- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంతోషమే సంపదగా వెలుగుతున్న భూటాన్ - 1
భూటాన్ నా కలలదేశం. ఎందుకంటే.. ఆ దేశంలోని ప్రజలు సంతోషంగా జీవిస్తారని చదివినప్పుడు భూటాన్ వెళ్లాలనే కోరిక కలిగింది.

భూటాన్ నా కలలదేశం. ఎందుకంటే.. ఆ దేశంలోని ప్రజలు సంతోషంగా జీవిస్తారని చదివినప్పుడు భూటాన్ వెళ్లాలనే కోరిక కలిగింది. దేశం చాలా చిన్నది కానీ ప్రకృతి అందాలలో, సాంస్కృతిక పరిరక్షణలో చాలా పెద్దది. ఆర్థికాభివృద్ధి వల్ల మనకు ఎంత సంతోషం కలుగుతుందో మనందరికీ తెలుసు. అందుకే కాబోలు భూటానీయులు శాంతిని సంతోషాన్ని సంపదగా చేసుకొని తదనుగుణంగా జీవిస్తున్నారు. అందుకే ఆ దేశానికి వెళ్ళి అక్కడి ప్రకృతి సౌందర్యంలో పరవశిస్తూ అక్కడి ప్రజలతో మమేకమై వాళ్ళ సంస్కృతీ సాంప్రదాయాలను పరిశీలిస్తూ వారి సంతోషమయ జీవన విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించాలనే ఆతృత నన్ను భూటాన్ పర్యటనకు మళ్ళీ మళ్ళీ ఏర్పాట్లు చేసుకునేలా చేసింది.
మొదటిసారి బియాండ్ బార్డర్ గ్రూపుతో 2016 ఫిబ్రవరిలో భూటాన్ వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకున్నాను. అనివార్య కారణాలవల్ల ఆ ప్రయాణం ఆగిపోయింది. మళ్ళీ 2018 మార్చిలో కాకతీయ ట్రావెల్స్ వాళ్ళతో చేసుకున్న ఏర్పాట్లలో డార్జిలింగ్ నుంచే వెనక్కి రావలసి వచ్చింది. ముచ్చటగా మూడోసారి విజయవంతంగా వెళ్ళి వచ్చాను. రెండుసార్లు భూటాన్ ప్రయాణం ఆగిపోయినందువల్ల అపుడు కొంచెం బాధపడ్డా ఈసారి భూటాన్ వెళ్ళాక అప్పుడు ఆగిపోవడం మంచిదయిందనే అనిపించింది. కారణం ఆ గ్రూపులతో వెళ్ళి వుంటే నాకు టైగర్ నెస్ట్ ట్రెక్ చేసే అవకాశం ఉండేది కాదు. అందుకే 'All is well' అనుకుంటూ ముందుకు సాగడమే జీవన ప్రయాణం.
హైదరాబాద్ టు బెంగాల్ - భూటాన్
హైదరాబాదు yhai మహిళా యూనిట్ విహంగ నుంచి ఎనిమిది మందిమి భూటాన్ ప్రయాణానికి సిద్ధమయ్యాము. yhai మహారాష్ట్ర యూనిట్ ' భూటాన్ డైరీస్' వాళ్ళు ఈ ట్రిప్పును ఏర్పాటు చేసారు. సాధారణంగా yhai ఏర్పాటు చేసే ప్రయాణాలన్నీ వాళ్ళు చెప్పిన రిపోర్టింగ్ ప్రదేశం నుంచే మొదలవుతాయి. కాబట్టి ఆ ప్రదేశం వరకు ప్రయాణీకులు తమ వీలును బట్టి ప్రయాణించ వచ్చు. భూటాన్ టూరుకు సంబంధించి పశ్చిమ బెంగాల్ లోని జయగావ్ అనే ఊరులో మే రెండో తారీఖున రిపోర్టు చేయాలి. కొంతమంది రైలులో కొందరు విమానంలో వారి వారి వీలునుబట్టి అక్కడికి చేరుకున్నారు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బెంగాల్ ఇలా అనేక రాష్ట్రాలనుంచి దాదాపు యాభై మంది దాకా వచ్చారు.
