భూటాన్ .. టైగర్ నెస్ట్ .. మూడో భాగం

by Muthe.Rajitha |

భూటాన్ వెళ్ళిన వాళ్ళు టైగర్ నెస్ట్ ట్రెక్ చేసినప్పుడు మాత్రమే ఆ ప్రయాణం సమగ్రమవుతుంది.

భూటాన్ .. టైగర్ నెస్ట్ .. మూడో భాగం
X

భూటాన్ వెళ్ళిన వాళ్ళు టైగర్ నెస్ట్ ట్రెక్ చేసినప్పుడు మాత్రమే ఆ ప్రయాణం సమగ్రమవుతుంది. అది ఒక భూతల స్వర్గం. ప్రకృతి సౌందర్యంతోపాటు భూటానీయులకు ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రం. అది పారో లోయ నుంచి 10000 వేల అడుగుల ఎత్తులో ఉన్న పర్వత ప్రాంతం. ఇది చాలా ప్రాచీనమైంది. 8వ శతాబ్దంలో గురు పద్మసంభవ 1692లో నాలుగవ డ్రూక్ దేశీ టెంజిన్ రబ్గే రూపంలో మళ్ళీ అవతరించాడని, ఆయనే దానిని నిర్మించాడని చెపుతారు. దాని చుట్టూ ఆసక్తికరమైన చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో నాకు నచ్చిన కథను ఇక్కడ క్లుప్తంగా ప్రస్తావిస్టాను. టైగర్ నెస్ట్ ప్రాచీన నామం పారో తక్త్సాంగ్. టిబెట్లో ఒక మహారాణి తన ఇష్టపూర్వకంగా రిన్ పోచే(పద్మసంభవుని) శిష్యురాలైంది. ఆమె తనను తాను పులిగా మార్చుకొని, గురువును తన వీపు మీద మోసుకొని టిబెట్ నుండి ప్రస్తుత తక్త్స0గ్ ప్రాంతానికి తీసుకు వచ్చిందట. అక్కడ ఉన్న ఒక గుహలో గురువు ధ్యానం చేసాడు కాబట్టి ఆ ప్రదేశం పవిత్రంగా మారింది. అందుకే ఆ గుహకు పులి గూడు అనే పేరు వచ్చిందని చెపుతారు. ఈ కథలో సత్యాసత్యాలను పక్కకు పెడితే స్త్రీ ప్రధానంగా ఉండడం వల్ల నాకు నచ్చింది. అక్కడ వెలిగించే వెన్న దీపాల వల్ల అగ్నిప్రమాదం జరిగిందట. అది I998 ఏప్రిల్ 19న సంభవించింది. విన్నప్పుడు చాలా బాధ కలిగింది. అప్పటి భూటాన్ రాజు జిగ్మే సింగ్యే వాంగ్ చుక్ దెబ్బతిన్న ఆశ్రమాన్ని 2005లో పునర్నిర్మించాడని తెలిసింది. దానికి ₹135 మిలియన్ల ఖర్చు అయిందట.

టైగర్ నెస్ట్ ట్రెక్కింగ్‌ ప్రారంభం

మా భూటాన్ ప్రయాణం దాదాపు చివరకు వచ్చింది. మా బృందంలో పది పన్నెండుగురు మినహా అందరూ టైగర్ నెస్ట్ ట్రెక్కింగ్‌కు సిద్ధమయ్యారు. ఆ రోజు ఉదయం 5.45 ని.లకు హోటల్ లాబీలో సమావేశమయ్యారు. ఆర్గనైజర్ లక్ష్మి ట్రెక్కింగ్ మెళకువలు చెప్పింది. అందరికీ ఎవరి అల్పాహారం పాకెట్ వాళ్ళకిచ్చారు. అవి తీసుకొని బస్ ఎక్కాను. నేను బస్ లోనే బ్రేక్ ఫాస్ట్ ముగించాను. మా కిచ్చిన పాకెట్లో ఒక శాండ్ విచ్, ఒక అరటిపండు, ఒక ఫ్రూటీ, ఒక ప్రొటీన్ బార్, కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి. ట్రెక్కింగ్ చేసే సమయంలో నీరసం వచ్చినప్పుడు తక్షణమే శక్తినిచ్చే ఆహార పదార్థాలు, సరిపడా మంచినీళ్ళు వెంట ఉండడం చాలా ముఖ్యం. మా బ్లు పాపీ ట్రెక్కింగ్ పాయింట్ దగ్గరకు చేరింది. అప్పటికే చిన్నగా వర్షం పడి తగ్గింది. లక్ష్మి అందరిచేత చిన్నపాటి వ్యాయామం చేయించింది.

