింది. యుద్ధ వార్తలకు తోడు ఇదొక టెన్షన్. పర్వతాలు ఎక్కీ ఎక్కి బస్ పాపం అలసిపోయినట్లుంది. వీటన్నింటికీ తోడు మధ్యే మార్గంలో పొగమంచు దట్టంగా కమ్ముకొని అసలు దారి కనిపించలేదు. ఎలాగైతేనేం అన్ని ఇబ్బందులను దాటుకొని జయగావ్ చేరుకున్నాం. ఇమ్మిగ్రేషన్ కార్యక్రమం ముగించి, లంచ్ చేసాం. అక్కడినుంచి జిలదాపారా నేషనల్ పార్కుకు వెళ్ళేవాళ్ళు ఒక వాహనంలో వెళ్ళిపోయారు. మేం ఆరుగురం జలదాపారా బయలుదేరాం. గంటన్నర ప్రయాణం. హోటల్ డైమండ్ ప్లాజాలో మాకు కేటాయించిన గదిలోకి వెళ్ళాను. అది చిన్న రిసార్టు లాంటిది. నేషనల్ పార్కులు చాలా వరకు చూసి వుండడం, అప్పటికే ప్రవేశ రుసుము చాలా చెల్లించి వుండడం, (జలదాపారా నేషనల్ పార్కు ప్రవేశ రుసుము ₹950/. )

అన్నింటికీ మించి ఆరోగ్యం బాగాలేనందువల్ల నేను నేషనల్ పార్కుకు వెళ్ళలేదు. yhai కార్యక్రమం ఆ రోజు ఆఖరు కావడం వల్ల రాత్రి డిన్నర్ తర్వాత సమావేశం ఏర్పాటు చేసి, సర్టిఫికెట్స్ ఇచ్చారట. విహంగ వైస్ ప్రసిడెంట్‌గా నేను అప్పుడు టూర్ గురించి మాట్లాడాలి. కానీ నా ఆరోగ్యరీత్యా నేను ఆ మీటింగ్‌కు వెళ్ళలేదు. ఆ రాత్రి నా ఆరోగ్యానికి సంబంధించి ఆర్గనైజర్ లక్ష్మి, మా బృందంలోని డాక్టర్, స్నేహితులు తీసుకున్న జాగ్రత్త నేను ఎప్పటికీ మరువలేను.

ట్రాఫిక్ సెన్సుకి మారుపేరు భూటాన్

భూటాన్ అందమైన దేశం. సంతోషకరమైన దేశం. రూల్స్, ప్రత్యేకించి ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటిస్తున్న దేశం. ప్రభుత్వ విధులలో ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళ సాంప్రదాయిక డ్రెస్ ధరిస్తారు. ఆ డ్రెస్ మీద తప్పకుండా వాళ్ళ ప్రస్తుత రాజు ఫోటో వుంటుంది. మార్కెట్లో, షాపులలో, కూడళ్లలో రాజు, రాజ కుటుంబం ఫోటోలు కనిపిస్తాయి. ఇదంతా భయంతో కాదు. తమ రాజుపై వున్నగౌరవంతో, ప్రేమతో.. అలాంటి పాలకులు దొరకడం ఆ దేశ ప్రజల అదృష్టం. అదృష్టమనే దానిని నమ్మినా నమ్మక పోయినా ఆ దేశ పాలకుడి నిస్వార్థ గుణమని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. దేశం పర్యాటక రంగం పైనే ఆధారపడినా ప్రవేశ రుసుములు మాత్రం వేలల్లో వున్నాయి. నిత్యావసర వస్తువులతోపాటు ఇతర వస్తువులు కూడా ఖరీదు ఎక్కువే.. మా బస్ స్థానిక మార్కెట్లో ఆగినప్పుడు కొంటే ఒక మొక్కజొన్న కంకి అరవై రూపాయలు. టీ యాభై రూపాయలకు తక్కువ లేదు. రోడ్ల మీద సామాన్య ప్రజలను పరిశీలించినప్పుడు.. పాన్ పరాగ్, గుట్కా, సిగరెట్ లాంటి అలవాట్లు చాలానే వున్నట్లు తెలిసింది. స్త్రీలు కూడా మగవాళ్ళతో సమానంగా కష్టపడుతున్నారు. స్థానిక మార్కెట్లలో, షాపులలో స్త్రీలే ఎక్కువగా కనిపించారు. గైడ్‌లుగా కూడా అమ్మాయిలున్నారు. రోడ్లు పరిశుభ్రంగానే కనిపించాయి. బార్డర్ గ్రామం జయగావ్ లో చెత్తా చెదారం కావలసినంత కనిపించింది. మా గైడ్ సోనాల్ లాంటి కొద్దిమందిలో కాస్త చిరాకు, కోపం కూడా కనిపించాయి. ఇప్పుడిప్పుడే మొదలవుతున్న ఇలాంటివారి వల్ల ఆ దేశ ప్రతిష్ఠ దెబ్బతింటుందేమో అనిపించింది.