పునేషోలింగ్ గ్రామం సరిహద్దు
హైదరాబాద్ నుంచి నేను, నవీన, అనిత, బస్సులో, శ్రీదేవి, ఆమె కూతురు అంజలి, భండారు విజయ టాక్సీలో ఉదయం 8.30.లకు రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి చేరుకున్నాము. నిబంధనల ప్రకారం అన్నీ పూర్తి చేసాము. 10-30 ని.లకు మా ఇండిగో విమానం బయలుదేరి 12.50 ని.లకు బాగ్ డోగ్రా విమానాశ్రయంలో దిగింది. అనురాధ, రవి తరువాతి విమానంలో వచ్చి అక్కడ కలుసుకున్నారు. బెంగాల్ నుంచి వచ్చిన మరో ఇద్దరు కూడా మాకు జత కలిసారు. ఆరుగురు ఒక వాహనంలో నలుగురు ఒక వాహనంలో జయగావ్‌కు బయలుదేరాం. నాలుగు గంటల ప్రయాణం. సాయంత్రం ఆరుగంటలకు అక్కడికి చేరుకున్నాం. హోటల్ ఐబిస్‌లో మాకు కేటాయించిన గదులలోకి వెళ్ళి, రెడీ అయి, ఓరియంటేషన్ కార్య క్రమానికి వెళ్ళాము. పరస్పర పరిచయాల అనంతరం దేశ సరిహద్దులో ఉన్న ఫునేషోలింగ్ ( Phuensholing ) గ్రామానికి వెళ్ళాము.
అక్కడున్న ఇమ్మిగ్రేషన్ ఆఫీసులో పాస్ పోర్టు చూపించి బయటకు వెళితే భూటాన్ దేశం. అక్కడ భారతీయులు రోడ్డు పనులు చేస్తూ కనిపించారు. వాళ్ళతో మాట్లాడాను. అలా పనుల నిమిత్తం ఇరుదేశాలకు వెళ్ళే వాళ్ళకు బార్ కోడ్ ఉన్న ఐడీ కార్డులు ఇస్తారట. దానిని స్కాన్ చేసి వెళ్లిపోతారట. అలా నడుచుకుంటూ మేము ఒక బౌద్ధ ఆలయానికి వెళ్ళాము. పరిసర ప్రాంతాలన్నీ చూసుకొని, వచ్చిన పద్ధతిలో పాస్ పోర్ట్ చూపించి మళ్ళీ ఇండియాలోకి వచ్చాము. ఆ ఆఫీసు రాత్రి తొమ్మిది గంటలవరకే పనిచేస్తుంది.
భూటాన్ జాతీయ పుష్పం బ్లూ పాపీ
తెల్లారి ఉదయం 8.30 గం.లకు ఉపాహారం ముగించుకొని, హోటల్ చెక్ ఔట్ చేసి, లగేజీతోపాటు కిందకు వచ్చేసరికి 20 మంది కూర్చోగలిగిన మూడు చిన్న బసులు సిద్ధంగా ఉన్నాయి. ఒక్కొక్క బస్‌లో 18 మంది ప్రయాణీకులతో పాటు ఒక గైడ్, ఒక టూర్ ఆర్గనైజర్ కూర్చునే విధంగా ప్రణాళిక సిద్ధం చేసారు. The cypress, the Talkins, The Blue Poppy అనే పేర్లతో ఆ మూడు బసులకు స్టిక్కర్లు అతికించారు. అంటే ప్రయాణీకులు ప్రతిసారి బస్ మారకుండా ప్రయాణం చివరి రోజు దాకా కేటాయించిన బస్ లోనే ఉండడానికి నిర్వాహకులు చేసిన ఏర్పాటు అది. జేమ్స్, పేమా, సోనాల్ అనే ముగ్గురు గైడులు కూడా సిద్ధంగా ఉన్నారు. మా గైడ్ సోనాల్, మేము ఎక్కవలసిన బస్ బ్లూ పాపీ. బస్ డ్రై వర్ పేరు దుర్గా ఖాతా. భూటాన్ జాతీయ పుష్పం పేరు బ్లూ పాపీ, చిన్నగా ముద్దుగా నీలం రంగులో ఉంటుందని గైడ్ సోనాల్ చెప్పాడు. అక్కడి నుంచి మేము నడుచుకుంటూ వెళ్ళి ముందు రోజు సాయంత్రం చేసినట్టుగా గేటు దగ్గర ఒకసారి, కౌంటర్ లో ఒకసారి మా పాస్ పోర్ట్ చూపించి అటు వైపు భూటాన్ దేశంలోకి వెళ్ళేసరికి అక్కడకి మా బసులు వచ్చి సిద్ధంగా ఉన్నాయి. అక్కడ ఎవరికి కేటాయించిన బస్ వాళ్ళు ఎక్కి 15 నిలలో మరొక ఇమ్మిగ్రేషన్ ఆఫీసు ముందు దిగేదాక మాకు భూటాన్ వీసా వచ్చిందనే భ్రమలోనే ఉన్నాం.
