- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బౌద్ధ సన్యాసులూ, జాతక కథలూ.. భూటాన్ పర్యటన 2వ భాగం
గత రెండురోజులుగా ఎటు పోయినా అల్లంత దూరం నుంచే ఆకర్షిస్తున్న బుద్ధుడిని చేరువనుంచి చూడడానికి వెళ్ళాము.

గత రెండురోజులుగా ఎటు పోయినా అల్లంత దూరం నుంచే ఆకర్షిస్తున్న బుద్ధుడిని చేరువనుంచి చూడడానికి వెళ్ళాము. గ్రేట్ బుద్ధ డోర్డెన్మా విగ్రహం. దానిని ప్రపంచ శాంతి, శ్రేయస్సుకు సంకేతంగా చెపుతారు. ఇది ప్రపంచంలోని ఎత్తైన బుద్ధ విగ్రహాలలో ఒకటి. బుద్ధ విగ్రహం ఎత్తు 54 మీటర్లు. 177 అడుగులు. విగ్రహాన్ని కంచుతో తయారు చేసి, బంగారు పూత తాపడం చేశారు. ఆ విగ్రహం అంతర్భాగంలో అలాంటివే సూమారు ఒక లక్షా ఇరవై ఐదువేల బంగారు పూత పూసిన చిన్న విగ్రహాలున్నాయని చెప్పారు. దీని నిర్మాణం 2006 మొదలై 2010 పూర్తిచేయాలని అనుకున్నారట. కానీ 25 సెప్టెంబర్ 2015 వరకు పూర్తి చేశారు. మొత్తం ఖర్చు us డాలర్లు వంద మిలియన్లకు పైగా అయిందట. 2011 లో అధికారికంగా ప్రజల దర్శనార్థం అనుమతిచ్చారు. ₹ 1000/ ప్రవేశ రుసుము.
వేలాది బౌద్ధ సన్యాసుల ధ్యానం
కొండపైకి వెళ్ళగానే ఎదురుగా వేలాది మంది బౌద్ధ సన్యాసులు ధ్యానం చేస్తూ కనిపించారు. ధ్యాన మందిరాలను దాటుకొని ముందుకు వెళితే విభిన్నమైన, అందమైన బౌద్ధ హిందూ శిల్పాలు దర్శనమిస్తాయి. మెట్లు ఎక్కి పైకి వెళితే కొండ లోయలో ఉన్న థింపూ నగరం వ్యూ చాలా బాగుంటుంది. చుట్టూరా బంగారు పూతతో ఉన్న ఎత్తైన ద్వార బంధాలున్నాయి. ఒక ద్వారబంధంలో మన ప్రతిబింబాలు మనకు కనిపిస్తాయి. అక్కడ నిలబడి ఫోటో తీసుకుంటే బంగారు ఫ్రేం లో మన ఫోటో భలే అందంగా కనిపిస్తుంది. పైన అంతా తిరిగిచూసి, ఆలయం లోపలికి వెళ్ళాను. బంగారు పూతతో మెరిసిపోతూ ఉంది. గోడలమీద బౌద్ధ జాతక కథల చిత్రాలున్నాయి. నాకు తెలియకుండానే ఒక రకమైన ప్రశాంతత మనసును ఆవరించింది. తిరిగి వెళ్ళేటప్పుడు మెట్ల మీదుగా కిందికి వెళ్ళాము. సుమారు 350 మెట్లున్నాయి.
బౌద్ధం పక్కనే నందులు, శివలింగాలు
అక్కడినుంచి పదినిమిషాల్లో ఒక హిందూ దేవాలయానికి వెళ్ళాము. భూటాన్‌లో 22% హిందూ మతం ఉంది. అక్కడ ఒక కుటుంబం హోమం చేస్తూ కనిపించింది. బయట ప్రాంగణంలో ఒక పక్కగా నల్లరాతి పెద్ద శివలింగం, దానికి ఎదురుగా నంది ఉన్నాయి. దాన్ని దాటుకొని గుడి లోపలికి వెళితే నల్లరాతితో ఉన్న దుర్గాభవాని విగ్రహం చాలా అందంగా ఉంది. లోపల గర్భగుడి గోడలమీద అనేక హిందూదేవతల చిత్రాలున్నాయి. అన్నీ చూసుకొని బయటకు వచ్చాను. ప్రాంగణంలో ఒక హాలులో నిర్వాహకులు ఉచితంగా టీ ఇచ్చారు. రుచి సంగతి పక్కన పెడితే చల్లటి వాతావరణంలో ఆ వెచ్చటి టీ ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ తరువాత సింప్లీ భూటాన్ మ్యూజియం సందర్శించడానికి వెళ్ళాము.