భూటాన్ ట్రిప్ మొత్తం ఖర్చు రూ.60,000లు

Yhai వాళ్ళ ప్యాకేజీ ₹29999/. ఉదయం ఆల్ఫాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం. స్నాక్స్, మంచినీళ్ళు, టీ, లోకల్ బస్, గైడ్, వసతి ఏర్పాటు అన్నీ అందులోనే ఉన్నాయి. ప్రయాణ ఖర్చులు, ప్రవేశ రుసుములు అదనం. ప్రయాణ ఖర్చులు మనం ఎంచుకున్న పద్ధతులమీద ఆధారపడి వుంటాయి. నేను విమానంలో ప్రయాణించాను. భూటాన్ ట్రిప్ వరకు అన్నీ కలిపి ₹60000/. ఖర్చు అయింది. అదనంగా ఒకరోజు వున్నందుకు మరో ₹2000/. అయింది. భూటాన్ ప్రయాణానికి నాకైన ఖర్చు ఎక్కువేమీ కాదని నా అభిప్రాయం.

నక్సల్బరీ గ్రామం వెళ్లాల్సిందే

ఇంతకుముందు బాగ్ దోగ్రా దాకా రెండుసార్లు వెళ్ళినా నక్సల్బరీ గ్రామం వెళ్ళడానికి వీలుకాలేదు. ఈసారి తప్పకుండా వెళ్లాలనే ఉద్దేశంతో ఒకరోజు అందుకు కేటాయించాము. కానీ ఉదయం లేచేసరికి ఇండియా పాకిస్తాన్ యుద్ధ వార్తలు రకరకాలుగా వినిపిస్తున్నాయి. ఢిల్లీ, కలకత్తా విమానాశ్రయాలు కొన్ని విమాన సర్వీసులను రద్దు చేసాయి. మేమున్నది కూడా దాదాపు దేశ సరిహద్దు ప్రాంతంలోనే.. మా బృందంలోని జ్యోతి, ఈశ్వరి కలకత్తానుంచి తొమ్మిదో తేదీన ఉన్న వాళ్ళ విమాన టికెట్లను రద్దుచేసుకొని మే ఎనిమిదోతేదీ ఉదయానికి మళ్ళీ టికెట్లు బుక్ చేసుకున్నారు. అందరూ హడావిడిగా వెళ్ళిపోయారు. మేం ముగ్గురం మాత్రమే తొమ్మిదో తేదీన హైదరాబాదుకు రావాలి. ఏ క్షణంలో ఏ విమాన సర్వీసులు రద్దవుతాయో తెలియని ఉద్విగ్నమైన పరిస్థితి. మా ప్రణాళిక ప్రకారం రచయిత్రి మౌమితాఆలంను కలవడం, నక్సల్బరీ గ్రామానికి వెళ్ళడం మేం అదనంగా పెట్టుకున్న ఎనిమిదో తేదీన చేయాలి.