వీసాకోసం వందలాది పర్యాటకులు!
మేము లోపలికి వెళ్ళేసరికి వందలాది ప్రయాణీకులు వీసా కోసం వేచి చూస్తూ ఉన్నారు. ఎవరి గైడు వారి బృందం వారి పాస్ పోర్టులు లేదా ఓటరు కార్డులు తీసుకొని వెళ్ళి కౌంటర్ లో ఇచ్చి టోకెన్ తీసు కుంటారు. సోనాల్ కూడా టోకెన్ తీసుకున్నాడు. మా బృందం టోకెన్ నెంబర్ 58. కౌంటర్ నంబర్ 9. ఒక్కొక్కరినీ కౌంటర్ వద్దకు పిలిచి, ఐరిష్ కెమెరాలో ఫోటోతీసి, పేరు, దేశం, ఎన్నిరోజులుంటారు? మొదటి సారి వస్తున్నారా? ఎందుకు వస్తున్నారు? లాంటి మౌలికమైన ప్రశ్నలు అడిగి వీసా మంజూరు చేస్తారు. పాస్ పోర్టులో ఎంట్రీ స్టాంపు వేస్తారు. పాస్ పోర్టు లేని వాళ్ళకు ఓటరు కార్డును అనుమతించి ఈ వీసా ఇస్తారు. ఆధార్ కార్డ్‌ను అనుమతించరు. మా అందరికీ వీసాలు వచ్చేసరికి దాదాపు పదకొండున్నర అయింది. అక్కడే కొందరు భూటాన్ లోకల్ సిమ్ కార్డులు తీసుకున్నారు. తిరిగి మా ప్రయాణం మొదలైంది.
అతి చిన్న దేశాల్లో ఒకటి
హిమాలయ పర్వత శ్రేణులలో ఉన్న చిన్న దేశం భూటాన్. టిబెట్, చైనా, నేపాల్, భారతదేశంలోని సిక్కిం రాష్ట్రం సరిహద్దు దేశాలు. ప్రపంచంలోని చిన్న దేశాలలో ఒకటి. జనాభా ఎనిమిది లక్షలు. ప్రస్తుత రాజధాని థింపూ. బౌద్ధ మతం ప్రధానమైంది. 75 శాతం ప్రజలు బౌద్ధ మతాన్ని అనుసరిస్తున్నారు. 22 శాతం ప్రజలు హిందూమతాన్ని అనుసరిస్తున్నారు. క్రిస్టియన్, ఇస్లామిక్ లాంటి ఇతర మతాల వాళ్ళు చాలా చాలా తక్కువగా ఉన్నారు. భూటాన్ కరెన్సీ గుల్ట్రమ్ ( Ngultrum ) ఇంచుమించు మన రూపాయితో సమానమైన విలువ. ఇండియన్ రూపాయి కూడా చెల్లుబాటు అవుతుంది. అయితే మన డబ్బు తీసుకుంటారు కానీ వాళ్ళ కరెన్సీయే మనకు తిరిగి ఇస్తారు. ఇరుదేశాల రూపాయి నోట్లు ఇంచుమించు చూడడానికి ఒక్కతీరుగానే కనిపిస్తాయి. వాళ్ళ రూపాయి నోటు మీద వాళ్ళ రాజు బొమ్మ ఉంటుంది. భూటాన్ ప్రజల అధికార భాష జోన్ఖా. విద్యాబోధన కూడా ఆ భాషలోనే ఉంటుంది. కానీ కొన్ని ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు కూడా ఉన్నాయని గైడ్ సోనాల్ చెప్పాడు.
థింపూ మార్గంలో హరితవర్ణం
మా ప్రయాణం థింపూ వైపుగా సాగింది. 150 కి.మీ దూరం. దాదాపు నాలుగు గంటల ప్రయాణం. గ్రీన్ లాండ్, క్లీన్ లాండ్, గ్రీన్ భూటాన్ అనే బోర్డులు తరచుగా కనిపించాయి. ఎటుచూసినా హరిత వర్ణం కళ్ళకు ఆనందాన్నిచ్చింది. గతంలో గంటకు ఒక మిలియన్ మొక్కలు నాటి, భూటాన్ ప్రజలు ప్రపంచ రికార్డు సృష్టించారని గైడ్ సోనాల్ చెప్పాడు.ఎత్తైన కొండలు, లోతైన కోనలు.. అంతటా ఆకుపచ్చని అందాలే.. సూర్యకాంతి తాకిడితో హరిత వర్ణంలోని తళతళలు మనసును మైమరపింపజేసాయి. తామున్నామంటూ అక్కడక్కడా జాలు వారుతున్న జలపాతాలు. దారి పొడుగునా తోర్స, తీస్లా నదుల సంగమం మమ్మల్ని వెంబడించింది. భూమండలంలోని స్వర్గానికి ప్రయాణమయ్యామా! అన్న ఆనందం ఉక్కిరి బిక్కిరి చేసింది.