బాంబూ కర్రలతో ట్రెక్కింగ్

అక్కడే మరో పక్కగా ట్రెక్కింగ్‌కు ఊతంగా ఉండే బాంబూ కర్రలు కిరాయికి ఇస్తున్నారు. వంద రూపాయలిచ్చి నా ఎత్తుకు తగిన తేలిక పాటి కర్రను తీసుకున్నాను. వెళ్ళి వచ్చాక దానిని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రకృతి అవసరాలు కూడా తీర్చుకొని ట్రెక్కింగ్ కు సిద్ధంగా ఉన్నాము. గైడ్ సోనాల్ అందరి దగ్గరా టికెట్ల కొరకు ₹1000/ తీసు కున్నాడు. పైన బౌద్ధాలయం లోనికి ప్రవేశ రుసుం వెయ్యి రూపాయలన్న మాట. మాలో కొందరికి సందేహం వచ్చింది. అప్పటికే మేము చూసిన బౌద్ధులయాలన్నీ దాదాపు ఒకే మాదిరిగా ఉన్నాయి. అంతే కాకుండా అంత పై దాకా మేము ఎక్కగలమో లేదోనన్న సందేహం. ఒకవేళ ఎక్కలేక పోతే వెయ్యి రూపాయలు వృథా అవుతాయి. ఈ రెండు కారణాల వల్ల మేము టికెట్లు వద్దనుకొని మా గైడ్ సోనాల్ ను డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగాము. అయితే అతడు భూటాన్ కరెన్సీ తిరిగి ఇచ్చాడు. మన కరెన్సీ వాళ్ళకు చాలా అవసరం అనుకుంటాను. కానీ మేము మన ఇండియన్ కరెన్సీయే కావాలని అడిగి తీసుకున్నాము.

రెయిన్ కోటులో నడక్.. పైన్ వృక్షాల దారి

ఆకాశం మేఘావృతమై ఉంది. ఏ క్షణంలో అయినా వర్షం పడొచ్చునని రెయిన్ కోట్ వేసుకొని నేను, నవీన నడక మొదలు పెట్టాము. మాతో కొంత దూరం దాకా గైడ్ సోనాల్ అనుసరించాడు. ఆ తరువాత మళ్ళీ మాకు కనిపించలేదు. పొడుగైన పైన్ వృక్షాల పెద్ద పెద్ద వేర్లు నేల పైకి విస్తరించి, వాటిపై నుంచి నడవడం వలన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్క మెట్ల దారి లాగా ఉంది. ఆ వృక్షాలు లేని చోట్ల మట్టి, రాళ్ళతో కూడిన దారి ఉంది. కొండ వంపుల్లో ఎక్కడం కష్టంతో కూడింది. పైకి ఎక్కేటప్పుడు ఆర్గనైజర్లలో ఒకడైన జోసఫ్ నాతోనే ఉండి, నాకు అవసరమైన చోట్ల చేయూత నిచ్చాడు.

దృక్పథాన్ని విశాలం చేసే పర్యటన

అక్కడక్కడ ఆగి క్షణకాలం విశ్రాంతి తీసుకుంటూ అంతటి చలిలోనూ ఆరిపోతున్న గొంతును గుక్కెడు నీళ్ళతో నడుపుకుంటూ పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ మేఘాలలో తేలిపోతూ నడుస్తూ వుంటే అలసటనే తెలియలేదు. కావాల్సినంత ఆక్సిజన్ అందడం వల్ల కాబోలు ఆయాసం అసలే రాలేదు. ఆ పచ్చటి ప్రకృతిలో బౌద్ధ సంస్కృతికి సంబంధించిన విభిన్న వర్ణాల జెండా తోరణాలు ఒక వింత శోభను తెచ్చాయి. దారిలో అక్కడక్కడా చిన్నచిన్న బౌద్ధులయాలు భూటాన్ ప్రజల సంస్కృతికి అద్దం పట్టాయి. మధ్యలో ఒక బౌద్ధ చక్రం దగ్గర ఆగి, దానిని తిప్పి, ఫోటోలు తీసుకొని మళ్ళీ నడక ప్రారంభించాము. కాసేపటికి కెఫ్టేరియా చేరుకున్నాము. అంటే సగం దారి వచ్చామన్నమాట. అక్కడ కాఫీ ₹200/ దానితోపాటు నాలుగు బిస్కట్లు తీసుకొని కెఫ్టీరియా లోపల కాకుండా బయట ఏర్పాటు చేసిన కుర్చీలో ప్రశాంతంగా కూర్చొని ఆ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ప్రకృతిలోని విడ్డూరాలను పరిశీలిస్తూ వేడి వేడి కాఫీ తాగుతుంటే ఉండే ఆనందం .. అబ్బా! ఈ జీవితానికి ఇంకా ఏమీ అవసరం లేదనిపించింది. ప్రాపంచిక భవబంధాలకు అతీతంగా మనసు పరవశించింది. ప్రయాణం ఎప్పటికప్పుడు మన దృక్పథాన్ని విశాలం చేస్తుంది.