సిలిగురిలో మౌమితా ఆలంతో భేటీ...

విమాన టికెట్లు మార్చుకునే అవకాశం లేదు. టికెట్ ధరలు విపరీతంగా వున్నాయి. ఇంక ఎనిమిదో తేదీ రాత్రి బాగ్ దోడ్రాలో బసచేసి తొమ్మిదో తేదీనే హైదరాబాదుకు తిరిగిరావాలని నిర్ణయించుకున్నాం. నేను, విజయ, అనిత జలదాపారా నుంచి టాక్సీలో బాగ్దోగ్రాకు బయలు దేరాం. సిలిగురి మీదుగానే మా ప్రయాణం. సిలిగురి దరిదాపుల్లో కలవడానికి వీలవుతుందా అంటూ మౌమితా నుంచి ఫోన్ వచ్చింది. ఆమె జలపాయిగురి అనే గ్రామంలో ఉంటుంది. ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల టీచర్ గా పనిచేస్తుంది. దారిలో ఒక హోటల్ దగ్గర తాను అప్పటికే వచ్చి ఎదురుచూస్తూ వుంది. పనీర్ కబాబ్ తింటూ లోకల్ డ్రింక్ సిప్ చేస్తూ సాహిత్య చర్చలో పడిపోయాము. తాను ఇటీవల రాసిన ఇంగ్లీషు పోయిట్రీ బుక్‌ను బహుకరించింది. మా మాటల్లో కథలు, కవిత్వం, విభిన్న సాహిత్యంశాలు చర్చకు వచ్చాయి. గంట సమయం ఎప్పుడు గడిచిందీ తెలియలేదు. డ్రైవర్ ఫోన్ చేస్తూ మేమున్న హోటల్లోకి వచ్చాడు. తరచూ ఆ దారిలో తాను ప్రయాణిస్తున్నా ఆ హోటల్లోపలికి ఎప్పుడూ రాలేదని, ఆ అందమైన హోటల్ పరిసరాలను ఫోటోలు తీసుకున్నాడు. మేమూ కొన్ని ఫోటోలు తీసుకొని బయలుదేరాం. మౌమిత కొంతదూరం మాతో వచ్చి దారిలో దిగివెళ్ళిపోయింది.

డ్రైవర్‌కూ ఆసక్తి

డ్రైవర్‌తో మాటల సందర్భంలో నక్సల్బరీ గ్రామానికి వెళ్లాలనే మా అభిలాషను చెప్పాం. ముందుకొంత అభ్యంతరం చెప్పినా తర్వాత సరేనన్నాడు. నక్సల్బరీ గ్రామం మేం వెళ్ళబోయే బాగ్దోగ్రా విమానాశ్రయానికి 15 కిమీ దూరంలో వుంది. మాటల సందర్భంలో డ్రైవర్ అడిగాడు. " మేడం! మీరు పత్రికలలో రాసేటోల్లా? అందుకే నక్సల్బరీ వెళ్ళాలనుకుంటున్నారా?" అని. అవును, మేం రచయితలం, పత్రికలకు కూడా రాస్తుంటాం. ఆ వూరికి ఒక పోరాట చరిత్ర ఉంది కదా.. దానిని తెలుసుకోవాలని వెళ్లాలనుకుంటున్నాం. అని చెప్పాను. అతను ఉత్సాహంగా ఉన్నాడు. బంగ్లాదేశ్, నేపాల్ దేశాల సరిహద్దులు మేం వెళుతున్న దారిలో కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉన్నాయని దూరం నుంచే వాటిని చూపించాడు.