జలపాతం తుంపరలో తడిసి...
దూరంగా కొండ వాలుగా ఏడెనిమిది ఇళ్ళతో కూడిన గ్రామాలు ఎన్నో తారసపడ్డాయి. ఇళ్ళ ముందరే కొంతనేల చదును చేసుకొని సాగు చేసుకుంటున్నారు. దారి మధ్యలో ఒకచోట ఆగి భోజనాలు ముగించి, ఆ అందమైన ప్రకృతిలో లీనమై, కొంచం దూరం నడిచి ఫోటోలు తీసుకున్నాము. తిరిగి ప్రయాణం మొదలైంది. కొంత దూరం వెళ్ళాక కొండ కొనలలో నడిచారు కదా .. ఇప్పుడు జలపాతాన్ని ఆనందించండి. అంటూ మా ఆర్గనైజర్ లక్ష్మి ఒక జలపాతం దగ్గర బసును ఆపమని చెప్పింది. అంత చలిలో కూడా జలపాతం తుంపరలో పాక్షికంగా తడుస్తూ ఆనందించాము. అలా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మేము పునాఖా చేరే సరికి సాయంత్రం ఆరు దాటింది. చల్లటి చలిలో వెళ్ళిన మాకు వెచ్చటి టీతో స్వాగతం చెప్పారు హోటల్ వాళ్ళు. అరగంటలో రెడీ అయి షాపింగ్ కు వెళ్ళాము. టాక్సీ లో ఒక్కరికి 50 రూపాయలు తీసుకున్నాడు. ఒకచోట సేల్ కనిపిస్తే 450 రూపాయల రెయిన్ కోటు 180 రూపాయలకు కొన్నాను. తొమ్మిది గంటలవరకు హోటలుకు చేరుకొని డిన్నర్ చేసి పడుకున్నాము.
డ్రక్ వాంగ్యాల్... 108 బౌద్ధ స్తూపాలు
తెల్లవారి ఉదయం అల్పాహారం ముగించి పునాఖా బయలుదేరాము. థింపూ నుంచి 73 కిమీ దూరం. రెండుగంటల ప్రయాణం. వెళ్ళే ఘాట్ రోడ్డులో పచ్చని అడవులు, ఎత్తైన కొండలు సందర్శకులను అబ్బుర పరుస్తాయి. మార్గమధ్యంలో 38 కిమీ దూరంలో ఉన్న డోచ్ లా పాస్ కు ముందుగా వెళ్లాము. అది 10,171 అడుగుల ఎత్తులో ఉన్న పర్వత ప్రాంతం. అక్కడ వాతావరణం క్షణాల్లో మారి పోతుంది. మేము వెళ్ళినప్పుడు ఆ ప్రాంతమంతా దట్టమైన పొగమంచుతో కప్పబడి ఉంది. అక్కడ డ్రక్ వాంగ్యాల్ అనే 108 బౌద్ధ స్తూపాలున్నాయి. అవి భూటాన్ వారసత్వ సంపద వాస్తు శిల్పానికి, ఆధ్యాత్మికతకు ప్రతిబింబం. వాటిని వాళ్ళ పూర్వీకుల గౌరవార్థం, జ్ఞాపకార్థం నిర్మించారని చెపుతారు. మూడు వర్తులాకార అంతస్తులుగా నిర్మించారు. మొదటి రౌండులో 45 చోర్టెన్లు, రెండవ రౌండులో 36 చోర్టెన్లు , పైభాగంలో 27 చోర్టెన్లు (స్తూపాలు) ఉంటాయి. మేము వెళ్ళి నప్పుడు వసంతకాలం కావడం వల్ల పసుపు, తెలుపు రంగుల పువ్వులు కనువిందు చేసాయి.