పులిగూడు పిలిచింది

అల్లంత దూరంలో .. మబ్బుల చాటునుంచి దోబూచులాడుతున్న పులి గూడు రా! పట్టుకో అని రెచ్చగొట్టింది. కొండ వాలులో నిర్మించిన అందమైన పులిగూడు నిర్మాణానికి ఆనాటి ఇంజినీర్ల ప్రతిభకు సలాం చేయకుండా ఉండలేం. కాసేపటికి మబ్బుల్లోనుంచి బయటకు వచ్చి, తన అందాన్ని మరో కోణంలో కనువిందు చేసి ఏమిటీ? అక్కడే ఆగిపోతారా? రండి! దగ్గరగా రండి! అంటూ తొందర పెట్టింది పులి గూడు. కొన్ని ఫోటోలు తీసుకొని మళ్ళీ నడక మొదలు పెట్టాము. దారి ఇంతకు ముందు వచ్చినట్లుగా కష్టంగా లేదు. సుమారు మూడు కిలోమీటర్లు నడిచి మొదటి వ్యూ పాయింట్ చేరుకున్నాము. అక్కడి నుంచి జోసఫ్ వెళ్ళిపోయాడు. దారిలో అనురాధ, అనిత తిరిగి వస్తూ కనిపించారు. వెళ్ళేటప్పుడు కెఫ్టీరియాలో వాళ్ళు ఆగిలేదని తెలిసింది. అక్కడ ప్రకృతి ఆడే దోబూచులాటలో మేమూ భాగమైనం. ఫోటోలు షరా మామూలే.. అనురాధ వాళ్ళు రెండో వ్యూ పాయింట్ కూడా ఉందని చెప్పడంతో మేము అక్కడి నుంచి బయలుదేరి దాదాపు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న రెండో వ్యూ పాయింట్ కు చేరుకున్నాము.

పులిగూడు చూడకపోతే ఎలా?

అక్కడి నుంచి పులిగూడు మరింత దగ్గరగా కనిపించింది. కొందరు విదేశీయులు, బౌద్ధ సన్యాసులు కూడా అక్కడ వున్నారు. అక్కడి నుంచి అర కిలోమీటర్ నడిచి మెట్లు దిగి, వంతెన మీదుగా నడిచి మెట్లు ఎక్కితే పులిగూడు చేరుకుంటాము. అప్పుడు మొదలైంది నాలో ఘర్షణ. అంతదూరం వెళ్ళగలమో లేదోననే సందేహంతో.. ( చాలా మంది కెఫ్టీరియా నుంచే వెనక్కి వెళ్లిపోయారని తెలిసింది. మా బృందంలో కూడా వైజాగ్ నుంచి వచ్చిన భార్యాభర్తల్లో ఆవిడ గుర్రంపై వెనక్కి వెళ్లిపోయిందని తర్వాత తెలిసింది ) డబ్బులు వృథా చేయడమెందుకని (అప్పటికే ప్రవేశ రుసుముల కింద ₹4000/ దాకా చెల్లించాము). టికెట్ల కొరకు ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసుకున్నాము. కానీ అంత దగ్గరిదాకా వెళ్ళి లోపలికి వెళ్ళలేకపోతున్నందుకు. నా మనసు ఊగిసలాడుతోంది. భూటాన్ ప్రభుత్వం.. పైన కూడా ఒక టికెట్ కౌంటర్ ఏర్పాటు చేసుంటే ఎంత బాగుండేది. అది అక్కడి ప్రభుత్వానికి మరింత ఆదాయ మార్గం కదా.. నా ఈ ఆలోచన తిరిగి వస్తున్నప్పుడు చాలా మంది స్థానిక గైడ్‌లకు చెప్పాను. నేను తిరిగి హైదరాబాదు వచ్చాక భూటాన్ టూరిజం శాఖ వారికి ఈ విషయమై మెయిల్ కూడా పెట్టాను. చూడాలి.. భవిష్యత్తులో నా ప్రతిపాదనను వాళ్ళు ఆచరణలో పెడితే బాగుండు. నాలాంటి ఔత్సాహికులకు లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా..