60 ఏళ్ల చరిత్రకు ప్రతీక నక్సల్బరీ

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఒక కుగ్రామం నక్సల్బరీ. 1967లో ఆ గ్రామంలో రైతులు తిరుగుబాటు చేశారు. తర్వాత కాలంలో అది నక్సలైట్ ఉద్యమానికి దారి తీసిందని అంటారు. అక్కడి రైతులు భూస్వామ్య దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా జల్, జమీన్, జంగల్ నినాదాలతో తిరుగుబాటు చేశారు. ఆ ఆనవాళ్ళు ఇప్పుడేమైనా అక్కడున్నాయా? అని తెలుసుకోవడం కొరకే మా ప్రయాణ కుతూహలం. మేం అనుకొన్నట్లుగా మా వాహనం నక్సల్బరీ గ్రామంలోకి ప్రవేశించింది. ఈ అరవై యేళ్ళ కాలంలో రోడ్లు, బ్యాంకు, ఉన్నత పాఠశాల, ఫోటో స్టూడియో లాంటి వసతులతో అభివృద్ధి చెందినట్లు కనిపించినా లోలోపల పేదరికం తాండవిస్తూనే వుంది. గ్రామమంతటా కాషాయరంగు జెండా తోరణాలు కట్టివున్నాయి. ఆనాటి రైతుల తిరుగుబాటు విషయాలు తెలుసుకోవడానికి మేం వూరంతా చుట్టబెట్టాం. చివరకు ఒక పెద్దాయన ఊరవతల ప్రభుత్వ పాఠశాల పక్క ప్రాంగణంలో ఆ ఆనవాళ్ళు వున్నాయని చెప్పాడు. చాలా సందులు తిరిగి తిరిగి ఆ స్థలానికి చేరుకున్నాం.

మార్క్స్, లెనిన్, చారు మజుందార్ విగ్రహాలు

ఒక ప్రాంగణంలో చారు మజుందార్, మార్క్స్, లెనిన్, ఇంకా కొందరు నాయకుల విగ్రహాలు, స్తూపాలు వున్నాయి. ఎదురుగుండా పచ్చటి పంటపొలాలు కనువిందు చేశాయి. అక్కడ కాసేపు గడిపి, ఫోటోలు తీసుకొని, ఆ పక్కనే కూర్చున్న ఒక్క పెద్దాయనను అడిగాను. ఆనాటి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళ కుటుంబాల వాళ్ళు ఇప్పుడెవరైనా వున్నారా? అని. వాళ్ళను కలిస్తే మరిన్ని వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో.. దానికాయన తనకు ఆ వివరాలు తెలియదని, కొంచెం ముందుకువెళ్తే ఆ ఇంట్లో వాళ్ళున్నారని చెప్పాడు. ఆయింటికి వెళ్ళి అడిగితే ఆయన లేడు బయటికి వెళ్లాడని చెప్పింది. చిరాకు మొహంతో ఆ యింటావిడ. నిరాశతో ఏం చేయాలా? అని ఆలోచిస్తున్నప్పుడు పక్కింట్లో నుంచి ఒక యువకుడు పిలిచి, కుర్చీలు వేసి, వాళ్ళ నాన్నను పిలిచాడు.