చిని లఖాంగ్ దేవాలయం
తరువాత మేము చిని లఖాంగ్ దేవాలయానికి వెళ్ళాము. దీనికే ఫర్టెలిటి టెంపుల్ అనే పేరు కూడా ఉన్నది. ప్రవేశ రుసుము ₹ 500. సుమారు రెండు కిలోమీటర్ల ట్రెక్ చేయాలి. భూటాన్ ప్రజల సంస్కృతికి ఈ ఆలయం ప్రత్యక్ష నిదర్శనం. వంధ్యత్వంతో బాధపడే జంటలు ఈ ఆలయానికి వచ్చి మొక్కుకుంటే పిల్లలు పుడతారని నమ్ముతారు. గుడి లోపల పురుషాంగం పూజలు అందుకుంటుంది. డివైన్ మ్యాన్‌కు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. భూటానీయుల సంస్కృతిలో పురుషాంగం ప్రధానమైంది. దానిని వాళ్ళు చాలా పవిత్రంగా భావిస్తారు. ఇళ్ళ గోడలపైన ఆ చిత్రాలు కనిపిస్తాయి. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలతోపాటు వచ్చి మొక్కులు తీర్చుకున్న వారి ఫోటో ఆల్బమ్ చూసాక ఆ నమ్మకం అంతర్జాతీయంగా ఉందనిపించింది. ఎందుకంటే అందులో విదేశీయుల ఫోటోలు కూడా ఉన్నాయి.
భూటాన్‌లో పురుష నదులు
అక్కడి నుంచి జో నదీ తీరానికి వెళ్ళాము. ఆకు పచ్చని కొండల నడుమ, తెల్లటి, గుండ్రటి గులకరాళ్ళ తీరంతో ఆ ప్రదేశం చాలా అందంగా ఉంది. మో చు ( స్త్రీ తల్లి ), పో చు ( పురుష తం డ్రి ) నదుల సంగమమే జో నది. భారతదేశంలో దాదాపు నదులన్నీ స్త్రీ రూపాలుగానే భావిస్తాం. కానీ భూటాన్ లో పో చు లాంటి పురుష నదులు ఉండడం విశేషం. నదులను తల్లి దండ్రుల స్వరూపాలుగా కూడా భావిస్తారని గైడ్ సోనాల్ చెప్పాడు. అందమైన ఆ నదీ తీరంలో మేము మధ్యాహ్న భోజనాలు ముగించి పునాఖా కోట వైపుగా సాగిపోయాము.
పునాఖా కోట.. ఒకప్పటి రాజధాని
తరువాత పునాఖా ద్జోంగ్ (Dzong) లేదా పునాఖా కోటకు వెళ్ళాము. ప్రవేశ రుసుము ₹500. భూటాన్ లోని చారిత్రక ప్రదేశాలలో ఇది ఒకటి. ఒకప్పుడు పునాఖా భూటాన్‌కు రాజధానిగా ఉండేది. 1955 వరకు ఈ కోట నుంచే ప్రభుత్వ పరిపాలనా కార్యక్రమాలు కొనసాగేవి. దీనిని 1637 లో జబ్ డ్రంగ్ న్గావాంగ్ నాంగ్యాల్ నిర్మించారు. మో చు, పో చు అనే రెండు నదుల సంగమమైన జో నదీ ద్వీపంలో ఈ కోట ఉన్నది. రాయి, ఇటుక, మట్టి, కలపతో నిర్మించిన కోట మూడు భాగాలుగా ఉన్నది. విశాలమైన ప్రాంగణంలో పెద్ద బోధి వృక్షం ఉంది. పై అంతస్తులోకి ప్రవేశం లేదు. చెక్క ఫ్లోరింగ్, బౌద్ధ జాతక కథల అందమైన చిత్రాలు, బంగారు పూతపూసిన విగ్రహాలు సందర్శకులను కట్టి పడేస్తాయి. భూటాన్ మొదటి రాజు అయిన ఉగ్యెన్ వాంగ్ చుక్ పట్టాభిషేకం 1907లో ఇక్కడే జరిగిందని చెపుతారు. కోట అంతా తిరిగిచూసి అక్కడికి దగ్గరలో ఉన్న సస్పెన్షన్ బ్రిడ్జి మీదుగా అవతలి తీరానికి వెళ్ళాము. ఇది చాలా పొడవైన వేలాడే వంతెన. వర్షం మొదలైంది. అక్కడున్న కెఫెటేరియాలో వేడి కాఫీ తాగి, ఆ వర్షంలోనే సస్పెన్షన్ బ్రిడ్జి పైన నడిచి వస్తుంటే కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. పిల్ల బౌద్ధ సన్యాసులతో పోటీపడి పరిగెత్తడం బాల్యాన్ని గుర్తుచేసింది.
(ఇంకా ఉంది.)
గిరిజ పైడిమర్రి
99494 43414
- Tags
- bhutan