దారితప్పిన అనుభవం భయానకం

ఆలయానికి ముందుదాకా వెళ్ళి లోపలికి వెళ్ళకపోతే మనసు మరింత కుంగిపోతుందనే భయంతో.. అప్పటివరకూ పొందిన ఆనందాన్ని కోల్పోవడం ఇష్టం లేక, ఊగిసలాడుతున్న మనసును ఊరుకోబెట్టి తిరిగి నడక మొదలు పెట్టాను. అదే ఆలోచనలతో కెఫ్టీరియా చేరుకొని ప్రకృతి అవసరాలు తీర్చుకున్నాం. అప్పటికే మా స్నేహితులు అనురాధ, అనిత అక్కడ కాఫీతాగుతున్నారు. ఈ లోగా వైజాగ్ నుంచి వచ్చిన రోజా కూడా అక్కడికి చేరుకుంది. ఆ చోటు వదిలేస్తే మళ్ళీ అంత అందాన్ని ఎప్పటికి ఆస్వాదించగలమోనని మరి కాసేపు వుండి ఆ అద్భుతమైన అందాన్ని కళ్ళ గుండా మనసులోకి ఒంపుకొని తిరిగి ఐదుగురం నడక ప్రారంభించాం. కబుర్లతో కాలమే తెలియలేదు. కొంత దూరం పోయాక కొండ పైనుంచి కిందకు చూస్తే కింద దారిలో మనుషులు వెళుతున్నట్లు కనిపించలేదు. పక్కదారి నుంచి కొంతమంది యువకులు వెళుతూ కనిపించారు. మేమూ వాళ్ళను అనునరించాము. మా ముందున్న వాళ్ళు వేగంగా మరింత ముందుకు వెళ్ళిపోయారు. కొంత దూరం పోయాక తెలిసింది మేము దారి తప్పి పోయినమని..

జారితే కిందిగి పడిపోవడమే...

అప్పుడే మొదలైంది అసలు అడ్వెంచర్. అది నిటారుగా వున్న పర్వతం. ఎక్కడా ఒక క్షణం ఆగడానికి కూడా అవకాశం లేదు. దిగుతూ ముందుకు సాగరలసిందే .. చాలా ప్రమాదకరంగా వుంది .. వర్షం పడితే .. మరింత ప్రమాదం. లోపల గుబులుగా ఉన్నా పైకి ధైర్యంగా అతి జాగరూకతతో అడుగులు వేస్తున్నాను. ఇంతలో మా వెనక నుంచి ఐదుగురి భూటాన్ యువతుల బృందం మమ్మల్ని సమీపించింది. అందులో ఒక అమ్మాయి "మేడం! ఇది చాలా డేంజర్ దారి. ఈ దారిలో మీరు ఎందుకు వచ్చారు?" అని ప్రశ్నించింది. జరిగిన పొరపాటు చెప్పాను. అంతే ఆ అమ్మాయి నా చేయి పట్టుకొని జాగ్రత్తగా దింపడం మొదలు పెట్టింది. కొద్ది దూరం పోయాక ఆ అమ్మాయిని తన స్నేహితులతో కలిసి వెళ్లిపొమ్మని చెప్పాను. కానీ ఆ అమ్మాయి నా చేయి వదలలేదు. తన స్నేహితులు ముగ్గురు ముందుగా వెళ్ళి చెట్ల కొమ్మల మీద కూర్చొని మా కోసం వేచి ఉండడం, మరో అమ్మాయి తన స్నేహితురాలి కోసం మాతోపాటు నడవడం జరిగింది. కబుర్లతో నాకు కష్టమే తెలియలేదు. వాళ్ళందరూ పన్నెండో తరగతి చదువుతున్న విద్యార్థినిలు. భూటాన్ లోఇంగ్లీషు మీడియం పాఠశాలలు చాలా తక్కువగా ఉన్నాయట. భారతదేశమన్నా హిందీ సినిమాలన్నా చాలా యిష్టమని చెప్పారు. వాళ్లు కూడా శిక్షణ పొంది గైడ్ గా స్థిరపడాలని అనుకొంటున్నారు. హిందీలో ఒక పాట, స్థానిక భాష జోంగ్ఖాలో ఒక జానపద పాట పాడి వినిపించారు. ఇలా కష్టమైన దారిలో నాకు ఆ కష్టాన్ని తెలియ నివ్వకుండా అసలైన దారిలో చేర్చి, నేను నా స్నేహితుల కోసం వేచి చూస్తానని చెప్పడంతో వాళ్ళు వెళ్ళిపోయారు.

గిరిజ పైడిమర్రి

ట్రావెలర్

9949443414

(ఇంకా ఉంది)

Next Story