బాల కవయిత్రి గాయత్రి

by Ravi |   (  Updated:2026-06-01 00:30:29  IST  )

Gayatri Manipoosalu Book Review

బాల కవయిత్రి గాయత్రి
X

నేడు పాఠశాల స్థాయి పిల్లలు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టిస్తున్నారు. వికారాబాద్ జిల్లా, పెద్దేముల్ మండలంలోని కందనెల్లి ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు వడిచర్ల సత్యం గారు తాను రూపొందించిన 'మణిపూసల' ప్రక్రియలో విద్యార్థులకు తర్ఫీదునిస్తూ వారిలో దాగిన సృజనాత్మకతను వెలికితీస్తున్నారు.

ప్రతి కవితా సందేశాన్నిచ్చేదే!

అలా వారి ప్రోత్సాహంతో పదవ తరగతి విద్యార్థిని బింగి గాయత్రి రచించిన కవితలు గాయత్రి మణిపూసలు పేరుతో పుస్తక రూపంలో రావడం విశేషం. ఈ పుస్తకంలో గాయత్రి సాగించిన మణిపూసల విన్యాసం అభినందనీయం. అమ్మానాన్నలు, గురువు, చదువు, రైతు, ఆడపిల్ల వంటి సామాజిక అంశాలను చిన్న చిన్న పదాలతో, సరళ సుందరంగా మలిచింది. శ్రీ గణేశ వందనంతో ప్రారంభమైన ఈ పుస్తకంలో ప్రతి కవితా ఒక సందేశాన్ని ఇస్తుంది.

గురు భక్తి గురించి

అమ్మ మాట మధురము

నాన్న మాట శ్రేష్టము

భవిష్యత్తును వివరించు

గురువు మాట జ్ఞానము!

అమ్మానాన్నలు, గురువుల మార్గనిర్దేశనంలో నడిస్తే విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఈ చిన్ని కవిత ద్వారా గాయత్రి చక్కగా వివరించింది.


పర్యావరణ స్పృహ

మొక్క లెన్నొ నాటుదాం

శుభ్రత పాటించుదాం

ప్లాస్టిక్‌ను వాడకుండ

చేయి చేయి కలుపుదాం!

నేటి సమాజానికి అత్యవసరమైన పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిషేధంపై ఈ బాల కవయిత్రి చూపిన స్పృహ అభినందనీయం.


రైతు గొప్పతనం

పంటలన్ని పండించును

మనకన్నం అందించును

బాధలు భరిస్తూ రైతు

జీవితాన్ని నడిపించును!

అనేక కష్టనష్టాలను ఓర్చుకుంటూ లోకానికి అన్నం పెట్టే రైతు వెతలను, వారి గొప్పతనాన్ని ఈ మణిపూసలో ప్రతిబింబించింది.


జీవిత సత్యం

జీవితంలోన మలుపులు

ఉంటాయోన్నో కుదుపులు

ఎదుర్కొని దాటితేనే

లభిస్తాయి నీ గెలుపులు!

జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే విజయం సిద్ధిస్తుందని చెప్పడం గాయత్రి పరిణతికి నిదర్శనం.

ఇందులోని కవితలన్నీ పాడుకోవడానికి అనువుగా, వినడానికి వినసొంపుగా ఉన్నాయి. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలించి గాయత్రి రాసిన ఈ మణిపూసలు సహజ సిద్ధంగా సాగాయి. పిల్లలకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఉన్న ఈ పుస్తకం అందరూ చదవదగ్గది. భవిష్యత్తులో గాయత్రి కలం నుండి మరెన్నో సాహిత్య మణిహారాలు జాలవారాలని ఆకాంక్షిస్తూ అభినందనలు.

పుస్తకం: గాయత్రి మణిపూసలు,

రచయిత్రి: బింగి గాయత్రి,

వెల: రూ. 30/-

ప్రతులకు: బింగి శంకర్, 9553372896


సమీక్షకులు..

కందుకూరి భాస్కర్,

97034 87088

Next Story