భూస్వాముల అణచివేత వల్లే తిరుగుబాటు

ఆయన పేరు భ(వ )ల్లభ సింగ్. సుమారు డెభ్బై యేళ్లుంటాయి. ఇద్దరు అన్నదమ్ములు. మేం వెళ్ళిన పక్క యిల్లు వాళ్ళ అన్నయ్యది. తిరుగుబాటు సమయంలో ఆయన ఆరు ఏడు తరగతుల్లో ఉన్నాడట. వాళ్ళ అమ్మ, నాన్న, అన్నయ్య ఉద్యమంలో పాల్గొన్నారట. కష్టపడి పండించిన పంటనంతా భూస్వాములు తోలుకపోవడం, వాళ్ళ అణచివేతకు విసిగిపోయిన గ్రామస్థులు వారి మీద తిరుగుబాటు చేసారు. అందులో పవన్ సింగ్, చౌహాన్ సింగ్ లాంటి పదకొండుమంది మరణించారట. అంతేకాదు, మన తెలంగాణా రైతాంగ ఉద్యమంలో లాగా చాలా మంది స్త్రీలు ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ నాయకురాలు వాళ్ళ అమ్మ ధనేశ్వరీదేవి. ఆమె కూడా ఆ ఉద్యమం లోనే ప్రాణాలు కోల్పోయిందట. ఆమె స్తూపం కూడా అక్కడ ఉందని చెప్పాడు. ఆ విషయం తెలియాగానే నేను మళ్ళీ ఒకసారి ఆ ప్రాంగణానికి వెళ్ళి ఆమె స్తూపాన్ని, దానిమీద ఆమె పేరును పరిశీలించి వచ్చాను. ఆయనకు వచ్చిన బెంగాలీ భాషలో ఆయన చెప్పడం, మేం హిందీలో మా సందేహ నివృత్తి చేసుకున్నాం. ఇప్పటికీ ఆ యింట్లో పేదరికం స్పష్టంగా కనిపించింది. టీ తాగి వెళ్ళమన్న ఆయన అభ్యర్ధనను సున్నితంగా తిరస్కరించి, తిరుగు ప్రయాణమయాం.

హోటల్ యజమాని భార్యకు తెలుగువచ్చు

బాగ్ దోగ్రాలో మేం బుక్ చేసుకున్న హోటలుకు చేరుకునే సరికి సాయంత్రం ఆరు దాటింది. ఆ హోటలు యజమాని భార్య హైదరాబాదులో ఉన్న బెంగాలీ అమ్మాయి. అందువల్ల తెలుగు వాళ్ళు వచ్చినప్పుడు ఆమెకు పరిచయం చేస్తాడట. మమ్మల్ని కూడా రమ్మని ఆహ్వానించాడు. ఆ అమ్మాయి చక్కగా తెలుగులో మాట్లాడడం సంతోషం అనిపించింది. ఆమె ఈ మధ్యనే చీరల వ్యాపారం మొదలు పెట్టిందట. విజయ ఆమెకు ప్రోత్సాహకంగా ఒక చీర కొన్నది. కొంచెం సేపు ఆ వీధుల్లో తిరిగి డిన్నర్ చేసి గదిలోకి వెళ్ళాం.

ఆపరేషన్ సింధూర్ నుంచి క్షేమంగా తిరుగు ప్రయాణం

అప్పటివరకు హృదయాంతరాళాలలో దాగి వున్న యుద్ధపు టెన్షన్ మళ్ళీ మొదలైంది. ఏ క్షణంలో అయినా విమానం రద్దయిందనే మెసేజ్ రావొచ్చు. ఒకవేళ అయితే .. ఏముంది? కొంత కష్టంతో, ఖర్చుతో కూడుకున్నదే అయినా రోడ్డు దారిలో వెళ్లొచ్చు అనుకొని నిద్రపోయాము. ఉదయమే ఉపాహారం ముగించి, ఐదు కిలోమీటర్ల దూరంలో వున్న బాగ్దోగ్రా విమానాశ్రయానికి టాక్సీలో పోయాం. బాగ్ దోగ్రా విమానాశ్రయం చాలా చిన్నదే కానీ యుద్ధ నేపథ్యంలో హై సెక్యూరిటీ అలెర్ట్ రావడం వల్ల మూడు గంటల ముందుగానే బాగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకోవాల్సి వచ్చింది. సెక్యూరిటీ చెక్ అయిపోయాక కానీ మనసు కాస్తా కుదుట పడలేదు. చివరికి క్షేమంగా హైదరాబాదు చేరుకున్నాం. ఇలా ఆనందం, ఆందోళనతో మా భూటాన్ ప్రయాణం విజయవంతంగా ముగిసింది.

గిరిజ పైడిమర్రి

ట్రావెలర్

99494 43414

(భూటాన్ పర్యటన విశేషాలు సమాప్తం)

Next Story