మ్యూజియంలో బియ్యం విస్కీ
భూటాన్ వాసుల సంస్కృతి, సంప్రదాయాలు, జానపదకళలు, వంటల రుచి, పానీయం రుచి చూడాలంటే సింప్లీ భూటాన్ మ్యూజియం తప్పకుండా చూడాలి. ప్రవేశ రుసుము వెయ్యి రూపాయలు. ఒకొక్క బృందానికి ఒక గైడ్‌ను కేటాఉంచారు. మా గైడ్ పేరు గీత. భూటాన్ జానపద సాంప్రదాయ దుస్తుల్లో చూడముచ్చటగా ఉంది. లోపలికి ప్రవేశించగానే ముందుగా అందరిని గుండ్రంగా కూర్చోబెట్టారు. తర్వాత చిన్న గిన్నెలను అందరికీ ఇచ్చారు. అందులో భూటాన్ సంప్రదాయ విస్కీని పోసారు. అంటే విస్కీతో మాకు స్వాగతం చెప్పారన్నమాట. ఆ విస్కీ పేరు 'అరా'. దానిని ఒక ప్రత్యేకమైన బియ్యంతో తయారు చేస్తారని గైడ్ గీత చెప్పింది. రెండుమూడు రౌండ్స్ తాగే సదుపాయం కూడా ఉంది. మాలో కొంతమంది ఆస్వాదించారు. కొందరు ఆ రుచిని ఏవగించుకున్నారు.
సంగీత వాయిద్యాలు.. పవిత్ర పురుషాంగాలూ...
అక్కడి నుంచి ఒక చిన్న ప్రాంగణం లోకి వెళ్ళాము. అక్కడ ముగ్గురు భూటాన్ యువకులు జానపద సంప్రదాయ వేషధారణతో రెండు నిమిషాలు నృత్యం చేస్తూ మాకు స్వాగతం చెప్పారు. ఆ పక్కనే ఉన్న వరండాలో రకరకాల మాస్కులు, సంగీత వాయిద్యాలున్నాయి. గీత ఆయా మాస్కుల రూపాలు వాళ్ళ సంస్కృతిలో దేనికి ప్రతీకలో వివరించింది. అవి మన దేవతల ముఖాల లాగా (హనుమంతుడు, నరసింహస్వామి మొ.) అనిపించింది. ఆ పక్కనే ఉన్న సంగీత వాయిద్యాల గురించి కూడా చెప్పింది. వాటిలో కొన్ని మన సితారా, తంబురా లాగా ఉన్నాయి. మరో పక్కగా ఉన్న చిన్న డివైన్ గార్డెన్ లోకి వెళ్ళాము. ఆ గార్డెన్‌లో భిన్న సైజులలో ఉన్న పురుషాంగాలు ఉన్నాయి. భూటాన్ సంస్కృతిలో పురుషాంగం పూజనీయము. దానిని వాళ్ళు చాలా పవిత్రంగా చూస్తారు. అందుకే కాబోలు ఆ చిన్ని తోటకు ' డివైన్ గార్డెన్ ' అని పేరు పెట్టారు.
పేద దివ్యాంగుడు.. అందమైన బొమ్మలు
తరువాత మరో గదిలోకి వెళ్ళాము. అక్కడ వారి సంప్రదాయ వంటపాత్రలు ఉన్నాయి. చాలా వరకు చెక్క, లోహంతో చేసినవి ఉన్నాయి. స్వాగత పానీయంగా ఇచ్చిన విస్కీని తయారు చేసే పాత్ర కూడా అక్కడ ఉంది. భూటాన్ ప్రజల టీ కూడా ప్రత్యేకమైంది.. వాటిని ఎలా తయారు చేస్తారో గీత వివరించింది. ఆ గది దాటి మరో చిన్న ప్రాంగణంలోకి వెళ్ళాము. అక్కడ రకరకాల ఎండిన కూరగాయల వరుసలున్నాయి. వాటిలో మిరపకాయలు, మొక్కజొన్న కంకులు, యాక్ పాలతో చేసిన చీజ్ మొదలైనవి ఉన్నాయి. భూటాన్‌లో ఎండలున్నప్పుడే ఇలా ఎండబెట్టి అవసరమైనప్పుడు వాడుకుంటారని గైడ్ గీత చెప్పింది. ఇప్పటికీ వాళ్ళు ఆ పద్ధతిని పాటిస్తారు. అక్కడే ఒక పక్కగా ఎంతో లీనమై పెయిటింగ్ వేస్తున్న చిత్ర కళాకారుడు నన్ను ఆకర్షించాడు. అతనికి చేతులు లేవు. దివ్యాంగుడు. కాళ్లతోనే అందమైన బొమ్మలు వేస్తున్నాడు. అతని పేరు పేమా త్సరింగ్ (Pema Tshering). అతని చిత్రకళా నైపుణ్యానికి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఎన్నో వచ్చాయని ఆ షాప్‌లో చూసినప్పుడు తెలిసింది. అయినా బీదరికం అతన్నే అంటిపెట్టుకొని ఉందని అతనిని చూస్తే అర్థమైంది. ఒక వాల్ పెయింటింగ్ కొన్నాను. ఒక్కటి వెయ్యిరూపాయలు. దాని వెనక తన సంతకం చేసి మరీ ఇచ్చాడు. నా స్నేహితులు కూడా కొన్నారు.
ఏకాగ్రతను సూచించే బుద్ధ విగ్రహం
భూటాన్ దేశం ఆట ఆర్చరీ. విలువిద్య లాంటిది. అనాదిగా అది వాళ్ళ సంప్రదాయ విద్య కూడా.. అక్కడ చాలా మంది ఆ విద్యలో తమ నైపుణ్యాన్ని పరీక్షించుకున్నారు. అందులో గెలిచిన వాళ్ళు స్థానికులతో నాట్యం చేయొచ్చు. ఆ పక్కగా అదృష్టాన్ని పరీక్షించుకునే మరో ఆట ఉంది. ఒక కంచు గోళం నిండా నీళ్ళున్నాయి. దాని మధ్యలో చక్రానికి అమర్చబడిన ఒక చిన్న పాత్ర ఉంది. పక్కన కొన్నినాణాలున్నాయి. మనం ఒక్కో నాణాన్ని ఆ పాత్రలోకి విసరాలి. తిరుగుతున్న ఆ పాత్రలో మనం విసిరిన నాణాలు వరుసగా మూడు పడితే ఆ వ్యక్తి అదృష్ట వంతుడన్నమాట. ఆ అమరికకు వెనక వైపు ప్రశాంతమైన బుద్ధ విగ్రహం ఉంది. సరదాగా ఆ ఆట ఆడాను. ప్రశాంతత, ఏకాగ్రత ముఖ్యమనే విషయం వెనక ఉన్న బుద్ధ విగ్రహం చెప్పకనే చెపుతున్నట్లుంది.
అక్కడి నుంచి ఒక హాలులోకి వెళ్ళాము. అక్కడ అందరూ చుట్టూతా కూర్చునే ఏర్పాట్లున్నాయి. అందరికీ భూటాన్ టీతో పాటు స్వీటు, స్నాక్స్ రుచికి ఇచ్చారు. వాటిని తింటూ అక్కడ భూటానీ అమ్మాయిలు చేస్తున్న నృత్యాన్ని ఆస్వాదిస్తూ .. తర్వాత మేము కూడా వాళ్ళతో ఆడిపాడాము. అక్కడితో భూటాన్ సంస్కృతీ సంప్రదాయాలను తెలిపే మ్యూజియం సందర్శన అయిపోయింది.
పురాతనమైన పారో కోట
అక్కడినుంచి 53 కిమీ దూరంలో పారో నగరానికి ప్రయాణం సాగింది. భూటాన్ దేశానికి రాజధాని థింపూ నగరమే అయినా అంతర్జాతీయ వినూనాశ్రయం మాత్రం పారో నగరంలో ఉంది. దీనికి కారణం భౌగోళికమైనది. పారో నగరం లోయ ప్రాంతంలో ఉన్నది. అందువల్ల చుట్టూ కొండల మధ్యలో కొంత చదునైన ప్రాంతం ఉండడం వల్ల విమానాశ్రయ ఏర్పాటు సాధ్యమైంది. మేము దూరం నుంచే దారిలో ఉన్న విమానాశ్రయాన్ని చూస్తూ పారో కోటకు చేరుకున్నాము. ఇది చాలా పురాతనమైంది. ఇక్కడ ప్రవేశ రుసుము లేదు. అప్పటికే సాయంత్రం కావడంతో మేము గబగబా కోటను చుట్టి వచ్చాము. కోట గోడల మీద బౌద్ధ జాతక కథల చిత్రాలు సందర్శకులను ఆకర్షిస్తాయి. నిర్మాణ శైలిలో థింపూ కోటకన్నా పారో కోట నాకు చాలా నచ్చింది. అక్కడి నుంచి హోటల్ పెంచూలో మాకు కేటాయించిన గదుల్లోకి వెళ్ళిపోయాము. కొందరు షాపింగ్‌కు వెళ్ళారు. తెల్లవారి ఉదయమే టైగర్ నెస్ట్ ట్రెక్ చేయాలి కాబట్టి నేను షాపింగ్‌కు వెళ్ళకుండా విశ్రాంతి తీసుకున్నాను.
గిరిజ పైడిమర్రి
ట్రావెలర్
9949443414
- Tags
- bhutan






